అంబేద్కర్ను ఘోరంగా అవమానించిన కథ!

అంబేద్కర్ను  ఘోరంగా అవమానించిన కథ!

వి.విజయేంద్రప్రసాద్​ ప్రముఖ సినిమా డైరెక్టర్​ ఎస్ఎస్​ రాజమౌళి తండ్రి.  ఆయన కూడా సినిమాలకు  కథలు రాసే వ్యక్తిగా  బాగా ప్రసిద్ధుడు.  ఆయన రాసిన కథల ఆధారంగా తీసిన బాహుబలి 1, బాహుబలి 2,  ఆర్ఆర్ఆర్​ సినిమాలు  బాగా  డబ్బు సంపాదించాయి.  ఆర్ఆర్ఆర్​ కథకు,  సినిమాకు  కాకపోయినా అందులోని ఒక పాటకు ఆస్కార్​ అవార్డు కూడా వచ్చింది. ఈ  సినిమాలు హిందీలో కూడా పాపులర్​ అయినందున కేంద్రంలో అధికారంలో ఉన్న  ఆర్ఎస్ఎస్,  బీజేపీ  ప్రభుత్వం విజయేంద్ర ప్రసాద్​ను  రాష్ట్రపతి కోటాలో  రాజ్యసభ మెంబర్​ను  కూడా చేశారు. 

విజయేంద్రప్రసాద్ ఈ మధ్య కాలంలో  ఒక మీటింగ్​లో  మాట్లాడుతూ తనకున్న సమాచారం ఆధారంగా  బాగా రీసెర్చ్ కూడా చేసి అంబేద్కర్​పై  బహుభాషా  సినిమా కోసం అన్నట్టు ఒక కథ  చెప్పాడు.  ఆ కథ విన్న  ఏ వ్యక్తి అయినా ఆశ్చర్యపోవలసిందే.  ఆయనను  ఈ  మీటింగ్​కు  పిలిచినవాళ్లు ఆయన రాజమౌళి తండ్రి కాబట్టి,  రాజ్యసభ సభ్యుడు కాబట్టి  పిలిచారు. ఆ సభలో ఆయన అంబేద్కర్, ఆయన భార్య రమాబాయిపై చెప్పిన కథ వీడియో క్లిప్​ బయటకురాగానే వైరల్​ అయింది. 

అంబేద్కర్​ వాద దళిత మేధావులు ఆ వీడియోలో కథను తీవ్రంగా వ్యతిరేకించడం ప్రారంభించారు. తెలుగులో  విడుదలైన ఆ వీడియో ఆధారంగా బత్తుల రామ్​ప్రసాద్​ అనే దళిత నాయకుడు సైదాబాద్​ పోలీస్​స్టేషన్​లో 26–2–26న  కంప్లైంట్​ చేశాడు.  ఆయనపై అంబేద్కర్​ను అవమానించినందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్​ కింద కేసు నమోదు  చేయాలనేది ఆయన డిమాండ్. కానీ,  ఆ  పోలీస్​  స్టేషన్​ అధికారులు ఆయనపై  ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని  తెలుస్తున్నది.  ఇదే  అంశంపై తెలంగాణ హైకోర్టులో  న్యాయవాదిగా పనిచేస్తున్న శ్రీకాంత్​ చింతల మార్చి 4న ఆ  పోలీస్ స్టేషన్​  డిప్యూటీ  కమిషనర్​కు  ఇప్పటివరకు  విజయేంద్రప్రసాద్​పై  ఇంకా ఎఫ్ఐఆర్​ ఎందుకు నమోదు  చేయలేదని లీగల్​ నోటీసు కూడా ఇచ్చారు. శ్రీకాంత్​ చింతల ఆల్​ఇండియా లాయర్స్ అసోసియేషన్​ అధ్యక్షుడు కూడా.  ఇంతకూ విజయేంద్రప్రసాద్​ డా. బీఆర్​ అంబేద్కర్, ఆయన మొదటి భార్య రమాబాయిపై చెప్పిన కథ ఏమిటి అనేది నిజంగానే 
ఆసక్తికరమైన విషయం.

కంప్లైంట్​లో చెప్పినదాని ప్రకారం కథ...

