బీఆర్ఎస్ పాలనలో పదేండ్ల విధ్వంసంపై స్టడీ చేయాలి: ప్రొ.కోదండరాం

బీఆర్ఎస్ పాలనలో పదేండ్ల విధ్వంసంపై స్టడీ చేయాలి: ప్రొ.కోదండరాం
  • గత సర్కారు ధరణిని అడ్డుపెట్టుకుని భూములు కొల్లగొట్టింది: ఎమ్మెల్సీ కోదండరాం
  • కాళేశ్వరం పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెట్టిందని ఫైర్​
  • పదేండ్లు బీఆర్ఎస్​ నిరంకుశత్వ పాలన: ప్రొఫెసర్​ హరగోపాల్​
  • తెలంగాణ దశాబ్ద అభివృద్ధి, సమస్యలు, సవాళ్లపై కేయూలో సదస్సు

హనుమకొండ/భీమదేవరపల్లి, వెలుగు: రాష్ట్రంలో గత బీఆర్ఎస్​ సర్కారు పాలనలో పదేండ్లలో జరిగిన విధ్వంసంపై ఫీల్డ్​ స్టడీ చేయాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ​కోదండరాం కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు దోచిపెట్టారని, ధరణిని అడ్డుపెట్టుకొని భూములు కొల్లగొట్టారని ఆరోపించారు. 

బీఆర్ఎస్​ పాలనలో తెలంగాణ రాష్ట్రం మాఫియా స్టేట్​కు ఎగ్జాంపుల్​గా మారిందని అన్నారు. ఒక వర్గం ఆర్థిక ప్రయోజనాల కోసం అన్నిరకాల కుట్రలు చేశారని మండిపడ్డారు. ‘తెలంగాణ దశాబ్దకాల అభివృద్ధి,- సమస్యలు, సవాళ్లు’  అనే అంశంపై ఎకనామిక్స్​ హెచ్​వోడీ బి.సురేశ్​ లాల్​ అధ్యక్షతన సోమవారం కాకతీయ యూనివర్సిటీ సెనెట్​హాలులో నిర్వహించిన సదస్సుకు కోదండరాం చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు.  

బీఆర్ఎస్ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీ అని తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ స్వయంగా ప్రకటించారని, దాంతోనే ఉద్యమానికి, ఆ పార్టీకి సంబంధం లేదని చెప్పారని కోదండరాం గుర్తుచేశారు.

మిగతా రాజకీయ పార్టీల్లాగే తాము ఓట్లు, సీట్లు కొంటామని, అధికారాన్ని దక్కించుకుకోవడానికి అన్ని పనులు చేస్తామని ప్రకటించారని చెప్పారు. ఎవరైనా ప్రశ్నిస్తే తెలంగాణ అభివృద్ధికి అడ్డు పడినట్టేననే ముద్ర వేశారని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో వేల కోట్ల నిధులను కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని, ఆ ప్రాజెక్టు మునిగిపోయి ఒక్క పంపు పనిచేయకున్నా అన్ని రిజర్వాయర్లు నిండాయన్నారు. అయినా.. అవి కాళేశ్వరం నీళ్లేనని బీఆర్ఎస్​నేతలు దబాయిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని రూ.4.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని విమర్శించారు. 

దీంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పెరిగిపోయిందని, కొత్త అప్పుల్లో రూపాయికి 75 పైసలు పాత అప్పుల వడ్డీకే సరిపోతున్నాయని చెప్పారు. ధరణి వల్ల ఏం జరిగిందో గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని పరిశోధన చేయాల్సిన అసవరం ఉందని కోదండరాం అభిప్రాయపడ్డారు. 

బీఆర్ఎస్​ మ్యానిపులేట్​పాలిటిక్స్: ప్రొఫెసర్​ హరగోపాల్​

తెలంగాణ ప్రజలు డెమోక్రటిక్​ పాలిటిక్స్​ఆశిస్తే.. గత బీఆర్ఎస్​ సర్కారు మ్యానిపులేట్​ పాలిటిక్స్​ చేసిందని  ప్రొఫెసర్​ హరగోపాల్ విమర్శించారు. నిర్బంధం, నిరంకుశత్వంతో పాలన సాగించారని మండిపడ్డారు. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అసమానతలు పెరిగిపోయాయని చెప్పారు.

 రాష్ట్రంలో 60 నుంచి 70 శాతం జనాభా ఉండే గ్రామీణ ప్రాంతాలకు విద్య, వైద్యం అందుబాటులోకి తేవాలని అన్నారు. ప్రొఫెసర్​ కోదండరాం​మంత్రి అయితే విద్యారంగం బాగుపడుతుందని చెప్పారు. ఈ  సదస్సులో  కేయూ రిజిస్ట్రార్​ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి, ప్రొఫెసర్లు డి.నరసింహారెడ్డి, కూరపాటి వెంకటనారాయణ, మాజీ వీసీ ఇక్బాల్​ అలీ, తదితరులు పాల్గొన్నారు.

వీరభద్రుడికి మొక్కు చెల్లించుకున్న కోదండరాం

భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామిని ఎమ్మెల్సీ కోదండరాం సోమవారం దర్శించుకున్నారు.   తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా ప్రజల తరఫున వీరభద్రుడికి ముడుపు కట్టానని, ఆ మొక్కును చెల్లించుకున్నట్టు తెలిపారు. చెరువుల కబ్జాల వల్ల జరుగుతున్న నష్టాన్ని రూపుమాపడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన 'హైడ్రా'ను స్వాగతిస్తున్నామని చెప్పారు. 

గత ప్రభుత్వం ధరణిలో 23 తప్పులున్నా పదేండ్ల పాటు అలాగే కొనసాగించిందని అన్నారు. ప్రతి పేదవాడికి న్యాయం జరిగేందుకు భూ సంస్కరణలు తీసుకు వచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలన్నారు.