ఇంకా 24 గ్రామాలు ధరణికెక్కలే

 ఇంకా 24 గ్రామాలు ధరణికెక్కలే
  • 10 వేలకుపైగా ఎకరాలను పార్ట్​ బీలో చేర్చిన సర్కార్
  • పట్టాలియ్యక రైతులకు కష్టాలు
  • మెదక్​, మహబూబాబాద్​, ఖమ్మం, జయశంకర్​, మహబూబ్​నగర్ జిల్లాల్లో వేలాది రైతులకు నష్టం
  • మహబూబాబాద్​లో ఊరు ఊరినే అడవిలో చేర్చిన ప్రభుత్వం
  • భూమి దక్కదని కొందరు రైతుల ఆత్మహత్యలు  

నెట్​వర్క్​, వెలుగు: ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములను రైతులు తమ సొంత భూములని చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. రాష్ట్ర సర్కారు తీరుతో ఆ భూములు ధరణికెక్కక వేలాది మంది రైతులు తల్లడిల్లిపోతున్నారు. భూప్రక్షాళన పేరిట ‘ధరణి’ని తీసుకొచ్చిన సర్కారు.. ప్రతి జిల్లాలోని వేలాది ఎకరాల భూములను ‘పార్ట్​ బీ’లో చేర్చింది. కాస్తు కాలం తీసేయడం, రెవెన్యూ ఆఫీసర్లు ట్యాంపరింగ్​కు పాల్పడడం, ఫారెస్ట్​– రెవెన్యూ మధ్య ఏండ్ల కొద్దీ కొనసాగుతున్న భూ పంచాయితీలు, ఎంజాయ్​మెంట్​​సర్వే చేయకపోవడం వంటి కారణాలతో రాష్ట్రంలోని 5 జిల్లాల పరిధిలో 34 ఊర్లు ధరణిలో కనిపించట్లేదు. 10 వేలకుపైగా ఎకరాలను పార్ట్​​బీలో చేర్చడంతో వేలాది మంది రైతులకు కొత్త పాస్​బుక్​లు రాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రధాని మన్మోహన్​​సింగ్​​అందజేసిన భూములనూ అధికారులు పార్ట్​​బీలో చేర్చారు. దీంతో రైతుబంధు రాక, ఏదైనా కారణంతో చనిపోతే రైతుబీమా రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక తమ భూమి పట్టా ఇస్తారో లేదో అనే మనస్తాపంతో కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 

రెవెన్యూ ఆఫీసర్లు తమకు పట్టాలిచ్చారని, దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమకు అన్యాయం చేయడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఒక్క శివ్వంపేట మండలంలోనే సుమారు 3,200 ఎకరాలు ధరణి వెబ్​సైట్​లోకి ఎక్కించకపోవడంతో రైతులు తండ్లాడుతున్నారు. తాళ్లపల్లి గడ్డ తండా, నాను తండా, బిక్య నాయక్​ తండా గ్రామ పంచాయతీల పరిధిలో సర్వే నంబర్​ 315, 316 లోని 1,200 ఎకరాలు, ఇదే మండలం నవాపేట పరిధిలోని 216, 236, 309, 417, 267 సర్వే నంబర్లలో 2,000 ఎకరాలను పార్ట్​ బీలో చేర్చారు. 2005లో భూపంపిణీ కార్యక్రమంలో భాగంగా అప్పటి ప్రధాని మన్మోహన్​ సింగ్​​రామాయంపేట మండలం రాయిలాపూర్​​, సుతారిపల్లి, వెంకటాపూర్​లకు చెందిన 300 మంది రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. అయితే భూప్రక్షాళనలో భాగంగా రాయిలాపూర్​​శివారులోని 881 సర్వే నంబర్​లోని భూములు ఫారెస్ట్​ పరిధిలో ఉన్నాయంటూ పార్ట్​బీలో చేర్చి ఏ ఒక్క రైతుకూ కొత్త పాస్​బుక్​లను ఇవ్వలేదు. దీంతో మూడు నెలల కింద తాను సాగు చేసుకుంటున్న భూమి దక్కుతుందో లేదోనన్న బెంగతో శివ్వాయిపల్లికి చెందిన శిరగబోయిన ముత్యాలు అనే రైతు పొలం దగ్గరే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చేగుంట మండలం ఇబ్రహీంపూర్​, రుక్మాపూర్​, చెట్ల తిమ్మాయిపల్లిల పరిధిలోనూ ఆఫీసర్లు సుమారు వెయ్యి ఎకరాలను పార్ట్​​బీలో చేర్చారు. కొల్చారం మండలం వరిగుంతం, శేరి వరిగుంతం పరిధిలోని సర్వే నంబర్​​61, 62, 151, 157, 250, 477, 491, 493లో 120 మంది రైతులకు భూప్రక్షాళన టైంలో కొత్త పట్టాదారు పాస్​బుక్కులు ఇచ్చినా ధరణి పోర్టల్​​వచ్చాక భూములన్నీ ఆన్​లైన్​లో లావుణి, ఖరీజ్​ఖాతా, ప్రొహిబిటెడ్​​భూములుగా మారిపోయాయి.

