లీడర్‌‌షిప్ అంటే క్రెడిట్ తీసుకోవడం కాదు..కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఫైర్

లీడర్‌‌షిప్ అంటే క్రెడిట్ తీసుకోవడం కాదు..కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఫైర్
  • పహల్గాం దాడికి రక్షణ మంత్రి, హోం మంత్రి బాధ్యత వహించారా?
  • కాంగ్రెస్​ ఎంపీ ప్రియాంక గాంధీ ఫైర్​
  • యుద్ధాన్ని మధ్యలో ఆపడం చరిత్రలో ఇదే తొలిసారి
  • ఉగ్రదాడిలో గాయపడ్డవారికి కనీసం ప్రాథమిక చికిత్స కూడా అందించలే
  • సీజ్‌ఫైర్​ ప్రకటన ట్రంప్​ చేస్తారా?.. ఇది మోదీ బాధ్యతారాహిత్యమే
  • అసలు దేశంలో పౌరుల ప్రాణాలకు రక్షణ ఎవరిదని ప్రశ్న

న్యూఢిల్లీ: శత్రువులు ఎక్కడికీ వెళ్లలేని సమయంలో  పాక్‌‌తో యుద్ధాన్ని ఎందుకు ఆపారని  కేంద్ర సర్కారును కాంగ్రెస్​ ఎంపీ ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. యుద్ధాన్ని మధ్యలో ఆపడం చరిత్రలో ఇదే తొలిసారని తెలిపారు. మంగళవారం లోక్‌‌సభలో ‘ఆపరేషన్​ సిందూర్’పై చర్చ సందర్భంగా ప్రియాంకా గాంధీ మాట్లాడారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా ప్రసంగాన్ని టార్గెట్​ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. నెహ్రూ గురించి, తన తల్లి కన్నీళ్ల గురించి మాట్లాడిన అమిత్​షా.. అసలు పాక్‌‌తో యుద్ధాన్ని ఎందుకు ఆపారో చెప్పలేదని నిలదీశారు. భారత్‌‌–-పాక్‌‌ల మధ్య కాల్పుల విరమణ ప్రకటనను అమెరికా అధ్యక్షుడు చేయడమేంటని మండిపడ్డారు. ఇది మన ప్రధాని మోదీ  బాధ్యతారాహిత్యమేనని అన్నారు. నాయకత్వం అంటే క్రెడిట్​ తీసుకోవడం మాత్రమే కాదని.. బాధ్యత తీసుకోవడం అని చెప్పారు. తన నానమ్మ ఇందిరాగాంధీ గొప్ప దేశభక్తురాలని, యూఎస్ ​ప్రెసిడెంట్​ నిక్సన్‌‌ను ఎదుర్కొని పాకిస్తాన్‌‌ను రెండుగా విభజించారని చెప్పారు. కానీ ఆమె ఏనాడూ ఆ క్రెడిట్​ తీసుకునేందుకు ప్రయత్నించలేదని కొనియాడారు.  

నష్టం జరగకుంటే ఎందుకు దాస్తున్నారు?

ఆపరేషన్​ సిందూర్​ సమయంలో భారత్​ ఫైటర్ జెట్స్​కోల్పోకుంటే.. పార్లమెంట్‌‌లో ఆ విషయం ఎందుకు చెప్పడంలేదని కేంద్ర సర్కారును ప్రియాంక ప్రశ్నించారు. పహల్గాం దాడిని నిరోధించడంలో నిఘా సంస్థల వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని అడిగారు. ‘‘నా తల్లి కన్నీళ్ల గురించి సభలో చర్చించారు. నేను దీనికి సమాధానం చెప్పాలనుకుంటున్నా. భర్త 44 ఏండ్ల వయసులో ఉగ్రవాదుల చేతిలో అమరుడైతే నా తల్లి కళ్ల వెంట కన్నీళ్లు వచ్చాయి. ఈ రోజు నేను ఈ సభలో నిల్చొని పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన 26 మంది గురించి మాట్లాడుతున్నాను.. నాకు వారి బాధ తెలుసు.. నేనూ అనుభవించిన’’ అని వ్యాఖ్యానించారు.

మన దౌత్యం విఫలం

ఆపరేషన్ సిందూర్ లక్ష్యం పాకిస్తాన్‌‌కు గుణపాఠం చెప్పడమేనని, కానీ బహుశా ఇది నెరవేరకపోవచ్చని ప్రియాంకా గాంధీ అన్నారు. ఎందుకంటే  మన దౌత్యం విఫలమైందని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడితో రక్తంతో తడిసిన చేతులతో ఉన్న ఓ పాకిస్తాన్ జనరల్ భోజనం చేయడమే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు.

ఉగ్రదాడిలో చనిపోయినోళ్లందరూ అమరవీరులే

పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన  భారతీయులందరూ అమరవీరులేనని ప్రియాంకా గాంధీ అన్నారు. వారందరి పేర్లను సభలో చదివి వినిపించారు. ‘‘కాశ్మీర్‌‌లో ఉగ్రవాదం ముగిసిన అంకమని, అక్కడ పర్యటించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. కానీ.. అక్కడ జరిగింది మరొకటి. శుభం ద్వివేదీకి వివాహమై ఆరు నెలలే అయ్యింది. ఏప్రిల్‌‌ 22న అందరి టూరిస్టుల్లాగే పహల్గాంలో ఆ జంట ఆనందంలో మునిగిపోయింది. అడవుల్లో నుంచి వచ్చిన ఉగ్రవాదులు వాళ్లపై తెగబడ్డారు. భార్య కళ్ల ముందే శుభంను చంపేశారు. గంట వ్యవధిలో మరో 25 మందిని పొట్టనబెట్టుకున్నారు. ప్రతీరోజూ వేలాది మంది పర్యటించే ఆ ప్రాంతంలో ఒక్క సైనికుడు కూడా కాపలాగా ఎందుకు లేడు?  వాళ్లు ప్రభుత్వాన్ని నమ్మి వస్తే.. ఈ ప్రభుత్వం దేవుడి మీద భారం వేసి వాళ్లను అలా వదిలేసిందా? ఈ దాడికి బాధ్యత వహిస్తూ  రక్షణమంత్రి, ఇంటెలిజెన్స్‌‌ చీఫ్‌‌ బాధ్యత వహించారా?అని నిలదీశారు.