కీలక పోస్టులన్నీఇన్​చార్జ్​ల చేతిలోనే..డాక్టర్ల అసంతృప్తి

కీలక పోస్టులన్నీఇన్​చార్జ్​ల చేతిలోనే..డాక్టర్ల అసంతృప్తి
  •     ముఖ్యమైన విభాగాలన్నీ వాళ్ల చేతిలోనే పెడుతున్న సర్కార్‌‌‌‌
  •     జిల్లా, ఏరియా హాస్పిటళ్లలో పెరుగుతున్న సమస్యలు
  •     పట్టించుకునేటోళ్లేలేరని డాక్టర్ల అసంతృప్తి 

 

హైదరాబాద్, వెలుగుసర్కార్ దవాఖాన్లలో మళ్లీ సమస్యలు తిష్ట వేస్తున్నయి. చాలా దవాఖాన్లలో సీటీ స్కాన్లు, ఎంఆర్‌‌‌‌ఐ మెషీన్లు సహా డయాగ్నసిస్ పరికరాలన్నీ రిపేర్లతో మూలకు పడుతున్నయి. కీలకమైన విభాగాల హెచ్‌‌వోడీ పోస్టులు ఖాళీగా ఉండడంతో సమస్యలను పట్టించుకునేవారే కరువయ్యారని డాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యశాఖలోని కీలక విభాగాలైన తెలంగాణ వైద్య విధాన పరిషత్‌‌(టీవీవీపీ)కు కమిషనర్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌‌ కు సీఈవో, కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి వీసీ సహా పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఇంచార్జులతోనే నెట్టుకొస్తున్నారు. అదనపు బాధ్యతల పేరిట ఒకరికే రెండేసి పదవులు ఇవ్వడంతో ఆఫీసర్లపై భారం ఎక్కువై, సమస్యలపై ఫోకస్ చేయలేకపోతున్నారు. దీంతో తమ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ట్రాన్స్‌‌ఫర్లు వంటి వ్యవహారాలూ ముందుకెళ్లడంలేదని డాక్టర్లు చెబుతున్నారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌‌‌‌గా ఉన్న రమేశ్‌‌రెడ్డికి, వీవీపీ ఇన్ చార్జ్ కమిషనర్‌‌‌‌గా బాధ్యతలు అప్పగించి ఏడాది అవుతోంది. జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లన్నీ కలిపి 110 దవాఖాన్లు టీవీవీపీ పరిధిలో ఉన్నాయి. వీటిల్లో 10 వేల మందికిపైగా పనిచేస్తున్నారు. ఇంత పెద్ద విభాగాన్ని సర్కారు మూడేండ్లుగా ఇన్‌చార్జులతోనే నెట్టుకొస్తోంది.

నిమ్స్ లోనూ ఇదే తీరు..

ప్రస్తుతం నిమ్స్‌‌ డైరెక్టర్‌‌‌‌గా ఉన్న డాక్టర్ మనోహర్ పదవీ కాలం గతేడాది ఆగస్టులోనే ముగిసింది. 2015 నుంచి డైరెక్టర్‌‌‌‌గా ఆయనే కొనసాగుతుండగా, ఆగస్టులో మరోసారి ఎక్స్‌‌టెన్షన్ ఇచ్చారు. ఇప్పటికీ ఆయన్నే కొనసాగిస్తున్నారు. తమకు అవకాశం ఇవ్వడం లేదని అక్కడి సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆరోగ్యశ్రీని పట్టించుకుంటలె

ఏడాదికి సుమారు రూ. 800 కోట్ల వ్యవహారం నడిచే ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌‌కు ఐదేండ్లుగా ఇంచార్జ్ సీఈవోలే దిక్కవుతున్నారు. టీవీవీపీ ఇన్ చార్జ్ కమిషనర్‌‌‌‌గా ఉన్న మాణిక్క రాజ్‌‌ను, ఆ తర్వాత స్పెషల్ సీఎస్‌‌ శాంతికుమారిని, మధ్యలో కొంతకాలం నిమ్స్ డైరెక్టర్‌‌‌‌గా ఉన్న మనోహర్ ఆరోగ్యశ్రీ ఇన్ చార్జ్ సీఈవోలుగా పనిచేశారు. ప్రస్తుతం హెల్త్ సెక్రటరీగా ఉన్న రిజ్వీ ట్రస్ట్‌‌ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో 330కిపైగా హాస్పిటళ్లు ఉన్నయి. ఈ హాస్పిటళ్లలో చేరే పేషెంట్ల వివరాలు, ట్రీట్‌‌మెంట్ ప్రొసీజర్లు, బిల్లులు, చెల్లింపులు అన్నీ సీఈవో పర్యవేక్షణలోనే జరగాల్సి ఉంటుంది. అన్నీ సక్రమంగా ఉంటేనే దవాఖాన్లకు బిల్లులు చెల్లించాలి. హెల్త్ సెక్రటరీలకు, స్పెషల్ సెక్రటరీలకు సీఈవోగా అదనపు బాధ్యతలు ఇస్తుండడంతో, ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండడంలేదు. మరోవైపు, బకాయిల పెండింగ్‌‌, బిల్లుల్లో కోతల వంటి సమస్యలు చెప్పుకోవడానికి తమకు అవకాశమే ఉండటంలేదని నెట్‌‌వర్క్‌‌ హాస్పిటళ్ల ఓనర్లు చెబుతున్నారు. ఇలా మూడు ముఖ్యమైన విభాగాల్లో ఇన్ చార్జులను, రిటైర్డ్  వ్యక్తులను కొనసాగిస్తుండడంపై డాక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త వారికి అవకాశాలు రాకపోవడంతోపాటు, తమ సమస్యలను చెప్పుకోలేకపోతున్నామని అంటున్నారు. ఇప్పటికైనా అన్ని పోస్టులను సీనియర్లతో భర్తీ చేయాలని కోరుతున్నారు.