జయశంకర్ ​​జిల్లాలో..  డబ్బులు కట్టినా న్యాయం జరగలే

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం ఘోరీ కొత్తపల్లి, నిజాంపల్లి, గాంధీనగర్​, కోనరావుపేట, కొత్తపల్లి, కుమ్మరిపల్లి, జంషెడ్​బేగ్​పేట, రాజక్కపల్లి, బాలయ్యపల్లి, కొప్పుల గ్రామాలకు చెందిన రైతులు ఘోరీ కొత్తపల్లి శివారులోని 2,350 ఎకరాలు, కోనరావుపేట శివారులోని 1,050 ఎకరాలు, జంషెడ్​బేగ్​పేటలో 400 ఎకరాల భూములను సాగు చేసుకుంటున్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్​ హయాంలో భూమి సాగు చేసుకునే రైతుల పేర్లు కాస్తు కాలమ్​‌లో ఉండేవి. తెలంగాణ వచ్చాక కొత్త రెవెన్యూ చట్టంతో కాస్తు కాలమ్​‌ తీసేశారు. దీంతో రైతుల పేర్లు రికార్డుల్లోనే లేకుండా పోయాయి. దీంతో పాస్​బుక్​‌లు ఇవ్వలేదు. 2017లో కలెక్టర్ ఆకునూరి మురళి ఘోరీ కొత్తపల్లిలో ప్రజా దర్బార్​ పెట్టి కమిటీలు వేశారు. ఫామ్​ 10 ప్రకారం ఎకరానికి 2 వేల చొప్పున వసూలు చేసి ఆర్డీవో, కలెక్టర్​ ఖాతాలో డబ్బులు జమ చేశారు. అయినా రైతులకు న్యాయం జరగలేదు.

పాస్​బుక్కులు ఆపేసిన్రు

మహబూబ్​నగర్​ జిల్లా మిడ్జిల్​ మండలం కొత్తూరు శివారులోని సర్వే నంబరు 311లో 369.31 ఎకరాల అసైన్డ్​, లావుని పట్టా, గైరాన్​ భూములను 1950 నుంచి 1970 వరకు ఈ గ్రామంతో పాటు మల్లాపూర్​ గ్రామానికి చెందిన కొందరు రైతులు సాగు చేసుకుంటున్నారు. 1995లో ఈ సర్వే నంబరులోని 243.05 ఎకరాలను పొజిషన్​లో ఉన్న 241 మంది రైతులకు పట్టాలు చేసి ఇచ్చారు. ఇందులో కొందరికి 20 గుంటలు, మరికొందరికి పది గుంటలు, ఇంకొందరికి 30 గుంటలు, కొందరికి ఎకరా చొప్పున పట్టాలిచ్చారు. అప్పటి రెవెన్యూ ఆఫీసర్లు 243.05 ఎకరాలను సేత్వార్​లో కూడా ఎక్కించారు. 2012 నుంచి ఈ మండలంలో పని చేసిన కొందరు తహసీల్దార్లు ఇదే సర్వే నంబర్లోని కొంత భూమిని వేరే వ్యక్తులకు పట్టా చేసి ఇచ్చారు. కానీ సేత్వార్​లోకి ఎక్కించలేదు. 2018 ఆగస్టులో రెవెన్యూ ఆఫీసర్లు సర్వే చేయగా, ఈ సర్వే నంబరులోని ఎంజాయ్​మెంట్​లో  332.21 గుంటలు ఉన్నట్లు గుర్తించారు. సేత్వార్ లో ఉండాల్సిన దాని కన్నా 89.16 ఎకరాలు ఎక్కువగా ఉండడంతో డిజిటల్​ పట్టాదారు పాస్​బుక్కులు ​ఇవ్వకుండా ఆపేశారు. దీంతో అప్పటి నుంచి రైతులు కొత్త పాస్​ పుస్తకాల కోసం ఆందోళనలు 
చేస్తున్నారు. 

