ప్రైమరీ స్కూల్స్​లో కష్టంగా మారిన ‘తొలిమెట్టు’ కార్యక్రమం అమలు

 ప్రైమరీ స్కూల్స్​లో కష్టంగా మారిన ‘తొలిమెట్టు’ కార్యక్రమం అమలు

హైదరాబాద్, వెలుగు: ఒకరు, ఇద్దరు టీచర్లు ఉన్న ప్రైమరీ స్కూల్స్​లో ‘తొలిమెట్టు’ కార్యక్రమం అమలు కష్టంగా మారింది. ఈ ప్రోగ్రామ్ లో పాఠాలు చెప్పుడు కంటే.. ప్లాన్లు రాసుడే ఎక్కువగా ఉంది. క్లాసుకొక టీచర్ ఉన్న బడుల్లోనే దీన్ని అమలు చేయగలమని టీచర్లు చెబుతున్నారు. ఒకరు, ఇద్దరు టీచర్లున్న బడుల్లో రోజువారీ క్లాసులు, ఆఫీసు పనుల నిర్వహణకే టైమ్ చాలడం లేదని.. ఈ ప్రోగ్రామ్ ఎట్ల అమలు చేయాలో విద్యాశాఖ ఓ టైమ్ టేబుల్ ఇవ్వాలని కోరుతున్నారు. స్టూడెంట్లలో కనీస సామర్థ్యాలను సాధించేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. 

నాస్ సర్వేలో చివర..

రాష్ట్రంలో 21 వేలకుపైగా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 10 లక్షల మంది స్టూడెంట్లున్నారు. కరోనా వల్ల రెండేండ్లుగా స్టూడెంట్లు చదువులో వెనుకబడిపోయారు. ఇటీవలి నిర్వహించిన నాస్ సర్వేలో ఇది వెల్లడైంది. మన రాష్ట్రం దేశంలో చివరి స్థానంలో నిలిచింది. పిల్లల్లో సామర్థ్యం పెంచేందుకు కేంద్రం ఫౌండేషన్‌‌ లిటరసీ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్​) కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణలో దీన్ని ‘తొలిమెట్టు’ పేరుతో ఆగస్టు15 నుంచి అమలు చేస్తున్నారు. 

బేస్ లైన్ టెస్టుల ఆధారంగానే..

స్టూడెంట్స్​కు ప్రతి నెలా బేస్ లైన్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ వివరాలు ఎఫ్ఎల్ఎన్ యాప్​లో ఎక్కించాల్సి ఉంది. ఈ యాప్ సరిగా పనిచేయడం లేదని టీచర్లు చెబుతున్నారు. ఈ ఏడాది 140 రోజుల పాటు క్లాసులు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. వారంలో 5 రోజులు పాఠాలు చెప్పేందుకు వీక్లీ ప్లాన్ రెడీ చేయాలి. ఆరో రోజు వారికి టెస్ట్ పెట్టి, వారి స్టడీ లెవెల్ గుర్తించాలి. ప్రతీ నెల పరీక్ష పెట్టాల్సి ఉంది. నెలాఖరులో స్కూల్, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్నారు.

ఒక్క టీచర్​కు 18 క్లాసులు

రాష్ట్రంలో 4 వేలకు పైగా బడులు ఒక టీచర్​తో, 8 వేలకు పైగా స్కూళ్లు ఇద్దరు టీచర్లతో నడుస్తున్నాయి. ఈ స్కూల్స్​లో సుమారు 4 లక్షల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. సరిపడా స్టాఫ్​ ఉన్న స్కూల్స్​లో ఒక టీచర్​ 4 క్లాసులు తీసుకుంటే, ఒకే టీచర్​ ఉన్న బడిలో 18 క్లాసులు చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి చోట ప్రతి క్లాస్​కు ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడం, వీక్లీ, మంత్లీ రివ్యూ మీటింగ్​లకు ఎలా అటెండ్​ కావాలో చెప్పాలని టీచర్లు అధికారులను ప్రశ్నిస్తున్నారు. 

తనిఖీల పేరుతో వేధింపులు.. 

‘తొలిమెట్టు’ ఎలా అమలవుతుందని తెలుసుకునేందుకు ఎంఈఓ నుంచి డైరెక్టర్​ దాకా ఫీల్డ్​లో ఎంక్వైరీ చేస్తున్నారు. టీచర్ క్లాసులు చెబుతుంటే, అక్కడే ఉండి వింటున్నారు. ఎవరినీ బెదిరించొద్దని, నోటీసులివ్వొద్దని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలిచ్చినా, అధికారులు పట్టించుకోవడ లేదు. ఎవరో అబ్జర్వ్​ చేస్తున్నారనే ఆలోచనతో పాఠాలు సరిగ్గా చెప్పలేకపోతున్నామని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సింగిల్ టీచర్ ఉన్న చోట కష్టమే 

తొలిమెట్టు కార్యక్రమం క్లాసుకొక టీచర్ ఉన్న చోట అమలు చేయొచ్చు. కానీ సింగిల్, డబుల్ టీచర్లున్న స్కూల్స్​లో కష్టమే. అన్ని క్లాసులకు ఒక్కరే టీచర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సాధ్యం కాదు. చదువుతో పాటు ప్లాన్ రాయడం, ఇతర అకాడమిక్ పనులు చేయడం ఇదంతా ఆ స్కూళ్లలో కష్టం. - సిలివేరు అనిల్ కుమార్, యూటీఎఫ్ నాయకులు

టీఎల్ఎం సామగ్రి సర్కారే ఇవ్వాలి

ప్రతీ టీచర్​కు క్లాస్​ ప్లాన్స్, లెస్సన్​ ప్లాన్, టీఎల్​ఎం సామగ్రి ప్రభుత్వమే ఇవ్వాలి. ఎఫ్ఎల్ఎన్ పర్యవేక్షణకు ఎవరూ వ్యతిరేకం కాదు. కానీ పర్యవేక్షణ అనేది టీచర్లను భయపెట్టేలా ఉంది. అలా కాకుండా స్నేహ పూర్వక వాతావరణంలో సలహాలు, సూచనలు ఇచ్చే విధంగా ఉండాలి.
- ఎండీ ఖమ్రుద్దీన్, టీపీటీఎఫ్ నాయకులు