బత్తుల రామ్​ప్రసాద్​ తన పోలీస్​ కంప్లైంట్​లో చెప్పినదాని ప్రకారం కథ ఇలా ఉంది. విజయేంద్రప్రసాద్​ మాట్లాడిన వీడియోలో కూడా ఆ కథ  దాదాపు ఆవిధంగానే ఉంది. ఆయన తెలుగులో మాట్లాడారు.  రామ్​ప్రసాద్​ దాన్ని ఇంగ్లిష్​లోకి  అనువదించి కంప్లైంట్ రాశారు.  ఆ వీడియోను ఎవరైనా  విజయేంద్రప్రసాద్​  ఇంటర్​నెట్​ వివరాల్లో చూడవచ్చు.  కథ రమారమి ఇలా చెప్పారు. అంబేద్కర్​కు  రమాబాయికి పెండ్లి జరిగినప్పుడు ఆయనకు 14 ఏండ్లు,  రమాబాయికి 9 ఏండ్లు.  అయితే  ఆ పెండ్లిలో అంబేద్కర్, ​ రమాబాయి పెండ్లికట్టు  ధోతి, చీరకొంగుకు ముడివేసి అగ్నిగుండం చుట్టూ తిరగమంటారు. అయితే, ఎవరు అన్నారు?  బ్రాహ్మణ పూజారి అలా తిరగమంటారు కదా!  అక్కడ ఉన్న దళిత నాయకులుగాని ఆయన తండ్రిగాని పూజారితో  చేయించాడా ఆయన ఆధారాలతో  చెప్పలేదు. అయితే, అలా తిరుగుతున్నప్పుడు రమాబాయి  కొంగుముడి విప్పుకుని అంబేద్కర్​ కంటే ముందే మూడు రౌండ్లు తిరిగి నేనే గెలిచాను అని ప్రకటించిందట. ఈవిధంగా పెండ్లి తంతు హిందూ శాస్త్రోక్తంగా బ్రాహ్మణ పూజారి చేయించినప్పుడు జరుగుతుంది.  అంబేద్కర్, రమాబాయి పెండ్లి అలా జరిగిందని విజయేంద్రప్రసాద్​ చెప్పడానికి ఆధారమేమిటి? 

చెరువు నీటి వివాదం!

ఇంత ఘోరంగా అంబేద్కర్​ను అవమానించిన కథ రెండో భాగం ఏమంటే  రమాబాయి చనిపోతూ బెడ్​మీద ఉన్నప్పుడు  మా ఊరి చెరువులో నుంచి ఒక చెంబు (గ్లాస్) నీళ్లు తెచ్చి తనకు తాపించాలన్నదట. అంబేద్కర్​ అప్పటికే లాయర్​ అట, కారు ఉన్నదట, సూట్​లో  ఎల్లాడట  రమాబాయి ఊరిలోని చెరువులో గ్లాసు నీళ్లు తేవడానికి.  అయితే ఆయనకు అక్కడ రెండు చేతులు నరకబడి ఉన్న యువకుడు కలిసి ఇక్కడ ఈ చెరువులో నీళ్లు తాగినందుకే తన రెండు చేతులు నరికేశారని  చెప్పాడట. అది విని అంబేద్కర్ అక్కడ జమీందార్​ దగ్గరకి వెళ్లాడట. ఆ జమీందార్​ నీ కులమేంటి అని అడిగాడట. ఆయన నేను దళితుణ్ని అని చెప్పాడట. ఆ జమీందార్​ కోపంతో ఆయన సూట్​మొత్తం విప్పించి  ఒక గోచిగుడ్డపై ఎండలో నిలబెట్టి నీకు మా చెరువు నీళ్లు తాగే హక్కు లేనేలేదు అని తిట్టాడట. అంత ఎండలో  చెమటకారుతూ నిలబడున్న అంబేద్కర్​కు ఉప్పునీళ్లు తాగించండి అంటే అక్కడ సముద్రం నీరు లేదు కనుక ఒకతను ఒక గ్లాసులో ఉచ్చపోసి ఆయన ముఖంమీద కొట్టాడట.  రామ్​ప్రసాద్​ కంప్లైంట్​లో ఇంకో విషయం కూడా రాశాడు.  మేం  మీ  ఆడవాళ్లతో  సెక్స్​లో  పాల్గొన్నప్పుడే అంటరానితనం పాటించం అంటూ మీలో అందుకే కొంత మాలాగే  కనిపిస్తారు అన్నాడట. అంబేద్కర్​ అగ్ర కుల వ్యక్తి కొడుకే అన్న అర్థమొచ్చేటట్లు. ఈ కథ చెబుతూ ఇది ఫోక్​లోర్​ కథ..  నిజమో  కాదో అంటూనే తను  ఈ కథను అంబేద్కర్​పై సినిమా కోసం చాలా రీసెర్చ్​ చేసి  రాస్తున్నాను  అన్నాడు.

