‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా ఆద్యంతం నవ్వించేలా ఉంటుంది అని నిర్మాత అనిల్ సుంకర అన్నారు. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని రూపొందించాడు. సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్స్‌గా నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత అనిల్ సుంకర చెప్పిన విశేషాలు.
‘‘ఇదొక పండుగ చిత్రం.. సంక్రాంతి సీజన్ సినిమాలకు బాగా వర్కౌట్ అవుతుంది. ఈ సీజన్‌లో నాలుగైదు సినిమాలు రావడం కామన్. విడుదలైన అన్ని చిత్రాలు హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సంక్రాంతి సీజన్‌కు తగ్గట్టుగా దీన్ని రూపొందించాం. థియేటర్లో కూర్చున్నంత సేపు ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ టైటిల్ బాలకృష్ణ గారిది కావడంతో ఆయనతో మా టైటిల్ లాంచ్ చేయించాం. ఇందులో శర్వానంద్‌తోపాటు శ్రీవిష్ణు మంచి పాత్ర పోషించారు. వారి కాంబినేషన్ సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. ఓ పెద్ద హీరో వచ్చి హడావిడి చేసినట్టుగా కాకుండా.. మనలోంచి ఓ సాధారణ మనిషి వచ్చి ఎంటర్‌టైన్ చేసినట్టుగా అనిపిస్తుంది.
నైజాం, వైజాగ్‌లో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఈస్ట్‌లో సొంతంగా చేస్తున్నాం. వెస్ట్, కృష్ణా, గుంటూరులో రాజా, సీడెడ్‌లో శోభన్ రిలీజ్ చేస్తున్నారు. సంక్రాంతి సీజన్‌లో మా సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. ఎన్ని థియేటర్లు అన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ నిర్మాత కూడా చెప్పలేరు. ఇక త్వరలో మా సంస్థ నుంచి అడివి శేష్ హీరోగా ‘గూఢచారి 2’ రాబోతోంది. సాయి ధరమ్ తేజ్, తేజ సజ్జాతో సినిమాలు చేయబోతున్నాను. ప్రయోగాలు చేయడంకంటే ఎంటర్‌టైన్‌మెంట్ జానర్‌లోనే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నా’’.
