
నిర్మల్, వెలుగు: నిర్మల్ లోని చారిత్రక కోటలు, బురుజులను సంరక్షించి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించాలని ఉస్మానియా యూనివర్సిటీ హిస్టరీ బోర్డ్ చైర్ పర్సన్ ప్రొఫెసర్ ఇందిర కోరారు. ఆదివారం ఆమె నిర్మల్ లోని శ్యామ్ ఘడ్, బౌద్ధ విహార్ తదితర చారిత్రక ప్రాంతాలను ప్రముఖ చరిత్ర కారుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కటకం మురళితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఇందిర మాట్లాడుతూ.. 18వ శతాబ్దంలో నిర్మల్ లో అనేక కోటలు, బురుజులు నిర్మించారని, ఇక్కడి ఇనుముతో దేశ వ్యాప్తంగా ఫిరంగులు తయారు చేసేవారన్నారు.
ఇక్కడి మట్టి గొప్పతనం ఎంతో ఉందన్నారు. ఈ ప్రాంతంలోని చారిత్రక కట్టడాలన్నింటినీ పూర్తిగా రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం పర్యాటక రంగానికి ఎంతో ప్రాధాన్యతనిస్తున్న కారణంగా నిర్మల్ కోటలను అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో భైంసా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్, డాక్టర్ మధు, గంగన్న, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.