
- తమ శాఖల్లో లోటుపాట్లనూ చక్కదిద్దని మంత్రులు
- మంత్రుల నుంచి కలెక్టర్ల దాకా.. సమస్యలు పరిష్కరించాలంటూ కేటీఆర్ రిక్వెస్ట్‌లు
- మున్సిపల్, ఐటీ మంత్రిగా బిజీగా ఉంటూనే
- ఇతర శాఖల పనులూ చక్కబెడుతున్నరు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏ తిప్పలు ఎదురైనా మంత్రి కేటీఆర్ తప్ప ఇంకెవ్వరూ పట్టించుకోవడం లేదు. ట్విట్టర్‌లో తమ గోడు చెప్పుకుంటూ ఆయనకు ట్యాగ్ చేస్తే తప్ప జనం ఇబ్బందులకు పరిష్కారం దొరకడం లేదు. మున్సిపల్, ఐటీ, ఇండస్ట్రీస్ మంత్రిగా, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నిత్యం బిజీగా ఉండే కేటీఆర్.. పార్టీ, తన శాఖల పనులతోపాటు మొత్తం పాలన వ్యవహారాలు చక్కబెట్టాల్సి వస్తున్నది.
రాష్ట్రంలో సీఎంతో పాటు 17 మంది మంత్రులున్నారు. అయితే సమస్యల పరిష్కారం విషయంలో ఇతర మంత్రులు చొరవ చూపడం లేదు. ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు తమ బాధ్యతలు సరిగా నిర్వర్తించకపోయినా కేటీఆర్ ట్వీట్ చేసి ఫలానా పనిచేసిపెట్టండి అని కోరాల్సి వస్తున్నది. గల్ఫ్‌లో చిక్కుకున్నోళ్లను ఇక్కడికి రప్పించాలన్నా, గుంతలు పడ్డ రోడ్లను బాగు చేయాలన్నా, రోగం ముదిరి ప్రాణాల మీదికి వచ్చినా, చిన్నపాటి ఉద్యోగం కావాలన్నా, ఇంకే సమస్యలు, ఆపదలు ఎదురైనా కేటీఆర్‌కు ట్వీట్ చేస్తే.. ఆయన రియాక్ట్ అయితే తప్ప అవి పరిష్కారమవడం లేదు. మొత్తంగా రాష్ట్ర పాలన మొత్తం కేటీఆరే మోయాల్సి వస్తున్నది. దీంతో ఆయనపై పని ఒత్తిడి పెరుగుతున్నది.
బాసర ట్రిపుల్ ఐటీలోనూ..
బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళనకు దిగితే వాళ్లవి సిల్లీ డిమాండ్స్ అంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొట్టిపారేశారు. విద్యార్థులు వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగించడంతో కేటీఆర్ స్పందించా రు. స్టూడెంట్లతో చర్చించాలని మంత్రికి సూచించా రు. దీంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ట్రిపుల్ ఐటీకి వెళ్లిన సబిత.. విద్యార్థులతో చర్చించి కొన్ని సమస్యలు పరిష్కరించారు. తర్వాత కేటీఆర్ స్వయంగా వెళ్లి విద్యార్థులతో మాట్లాడి ఇంకొన్ని డిమాండ్లు నెరవేర్చుతామని హామీ ఇచ్చారు.
కేటీఆర్ స్పందించినంకనే నిందితుల అరెస్టు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో కేటీఆర్ ట్వీట్ చేసే వరకు పోలీసులు తమ డ్యూటీ చేయలేదు. ఈ కేసులో ప్రజాప్రతినిధుల కుమారులు నిందితులుగా ఉండటంతో కేసు నమోదు చేయడానికి జాప్యం చేశారు. కేటీఆర్ ట్విట్టర్‌లో హోం మంత్రి మహమూద్ అలీని, డీజీపీని కోరిన తర్వాతే నిందితులను అరెస్ట్ చేశారు. సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం, హత్య ఉదంతంలోనూ కేటీఆర్ ట్వీట్ చేస్తే తప్ప కేసులో కదలిక రాలేదు.
చివరికి నిందితుడు రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. ఒక ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురుగా వెళ్లి నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారని పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంపై కేటీఆర్ స్పందిస్తూ తెలంగాణలో ‘ఇన్‌స్టంట్ జస్టిస్’ జరుగుతుందని కామెంట్ చేశారు.
బావా.. చిన్న రిక్వెస్ట్
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కేటీఆర్ ఇటీవల గట్టుప్పల్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ దగ్గరికి దివ్యాంగ యువతి వచ్చి తనకు జీఎన్‌ఎం ఉద్యోగం ఇప్పించాలని కోరింది. స్పందించిన కేటీఆర్.. అప్పటికప్పుడే మంత్రి హరీశ్‌రావుకు ఫోన్ చేశారు. ‘బావా.. చిన్న రిక్వెస్ట్’ అంటూ చండూరు పీహెచ్‌సీలో జీఎన్‌ఎం ఉద్యోగం యువతికి ఇప్పించారు.
ఐదేండ్ల చిన్నారి బాగోగులు చూడాలంటూ..
