
లాక్ డౌన్ కారణంగా లోన్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మారటోరియం విధించింది.EMIలు చెల్లించాలంటూ రుణం తీసుకున్న వారిపై ఒత్తిడి చేయకూడదని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది. అయితే… EMIల చెల్లింపులపై మారటోరియం ఉన్నప్పటికీ లోన్ తీసుకున్న వారిపై అప్పులు ఇచ్చిన సంస్థలు వడ్డీ భారాన్ని మోపుతున్నాయి. దీనికి సంబంధించి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ అంశాన్ని ఇవాళ(బుధవారం) విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వమేనని… అందువల్ల మారటోరియం సమయంలో లోన్ రీపేమెంట్లకు సంబంధించి వడ్డీని చెల్లించకుండా ఉండేలా నిర్ణయం తీసుకోవాల్సింది కూడా కేంద్ర ప్రభుత్వమేనంది. RBI దే బాధ్యత అని తప్పించుకోవడం కుదరదని తెలిపింది. సెప్టెంబర్ 1లోగా ఈ అంశంపై క్లారిటీ ఇవ్వాలని కోరింది. డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం కింద వడ్డీని ఎత్తేసే సదుపాయం కేంద్రానికి ఉంటుందని చెప్పింది. ఈ అంశాన్ని బిజినెస్ దృష్టితో మాత్రమే చూడకూడదని… ప్రజల బాధను కూడా దృష్టిలో పెట్టుకుని చూడాలని సూచించింది.