ఇంకా ఓపెన్​ కాని కొనుగోలు సెంటర్లు

ఇంకా ఓపెన్​ కాని  కొనుగోలు సెంటర్లు
  • నెల రోజులుగా ఇండ్లు, పొలాల్లో నిల్వ
  • వానపడితే పంట తడిచిపోతుందని భయం 
  • రేపు కలెక్టరేట్​ఎదుట ఆందోళనకు  రైతు స్వరాజ్య వేదిక పిలుపు

ఈ రైతు పేరు వెంకటరమణ. అదిలాబాద్​ జిల్లా నేరడిగొండ మండలం కుమారి గ్రామంలో తన రెండెకరాల్లో జొన్న పంట వేశాడు.  35 వరకు  క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో పంటను పొలంలోనే నిల్వ చేశాడు.  25 రోజులనుంచి సెంటర్లు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురుచూస్తున్నాడు. వాన పడితే పంటంతా కొట్టుకుపోతుందని భయపడుతున్నాడు. 

ఆదిలాబాద్, వెలుగు : వరి వేయవద్దని ప్రభుత్వం స్పష్టంగా చెప్పడంతో చాలామంది జొన్న పంట వేసుకున్నారు. పంట చేతికొచ్చి నెలరోజులైనా కొనుగోలు కేంద్రాలు ఓపెన్​ చేయకపోవడంతో  రైతులు ఇబ్బంది పడుతున్నారు. గత ఏడాది కూడా జొన్నల కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేసింది. దీంతో రైతులు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే.. సర్కారు మూడు నెలలు ఆలస్యంగా సెంటర్లను ప్రారంభించింది. అప్పటికే చాలామంది రైతులు తక్కువ రేటుకు జొన్నలమ్ముకుని నష్టపోయారు. ఈసారి కూడా ఇంకా సెంటర్లు ప్రారంభించలేదు. అసలు ఓపెన్​చేస్తారా లేదా అన్ని కూడా తేల్చడంలేదు. దీంతో రైతులు ఆయోమయానికి గురవుతున్నారు. దీనికి తోడు ఆకాల వర్షాలు కూడా భయపెడుతున్నాయి. తెలంగాణలో ఈ యాసంగిలో  1.04 లక్షల ఎకరాల్లో జొన్న సాగయ్యింది. ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గత ఏడాదికన్నా జొన్న విస్తీర్ణం కొద్దిగా తగ్గినా దిగుబడి మాత్రం 18 లక్షల క్వింటాళ్లు వచ్చింది. పంట బాగా పండినా సకాలంలో అమ్ముకోలేకపోతే నష్టపోవాల్సివస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పురుగు పడితే నష్టమే

రాష్ట్రంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో జొన్న పంట వేశారు. పత్తి, సోయా పంట తీయగానే  రైతులు జొన్న, శనగ పంటలు సాగు చేస్తారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి పంట చేతికొచ్చింది. నెలరోజులుగా రైతులు సెంటర్లను ఎప్పుడు ఓపెన్​ చేస్తారోనని ఎదురుచూస్తున్నారు. కోతలు పూర్తి చేసిన రైతుల్లో 80 శాతం మంది పంటను ఇండ్లకు తరలించగా.. మిగిలినవారు పొలాల్లోనే నిల్వ ఉంచారు. ఇంటికి తీసుకెళ్లిన జొన్నలు ఎక్కువ రోజులుంటే లక్కపురుగు పట్టి కరాబైతాయని, పొలాల్లో ఉన్న జొన్నలు వాన కొడితే తడిచిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. జొన్నలు అమ్మితే వానాకాలం పంటల పెట్టుబడికి ఇబ్బంది ఉండదని భావించిన వారిని సర్కారు జాప్యం నిరాశ పరిచింది. జొన్నల మద్దతు ధర క్వింటాలుకు  రూ. 2,737 కాగా.. మార్కెట్​లో వ్యాపారులు రూ. 2 వేలు కూడా ఇవ్వడం లేదు. దాంతో సెంటర్లు ఓపెన్​ చేయాలని రైతులు ఆఫీసర్ల మీద ఒత్తిడి తెస్తున్నారు.  ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ వారు చేతులెత్తేస్తున్నారు.  

ఇప్పటికే ఒకసారి తడిసింది

12 ఎకరాల్లో జొన్న పంట వేసినం. 180 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. ఇంటిదగ్గర నిల్వ చేసిన జొన్నలు ఇదివరకే ఒకసారి వానపడి తడిసినయ్​. పెద్ద వాన పడితే పంటంత నష్టపోతాం. వెంటనే సెంటర్లు ఓపెన్​ చేయాలి.

- కిష్టారెడ్డి, రైతు, బండల్ నాగ్పూర్

ఆదేశాలు వస్తే కొంటాం 

జొన్నలు కొనాలంటూ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లాలో 32 వేల ఎకరాల్లో జొన్నలు వేయగా.. దాదాపు 4 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు అంచనా. ప్రభుత్వ ఆదేశాలు వస్తే  కొంటాం. - పుల్లయ్య, మార్క్​ఫెడ్ జిల్లా మేనేజర్

పంట ఏం చేసుకోవాలె

నాలుగు ఎకరాల్లో జొన్న వేశాం. 70 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని సంతోషపడ్డం. పంటను ప్రభుత్వం కొనకుంటే మేం ఏం చేసుకుంటాం. జొన్నలమ్మితే  వచ్చే డబ్బులతోనే వానాకాలం పంటలు వేసుకుంటాం.  మా గోస ఎవరికి చెప్పుకోవాల్నో అర్థమైతలేదు.  - లక్ష్మి, కప్పర్ల

 

 

ఇవి కూడా చదవండి

అప్పుల కోసం ఢిల్లీలో అధికారుల చక్కర్లు

బీటెక్ వాళ్లు కూడా సోషల్ సైన్స్ చదవొచ్చు