ఆ ఊరే అడవిలో ఉందట.. 

మహబూబాబాద్​ జిల్లాలోని కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన 63 మంది రైతులు 1959, 60లో పింగళి వెంకటరాంరెడ్డి వద్ద నుంచి1,254 ఎకరాలు కొన్నారు.1962లో మహబూబాబాద్​ సబ్​ రిజిస్ట్రార్​​ఆఫీసు రికార్డులో ఈ వివరాలను నమోదు చేశారు.1962 నుంచి 2017 వరకు రెవెన్యూ రికార్డులో పట్టా భూములుగా ఉన్నాయి. కానీ ఆ తర్వాత జరిగిన భూ ప్రక్షాళన సర్వే తర్వాత నారాయణపురం గ్రామం మొత్తం రిజర్వ్​​ఫారెస్ట్​లో ఉందంటూ ప్రకటించారు. అంతకుముందు జరిగిన భూపంపిణీలో అటవీ భూములనూ రెవెన్యూలో కలిపి పంచడంతో ఇలా జరిగిందని వివరణ ఇచ్చారు. ఈ లెక్కన ఇప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్​, స్కూల్​, అంగన్వాడీ సెంటర్​​ఇలా గ్రామం మొత్తం అడవిలోనే ఉన్నట్టు లెక్క. పాత రికార్డుల ప్రకారం 14 తండాలు సహా గ్రామానికి 1,827 ఎకరాల భూమి ఉండగా, 2017 సెప్టెంబర్​ నాటికి 2,600 ఎకరాలుగా పేర్కొన్నారు. అయితే తమ భూములను, ఊరిని ధరణిలో చేర్చాలని రైతులు ఎంత మంది ఆఫీసర్లను కలిసినా లాభం లేకుండా పోయింది. ఇప్పటిదాకా 30 మంది రైతులు వివిధ కారణాలతో చనిపోగా ఒక్కరికి కూడా రైతు బీమా రాలేదు. రైతు బంధు, పీఎం కిసాన్​ పథకం, ప్రభుత్వ సబ్సిడీలు రాక తల్లడిల్లుతున్నారు. భూములు అమ్ముకోవాలన్నా, కొనాలన్నా వీలు కాక ఇబ్బందులు పడుతున్నారు.  

ఖమ్మంలో సర్వే నంబర్లు డబుల్​

ఖమ్మం జిల్లాలో పెనుబల్లి మండలం తాళ్లపెంట రెవెన్యూలో తాళ్లపెంట, కర్రాలపాడు, బ్రహ్మాలకుంట, గంగదేవిపాడు గ్రామాలలో 1,800 ఎకరాలు ధరణిలో నమోదు కాక 500 మంది  రైతులు తిప్పలు పడుతున్నారు. 1995 వరకు ఈ రెవెన్యూ గ్రామాలలో 375 సర్వే నంబర్​​వరకే ఉండగా, రెవెన్యూ సిబ్బంది చేసిన ట్యాంపరింగ్​తో 375 నుంచి 600 వరకు సర్వే నంబర్లు పెంచుకుంటూ పోయారు. దీంతో అర్హులకు పాస్​బుక్స్​​రాలేదు. స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు చెప్పగా, ఆయన సీఎంను కలిశారు. సమస్య పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​​అప్పటి కలెక్టర్​ కర్ణన్​ను ఆదేశించగా, సర్వే చేసి బౌండరీలను ఫిక్స్​ చేశారు. కానీ ఇప్పటిదాకా ఒక్క ఎకరం కూడా ధరణిలో నమోదు కాలేదు.