దళిత సమాజానికి క్షమాపణ

ఈ కథ చెప్పేముందు ఇంకో విచిత్రమైన విషయం కూడా చెప్పాడు.  నాది బాగా సంపన్న కుటుంబం. నా పూర్వీకులు దళితులపై చాలా ఘోరాలు చేశారు. వారు చేసిన ఘోరాలు గుర్తు చేసుకుంటే  నేను కుంగిపోతాను. వారి ఆస్తులను నేను అనుభవిస్తున్నాను కనుక నాకు కూడా వారి పాపపు పనుల్లో భాగస్వామ్యం ఉంది కనుక నేను దళిత సమాజానికి మరీ మరీ క్షమాపణ చెబుతున్నాను అంటూ ఒక పశ్చాత్తాపం పడుతున్న వ్యక్తిగా మాట్లాడాడు.  కానీ, 80 సంవత్సరాలు పైబడిన  విజయేంద్రప్రసాద్​ సినిమా కథలు రాస్తూ  డబ్బులు సంపాదిస్తున్న రోజుల్లోనే 1985.. తన  కులస్తులే  ఘోరాతి ఘోరమైన హింసాకాండ చేశార  అప్పుడెందుకు ఆయన దాన్ని ఖండించలేదు?  పోనీ ఆ ఘటన మీద ఒక మంచి కథ రాసి తన కొడుకు డైరెక్షన్​లో  ఒక సినిమా ఎందుకు తీయలేదు?.  భారీ బడ్జెట్​తో ఆయన కొడుకు తీసే సినిమాలకు చరిత్ర వాస్తవాలతో సంబంధంలేని కథలు రాసి సినిమాలు తీయించే విజయేంద్రప్రసాద్​ నిజంగానే దళితులపై, అదీ అంబేద్కర్​పై ఆధారాలు లేని అవమాన కథ రాసి సినిమా తీయించే ప్రయత్నంలో భాగంగా ఆయన ఇప్పుడు క్షమాపణ చెబుతున్నాడు. ఆయన్ని ఏ దళితులు అడిగారు క్షమాపణ చెప్పమని?   

సినిమాల్లో మసాలా పెట్టి,  భారీ డబ్బుతో, ఆధునిక టెక్నాలజీతో,  గ్రాఫిక్స్​తో మరో ప్రపంచంలోకి తీసుకెళ్లి బీద కుటుంబాల యువకులను తమ సినిమాలు చూసేటట్టు చేస్తూ వేలకోట్లు సంపాదించే ఆయన కుటుంబం ఈ దేశ చరిత్రనే మార్చిన అంబేద్కర్​పైన కట్టుకథ రాసి  గ్రాఫిక్​  మసాలా సినిమా తీస్తే ఈ దేశ చరిత్ర ఏమౌతుంది?  అంబేద్కర్​పై ఇప్పటికే అన్ని భాషలలో జబ్బార్​ పటేల్​ తీసిన సినిమా ఉంది. అది సీరియస్​గా రీసెర్చ్​ చేసి  తీసిన సినిమా. కానీ, ఇలాంటి  సన్నివేశం అంబేద్కర్​ గురించి, రమాబాయి గురించి  అందులో లేదే! ఆయనపై ఎన్నో జీవిత కథలున్నాయి.  ఇలా ఎందులో  లేదే!

దేశ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్​

రాజమౌళి,  విజయేంద్రప్రసాద్..​ బాహుబలి, ఆర్ఆర్ఆర్​  తీశాక  హిందూత్వ రాజకీయాలకు దగ్గరయ్యారు. అందులో భాగమే విజయేంద్రప్రసాద్​కు రాజ్యసభ సభ్యత్వం. అది వారి ఇష్టం. కానీ, ఇప్పటివరకు  రాజమౌళి తీసిన సినిమాలోగాని,  విజయేంద్రప్రసాద్​ కథల ఆధారంగా తీసిన సినిమాల్లోగాని సామాజిక మార్పు, కుల వ్యవస్థను మార్చడానికిగాని, మూఢ నమ్మకాల నుంచి, దోపిడీ నుంచి బీద ప్రజలను కాపాడటానికి తీసిన సినిమాలు ఉన్నాయా? ఈ దేశం అతి బీద ప్రజలపైన తీసిన స్లమ్ డాగ్ మిలియనీర్​ సినిమాకు ఎన్నో రంగాల్లో ఆస్కార్​ అవార్డు వచ్చింది. దాన్ని ఈ దేశస్తుడుకాని  డానీబాయిల్​ తీశాడు. అది ఎంత వాస్తవాలకు దగ్గరగా ఉంది? ఒక్క పాటకు ఆస్కార్​ అవార్డు గెలుచుకున్న ఆర్ఆర్ఆర్​  ఎంత వాస్తవాలకు దగ్గరగా ఉంది?  దళిత సంఘాలు, అంబేద్కర్​ అభిమానులు ఇలాంటి అవమానకరమైన సినిమాను తీయనివ్వడం ఎటు దారి తీస్తుంది?  నిర్మాత,  డైరెక్టర్ ఎవరైనా పైసల కోసం పాకులాడి దేశ రాజ్యాంగ నిర్మాత,  కుల వ్యతిరేక పోరాట యోధుడు, గొప్ప మేధావి అంబేద్కర్​ మీదనే ఇలాంటి ఆధారాలు లేని కథలు చెబితే ఇక మిగతా జాతీయ నాయకుల గతేంటి?  అంబేద్కర్​ పెండ్లి హిందూ శాస్త్రోక్తంగా జరిగిందని  ఎందుకు చెప్పదల్చుకున్నారు?  ఆయనకు అవమానం జరిగిందని చెప్పడానికి మహద్ చెరువు పోరాటం కాక,  సావిత్రిబాయి కోరిక మేరకు చెరువు పోరాటం జరిగిందనడంలో అర్థం ఏంటి? ఈ కథ అంతా అంబేద్కర్​ను అవమానించడానికి కాక మరి దేనికి?

- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్​

Note: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com

రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.