ఏడాది కిందట నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ఎడ్‌బిడ్ గ్రామానికి చెందిన చెందిన ఐదేండ్ల చిన్నారి తన తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలిపోయింది. తల్లి మృతదేహం దగ్గర దీనంగా కూర్చున్న చిన్నారి ఫొటోను ఓ వ్యక్తి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీంతో ఆ చిన్నారి బాగోగులు చూడాలని కోరుతూ నిర్మల్ జిల్లా కలెక్టర్‌కు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసే వరకు చిన్నారి దీనావస్థను క్షేత్రస్థాయి యంత్రాంగం కనీసం పట్టించుకోలేదు. చిన్నారి సంరక్షణ బాధ్యత తీసుకోవాల్సిన స్త్రీశిశు సంక్షేమ శాఖ.. మంత్రి స్థాయిలో ఆదేశాలు వస్తే గానీ స్పందించలేదు.
పిల్లలు గురుకులాలకు.. వికలాంగుడికి పింఛన్
ఏడాది కిందట నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ఎడ్‌బిడ్ గ్రామానికి చెందిన చెందిన ఐదేండ్ల చిన్నారి తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారింది. దీనిపై ఎవరో కేటీఆర్‌కు ట్వీట్ చేయగా, ఆ చిన్నారి బాగోగులు చూడాలని నిర్మల్ జిల్లా కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు.
నకిరేకల్ మండలం యల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన అక్కాతమ్ముడు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. వాళ్లకు చదువుకోవాలన్న ఆశ ఉన్నా బతుకుబండి లాగేందుకు తాతతో కలిసి గొర్రెలు మేపడానికి వెళ్లగా, ఎవరో వారి దీనస్థితిని వీడియో తీసి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీంతో ఆ చిన్నారులిద్దరిని గురుకుల విద్యాలయాల్లో చేర్పించాలని నల్గొండ కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు.
మేడ్చల్ జిల్లాకు చెందిన సత్యనారాయణ అనే కూలి ప్రమాదంలో రెండు చేతులు కోల్పోగా, ట్విట్టర్‌లో కేటీఆర్ దృష్టికి తీసుకువస్తే వికలాంగుల పింఛన్‌తో పాటు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించారు.
జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పోతారంలో కరెంట్ లూజ్ లైన్‌లు సరి చేయాలని రైతులు ఎన్నిసార్లు అడిగినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఒక రైతు లూజ్ లైన్ల కింద నిలబడి కేటీఆర్‌కు వీడియోను ట్వీట్ చేశారు. ఆయన వెంటనే లూజ్‌లైన్‌లు సరిచేయాలని అధికారులను ఆదేశించారు.
నిజాం కాలేజీ హాస్టల్ గొడవ
నిజాం కాలేజీలో నిర్మించిన హాస్టల్ భవనాన్ని తమకు కేటాయించాలని కోరుతూ డిగ్రీ విద్యార్థినులు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. కేసులు పెడుతామని బెదిరింపులకు గురి చేశారు. అయినా భయపడకుండా విద్యార్థినులు ఆందోళన కొనసాగించారు. విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులు, ఉన్నత విద్యామండలి, ఓయూ వీసీ, నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ తమ సమస్యకు పరిష్కారం చూపించాలని వేడుకున్నారు.
వారం రోజులవుతున్నా వీళ్ల గోడు పట్టించుకున్న వాళ్లే లేరు. ఈ నేపథ్యంలో విద్యార్థినుల ఆందోళనను కొందరు కేటీఆర్‌కు ట్వీట్ చేయగా.. వెంటనే ఆ సమస్యకు పరిష్కారం చూపించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, కాలేజీ ప్రిన్సిపాల్‌ను కోరుతూ ఆయన రీ ట్వీట్ చేశారు. దీంతో స్పందించిన మంత్రి సబిత.. తానే స్వయంగా సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.
చెప్తే కానీ చేస్తలే
తన శాఖల వ్యవహారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే కేటీఆర్.. మిగతా శాఖల మంత్రులు పని చేయకున్నా, స్పందించకున్నా తన దృష్టికి వస్తే వాటి పరిస్థితి ఏమిటో చూడాలంటూ సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులను కోరుతున్నారు.ఇలా కేటీఆర్ ట్విట్టర్‌లో సూచించే అనేక పనులు రొటీన్‌గా కావాల్సి ఉన్నా సంబంధిత మంత్రులు, అధికారులు వాటిని లైట్ తీసుకుంటున్నారు.
ఆ సమస్య కేటీఆర్ వరకు వస్తేనే పరిష్కారమవుతుంది. ఆయన దృష్టికి రాని ఎన్నో సమస్యలు ఏండ్లకేండ్లు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం చేయాల్సిన రొటీన్ వ్యవహారాలను కూడా కేటీఆరే గుర్తు చేసి వారితో చేయించాల్సి రావడంపై విమర్శలు ఉన్నాయి. కేటీఆర్‌కు వస్తున్న ట్విట్టర్ రిక్వెస్టుల్లో ఎక్కువ శాతం అత్యవసర వైద్య సహాయం అందించాలనే ఉంటున్నాయి.