నేడు ప్రియాంక, రేపు రాహుల్‌‌ రాక.. ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్‌‌ చేసిన కాంగ్రెస్‌‌

 నేడు ప్రియాంక, రేపు రాహుల్‌‌ రాక.. ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్‌‌ చేసిన కాంగ్రెస్‌‌
  • ప్రచారానికి ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ సీఎంలు, ఏఐసీసీ నేతలను తీసుకొచ్చే యోచన
  • హైదరాబాద్‌‌తో పాటు పలు నియోజకవర్గాల్లో డీకే ప్రచారం

హైదరాబాద్, వెలుగు: పోలింగ్‌‌ దగ్గరపడుతుండటంతో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్‌‌ పార్టీ స్పీడప్‌‌ చేసింది. ఇప్పటికే స్టేట్‌‌ లీడర్లు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తుండగా, ఇప్పుడు జాతీయ ముఖ్య నాయకులు వరుసగా తెలంగాణకు రానున్నారు. ఇందులో భాగంగా ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌‌, ప్రియాంక గాంధీ ఈ నెల 24, 25 తేదీల్లో రాష్ట్రంలో ప్రచారం నిర్వహించనున్నారు. శుక్ర, శనివారాల్లో ప్రియాంక గాంధీ రాష్ట్రంలో పలుచోట్ల ప్రచారం చేయనుండగా, 25న రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించనున్నారు. 24న మధ్యాహ్నం ప్రియాంక గాంధీ పాలకుర్తి, హుస్నాబాద్, సాయంత్రం కొత్తగూడెంలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 25న ఉదయం ఖమ్మం, పాలేరు, మధ్యాహ్నం సత్తుపల్లి, మధిరల్లో నిర్వహించనున్న ప్రచార సభల్లో పాల్గొననున్నారు. అదే రోజు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. శనివారం రాహుల్ గాంధీ మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. నాందేడ్ నుంచి హెలికాప్టర్‌‌‌‌లో మధ్యాహ్నం 12 గంటలకు బోధన్‌‌కు చేరుకొని ప్రచారం చేయనున్నారు. అక్కడి నుంచి ఆదిలాబాద్, వేములవాడల్లో నిర్వహించనున్న ప్రచార సభల్లో రాహుల్ పాల్గొంటారు.

కాంగ్రెస్ సీఎంలు కూడా..

ప్రియాంక, రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ నేతలు కూడా రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే రణ్‌‌దీప్ సుర్జేవాలా, పి.చిదంబరం వంటి నేతలు రాష్ట్రానికి వచ్చి, ప్రచారం చేశారు. కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆ రాష్ట్ర మంత్రులు ఇక్కడికి వచ్చి ప్రచారం, ప్రెస్‌‌మీట్లు నిర్వహిస్తున్నారు. శుక్ర, శనివారం డీకే శివకుమార్ రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. శుక్రవారం స్టేషన్ ఘన్‌‌పూర్‌‌‌‌లో కార్నర్ మీటింగ్‌‌లో ఆయన పాల్గొంటారు. అదే రోజు వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. రాత్రి అంబర్‌‌‌‌పేట నియోజకవర్గంలో కార్నర్ మీటింగ్‌‌లో పాల్గొననున్నారు. శనివారం హైదరాబాద్‌‌లోని పలు నియోజకవర్గాల్లో కార్నర్ మీటింగ్‌‌లు, రోడ్ షోలలో ఆయన పాల్గొననున్నారు. రాజస్థాన్‌‌ సీఎం అశోక్ గెహ్లాట్, హిమాచల్‌‌ ప్రదేశ్‌‌ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు, చత్తీస్‌‌గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ వంటి వాళ్లను ప్రచారం కోసం వచ్చే చాన్స్​ ఉంది.