ఇవేం ఇండ్లు సారూ: పెచ్చులు ఊడిపోతున్నయ్

ఇవేం ఇండ్లు సారూ: పెచ్చులు ఊడిపోతున్నయ్

ఇచ్చిన డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లు కూడా సక్కగ లేవని లబ్ధిదారుల ఆవేదన

హైదరాబాద్, వెలుగు: ‘‘డబుల్‌ బెడ్‌ రూంల కన్నా మా గుడిసెలే నయముండె. ఈ ఇండ్లు  పైన పటారం.. లోన లొటారం..  బయట నుంచి చూసేటోళ్లకు రంగురంగుల బిల్డింగ్ కనవడ్తది. లోపలికి వచ్చి చూస్తేనే మా బాధలు అర్థమైతయ్. బాత్ రూమ్ ల పెచ్చులూడుతున్నయ్. గచ్చు కూడా సక్కగ లేదు. మెయింటెనెన్స్ కట్టుమని ఆగంజేస్తున్నరు. నెలకు 11 వందలు ఎట్లియ్యాలే. కూలీపని చేసుకుని బతికేటోళ్లం’’ .. ఇదీ ఎల్బీనగర్​లోని నాంచారమ్మ బస్తీలోని డబుల్​ బెడ్రూం ఇంట్లో ఉంటున్న ఓ మహిళ ఆవేదన. రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఇండ్లు కట్టిస్తామని చెప్పి.. ఇచ్చింది 2 వేలలోపు ఇండ్లే. ఆ ఇండ్లలో కూడా సౌలతులు సరిగా లేవు. వాటిలో ఉండలేకపోతున్నామని జనం అంటున్నారు. ఊడి పడుతున్న పెచ్చులు, సిమెంట్‌ పోతున్న గచ్చులు, పని చేయని లిఫ్టులు, ఎప్పటికొస్తయో తెలియని నీళ్లు, మెయింటెనెన్స్‌ పేరుతో ఇబ్బందులు.. డబుల్​ బెడ్రూం ఇండ్లలోని జనాన్ని కదిలిస్తే చెప్పే మాటలివి.

ఎక్కడిక్కడ సమస్యలే..

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అపార్ట్​మెంట్లలో అడుగడుగునా సమస్యలే ఉన్నాయి. లిఫ్ట్ దగ్గర నుంచి ఇంటిలోపలి ఫ్లోరు, పైకప్పు వరకు అన్ని చోట్ల సమస్యలే. ‘‘నేను ఐదో ఫ్లోర్ లో నా కొడుకుతో ఉంటున్న. నా వయసు 50కిపైనే ఉంటది. లిఫ్ట్ లోకి ఎక్కిన తర్వాత నడుమలనే ఆగిపోతది. దిగుదామంటే చేతకాదు. ఒక్కోసారి అసలుకే పని చేయదు. మెట్లు దిగి పోదమంటే దేవుడు గుర్తొస్తడు. మోకాళ్ల నొప్పితో దిగుతుంటే నరకం కనిపిస్తది. కండ్లళ్ల నీళ్లు దిరుగుతయ్‌. ఒకటే గోస ఉంది బిడ్డా ఈ ఇండ్లల” అని కొండమ్మ అనే మహిళ గోడు వెళ్లబోసుకుంది. ఇండ్లలో గోడలు, పెచ్చులు ఊడుతున్నాయి. ఇల్లు కడిగిన నీళ్లు పోవడానికి, వర్షపునీరు పోవడానికి ఎలాంటి ఫెసిలిటీ కల్పించలేదు. దీంతో నీళ్లు ఎత్తి బాత్రూమ్ లలో పోసుకుంటున్నామని అక్కడి ప్రజలు చెబుతున్నారు. మెయింటెనెన్స్  కట్టకపోతే కరెంటు, నీళ్లు ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెచ్చులు ఊడిపోతున్నయ్
5 నెలల నుంచి డబుల్ బెడ్రూం ఇంట్ల ఉంటున్నం. ఈ ఇండ్లల్ల ఏమీ సక్కగ లేదు. పెచ్చులు ఊడిపోతున్నయ్. బాత్రూమ్ ల అడుగుపెడితే సున్నం రాలుతున్నది. మొన్నం వర్షం పడ్డప్పుడు
నీళ్లన్నీ ఇంట్లకొచ్చినయ్. అవి పోడానికి దారిలేదు. రాత్రంతా కూసుని ఎత్తిపోసుకున్నం. ఒక్కో ఇంటికి రూ. 1,100 మెయింటెనెన్స్. కట్టకపోతే కరెంట్ కట్ చేస్తున్నరు. –  కొండమ్మ, నాంచారమ్మ బస్తీ