మెదక్​ జిల్లాలో.. 

మెదక్​ జిల్లా శివ్వంపేట, చేగుంట, రామాయంపేట మండలాల్లో 4,300 ఎకరాలను భూ ప్రక్షాళన పేరిట పార్ట్​​బీలో చేర్చారు. అలాగే చిన్నశంకరంపేట, హవేలి ఘనపూర్, కౌడిపల్లి, వెల్దుర్తి, కొల్చారం మండలాల పరిధిలో మరో 700 ఎకరాలు పార్ట్​బీలోకి వెళ్లాయి.

రైతు బీమా రాలే

తాత, తండ్రి కాలం నుంచి నాలుగు ఎకరాల భూమి సాగు చేసుకుంటున్న. ఇంతకు ముందు మా నాయన పేరు మీద, నా పేరు మీద పాస్​బుక్​ఉండేది. ఇప్పుడు రెవెన్యూ ఆఫీసర్లు పట్టా భూమిని ఫారెస్ట్ భూమి అని పార్ట్​ బీలో చేర్చిన్రు. కొత్త పాస్​బుక్​ ఇయ్యలేదు. రైతు బంధు లేదు. మా తమ్ముడు కరెంట్ షాక్​తో సచ్చిపోతే పాస్​బుక్​ లేదని రైతు బీమా ఇయ్యలేదు. ఎమ్మెల్యేకు కూడా ఎన్నోసార్లు చెప్పిన. సమస్య పరిష్కరించెటోళ్లు లేరు.  
-  సుధాకర్​, తాళ్లపల్లి గడ్డ తండా, మెదక్​ జిల్లా

ఎందుకిట్ల మార్చిన్రో 

మా ముగ్గురు అన్నదమ్ముల పేరుమీద 2 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. అది పట్టా భూమి. ధరణి వచ్చిన తరువాత ఆన్​లైన్​లో లావుణి పట్టాగా మార్చిన్రు. ఎందుకిట్లా మారిందని రెవెన్యూ ఆఫీసర్లను అడిగితే చెప్తలేరు. తహసీల్దార్​​ఆఫీసుకు పోయి కూడా అడిగిన. కానీ, ఆయన కూడా ఏం చెప్తలేడు.  
- నయిమొద్దీన్​, రైతు, వరిగుంతం, మెదక్​ జిల్లా

ఆప్షన్​ లేదంటున్నరు

పట్టా భూములు లావుణి, కేకే భూములుగా మారాయని తహసీల్దార్​కు ఎన్నో సార్లు చెప్పినం. కలెక్టరేట్​కు కూడా పోయి దరఖాస్తు ఇచ్చినం. కానీ సమస్య అట్లనే ఉంది. లావుణి పట్టాలను ఇంతకు ముందున్నట్టు పట్టా భూమిగా మార్చమంటే ఇంకా ధరణిలో ఆప్షన్​ రాలేదంటున్నరు.
- సిద్దిరాములు, రైతు, వరిగుంతం, మెదక్ జిల్లా

నష్టపోతున్నం 

మాకు తాళ్లపెంట రెవెన్యూ పరిధిలోని కర్రాలపాడులో 17 ఎకరాల భూమి ఉంది. దీన్ని రెవెన్యూ రికార్డుల్లో ఎక్కించాలని 1995 నుంచి పోరాడుతున్నం. రైతు బంధు, బీమా రాక నష్టపోతున్నం. రెవెన్యూ ఆఫీసర్లు వెరిఫికేషన్ అని కాలం వెళ్లదీస్తున్నరు. సెంటు భూమి కూడా ధరణిలోకి ఎక్కించలేదు.  
- ఆళ్ళ రాజశేఖర్, కర్రలపాడు గ్రామం