థియేటర్ల ఇష్యూపై నిర్మాత సి కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

థియేటర్ల ఇష్యూపై నిర్మాత సి కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు సినిమాను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ తెలిపారు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా థియేటర్ల ఇష్యూపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాలకు కాకుండా.. కన్నడ, తమిళ సినిమాలకు థియేటర్లు ఇవ్వడం సరికాదని అన్నారు. ఇలా చేస్తే బడాస్టార్ల సినిమాలకు కూడా థియేటర్లు దొరక్కపోవచ్చన్నారు. అలా జరిగితే మన పరువు మనమే తీసుకున్నవాళ్లం అవుతామని చెప్పారు. కన్నడ, తమిళ్ లో మొదట వాళ్ల సినిమాలకే ప్రాధాన్యతనిస్తారని, ఆ తర్వాతే ఇతర భాషల సినిమాలకు థియేటర్లు ఇస్తారని వెల్లడించారు. ఇక్కడ కూడా పద్ధతి మారాలని, డబ్బుకోసం కాకుండా సినిమాని బతికించుకోవడం కోసం కష్టపడాలన్నారు.

థియేటర్ల విషయంలో డైరెక్ట్ గా ఛాంబర్ ఏమి చేయలేదని సి.కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఉన్నాపెద్దగా ఎలాంటి ఉపయోగం లేదన్నారు. 200 కోట్ల రూపాయలతో చెన్నైలో అమ్యూజ్మెంట్ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే పనులు వేగంగా నడుస్తున్నాయని, వచ్చే ఏడాది ప్రారంభిస్తామన్నారు. అందులో సస్పెన్షన్ తో కూడిన బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నామని.. ఇది దేశంలోనే మొదటిది అని తెలిపారు. సీకే ఎంటర్ టైన్ మెంట్ హాలీవుడ్ సంస్థతో కలిసి పని చేయబోతోందని చెప్పారు. త్వరలోనే భారీ బడ్జెట్ సినిమాని చేయబోతున్నామని కూడా వెల్లడించారు. ఆ సినిమా నందూమరి బాలకృష్ణతోనే తీయాలని ఉందన్నారు. మిగతా విషయాలు త్వరలోనే ప్రకటిస్తామని కళ్యాణ్ ప్రకటించారు.