
చెట్ల నరికివేత, స్మగ్లింగ్ గురించి ఇటీవల పవన్ కల్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు ‘పుష్ప’ను ఉద్దేశించినవి కాదని నిర్మాత రవిశంకర్ అన్నారు. పవన్ ఎప్పుడూ కావాలని అలా మాట్లాడరని స్పష్టంచేశారు. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటేనని ఆయన అన్నారు. తాజాగా మత్తు వదలరా 2 మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో భాగంగా రవిశంకర్ పలు విశేషాలు పంచుకున్నారు.
అసలేమైంది?
ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బెంగళూరులో అటవీ శాఖపై జరిగిన రివ్యూ మీటింగ్ లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 40 ఏళ్ల క్రితం సినిమా హీరో అంటే అడవులను కాపాడేవాడు.. అదే ఇప్పుడు.. అడవులను నరికితేనే హీరో అంటున్నారు. ఈ 40 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం అంటూ పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో రచ్చ లేపాయి.
పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ సినిమా పుష్ప గురించే అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తు్న్నారు. ఎందుకంటే పుష్ప మూవీ ఎర్రచందనం స్మగ్లింగ్ గురించే.. ఆ సినిమాలో హీరో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్.. దీంతో అల్లు అర్జున్ ను టార్గెట్ చేసి పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ సోషల్ మీడియా రచ్చ ఎప్పుడు ఆగుతుందో తెలియాల్సి ఉంది.