పొన్నం తల్లికి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి

పొన్నం తల్లికి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి
  • మాజీ ఎంపీలు అంజన్ కుమార్,  బలరాం నాయక్, సురేశ్ షెట్కార్ డిమాండ్

హైదరాబాద్, వెలుగు : బీజేపీ బట్టేబాజ్ పార్టీ అని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ విమర్శించారు. శుక్రవారం మాజీ ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షెట్కార్ లతో కలిసి ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ మూడు పార్టీలు ఒక్కటేనన్నారు.

ఐటీ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ నేతల ఇండ్లపై దాడులు చేసి ఇబ్బందులు పెడ్తుందని మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లిపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బేషరతుగా పొన్నం తల్లికి బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలన్నారు.  ఆ తర్వాత కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ..

మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లిపై సంజయ్ విమర్శలు సరికావన్నారు. అనంతరం మరో మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ మాట్లాడారు. బీజేపీ మాత్రమే అయోధ్యలో రామాలయం కట్టలేదన్నారు. ఆ గుడికి తాము కూడా చందాలు ఇచ్చామన్నారు. పొన్నం ప్రభాకర్ రాముడి గురించి మాట్లానప్పటికీ బండి సంజయ్ తప్పుడు ప్రచారం చేసి పొన్నం తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. బండి సంజయ్ వెంటనే పొన్నంకు, ఆయన తల్లికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.