మోడల్ స్కూల్ ఒకేషనల్ టీచర్ల అవస్థలు

మోడల్ స్కూల్ ఒకేషనల్ టీచర్ల అవస్థలు

హైదరాబాద్, వెలుగు : ఏ ఉద్యోగికైనా ఒకటీ, రెండు నెలల జీతాలు రాకుంటేనే అనేక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది సమగ్ర శిక్షా అభియాన్​(ఎస్ఎస్ఏ) పరిధిలో పనిచేసే ఉద్యోగులకు ఏకంగా ఐదు నెలల జీతాలు రాక అవస్థలు పడుతున్నారు. దసరా, దీపావళికీ జీతాలు ఇవ్వకుండా అధికారులు ఆ కుటుంబాల్లో పండుగ వాతావరణం లేకుండా చేశారు. రాష్ట్రంలో 194 మోడల్ స్కూల్స్ ఉండగా, వాటిలో 388 మంది ఒకేషనల్ టీచర్లు ఉన్నారు. ఒక్కో స్కూల్​లో నైన్త్  క్లాస్ నుంచి ఇంటర్ వరకూ రెండేసీ ఒకేషనల్ కోర్సులున్నాయి. ప్రధానంగా  కంప్యూటర్స్, అగ్రికల్చర్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, ఎలక్ర్టానిక్స్ అండ్ హార్డ్ వేర్, బ్యూటీ అండ్ వెల్ నెస్, రిటైల్, కుట్టుమిషన్ తదితర పది రకాల కోర్సులున్నాయి. ఆయా కోర్సుల్లో చేరిన స్టూడెంట్లకు పాఠాలు చెప్పే ఒకేషనల్ టీచర్లకు నెలకు రూ.20 వేల వేతనం అందిస్తున్నారు. వారికి ఇంకా కొత్త పీఆర్సీ అమలు చేయలేదు. అయితే వారికి గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నెల జీతం కూడా పెండింగ్ లో ఉన్నది. ఈ అకాడమిక్ ఇయర్ లో జులైలో వారిని రీఎంగేజ్ చేశారు. దీంతో జులై నుంచి అక్టోబర్ వరకూ జీతాలు రాలేదు. మొత్తంగా ఐదు నెలల జీతాలు పెండింగ్​లో ఉన్నాయి. అయితే తమకు జీతాలిచ్చే ఏజెన్సీలకు అధికారులు చెల్లింపులు చేయకపోవడంతో, జీతాలు అందడం లేదని టీచర్లు చెప్తున్నారు. ఆ ఏజెన్సీలకూ ఫిబ్రవరి, మార్చి నెల వేతనాలు పెండింగ్​లో పెట్టినట్లు సమాచారం. ఇచ్చే తక్కువ జీతం కూడా నెలనెలా ఇవ్వకపోవడంతో ఒకేషనల్ టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీతాల కోసం ఏకంగా సమగ్ర శిక్షా అభియాన్ డైరెక్టరేట్ ఆఫీసు ముందు ధర్నా కూడా నిర్వహించారు. అయినా అధికారుల్లో చలనం రాలేదు. నెలల తరబడి జీతాలు రాకుంటే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. జీతాల పెండింగ్ విషయమై ఎస్ఎస్ఏ ఏఎస్పీడీ రమేశ్​​ను ఫోన్ లో సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఆయన స్పందించలేదు. 

పెండింగ్ జీతాలు ఇవ్వాలి 

మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న మాకు ఐదు నెలలుగా జీతాలు పెండింగ్​లో ఉన్నాయి. దసరా లేదా దీపావళికి జీతాలు వస్తాయని ఆశపడ్డాం. కానీ రాలేదు. నెలల తరబడి జీతాలు రాక కుటుంబ పోషణ భారంగా మారింది. అప్పులు తెచ్చి కుటుంబాలు నడుపుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, పెండింగ్ జీతాలు రిలీజ్ చేయాలి. పీఆర్సీని అప్లికేబుల్ చేసి, నెలనెలా జీతాలు వచ్చేలా చూడాలి.
- శివకుమార్, ఒకేషనల్ టీచర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు