ప్రో కబడ్డీ: నయా చాంపియన్‌ ఎవరో!

ప్రో కబడ్డీ: నయా చాంపియన్‌ ఎవరో!

అహ్మదాబాద్‌‌: మూడు నెలలుగా అభిమానులను అలరిస్తున్న ప్రొ కబడ్డీ లీగ్‌‌ ఏడో సీజన్‌‌ తుది అంకానికి చేరుకుంది. టైటిల్‌‌ గెలిచి కొత్త చాంపియన్‌‌గా  ఏ జట్టు నిలవనుందో మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది. సెమీఫైనల్లో మాజీ చాంపియన్లకు షాకిస్తూ  తొలిసారి ఫైనల్‌‌ బెర్త్‌‌లు ఖారారు చేసుకున్న దబాంగ్‌‌ ఢిల్లీ, బెంగాల్‌‌ వారియర్స్‌‌ జట్ల మధ్య శనివారం టైటిల్‌‌ ఫైట్‌‌ జరుగనుంది. బలబలాల పరంగా సమతూకంతో ఉన్న ఈ ఇరుజట్ల మధ్య పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది. టైటిల్‌‌ ఎవరు గెలుస్తారనేది పెద్ద విషయం కాదని, అభిమానులు మాత్రం ఓ రసవత్తరమైన మ్యాచ్‌‌ను చూడబోతున్నారని ఇరు జట్ల కోచ్‌‌లు అభిప్రాయపడ్డారు.

‘సమంగా ఉన్న ఈ ఇరు జట్లలో ఎవరు గెలుస్తారనే విషయం ఎవరికీ తెలియదు. మా ఆటగాళ్లు మాత్రం శాయశక్తులా పోరాడుతారు’ అని దబాంగ్‌‌ ఢిల్లీ కోచ్‌‌ కృష్ణ కుమార్‌‌‌‌ హుడా తెలిపాడు. అంతేకాకుండా ఈ సీజన్‌‌లో అదరగొట్టిన కొంతమంది ఆటగాళ్లకు జాతీయ జట్టులో అవకాశం దక్కుతుందన్నాడు. ఢిల్లీ జట్టులో మేరాజ్‌‌ షేక్‌‌, నవీన్‌‌ కుమార్‌‌, రవీందర్‌‌, జోగిందర్‌‌ నర్వాల్, విశాల్‌‌ మానె, ప్రతీక్‌‌ పాటిల్‌‌, రైడింగ్‌‌లో అమన్‌‌ కడియాన్‌‌, చంద్రన్‌‌ రంజిత్‌‌ కీలకం కానున్నారు. బెంగాల్‌‌లో రైడర్‌‌ మణిందర్‌‌ సింగ్‌‌, రాకేశ్‌‌ నర్వాల్‌‌, డిఫెండర్‌‌ బల్దేవ్‌‌ సింగ్‌‌, నవీన్‌‌ నర్వాల్‌‌, అమిత్‌‌ చెలరేగితే ఢిల్లీకి కష్టాలు తప్పవు. ఈ ఫైనల్లో తలపడే ఇరు జట్ల కోచ్‌‌లు ఒకప్పుడు గురుశిష్యులు కావడం విశేషం. బెంగాల్‌‌ వారియర్స్‌‌ కోచ్‌‌ బీసీ రమేశ్‌‌ నేషనల్‌‌ ప్లేయర్‌‌‌‌గా ఉన్నప్పుడు ఆ జట్టుకు చీఫ్‌‌ కోచ్‌‌గా కృష్ణకుమార్‌‌‌‌ హుడా సేవలందించాడు. ‘ఫైనల్లో ఇరు జట్ల ఆటగాళ్లు శక్తి మేరకు పోరాడుతారనిభావిస్తున్నా.  అయితే అదృష్ణం కూడా కీలక పాత్ర పోషించనుంది. ఈ సారి రెండు కొత్త జట్లు ఫైనల్‌‌కు రావడం సంతోషంగా ఉంది. ప్రపంచానికి మేం అసలైన కబడ్డీని చూపించబోతున్నాం.’అని బెంగాల్‌‌ కోచ్‌‌ రమేశ్‌‌ పేర్కొన్నాడు.