
జీడిమెట్ల, వెలుగు : మతి స్థిమితంలేని ఓ వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. జగద్గిరిగుట్ట ఎల్లమ్మబండ మహావీర్కాలనీకి చెందిన గోవింద్‌కు 2014 నుంచి మతిస్థిమితం సరిగా ఉండడం లేదు. దీంతో అతడు మెడిసిన్ వాడుతున్నాడు. కొంతకాలంగా మెడిసిన్ వాడటం మానివేయడంతో మళ్లీ మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతున్నాడు. మంగళవారం ఎల్లమ్మబండలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా మతి స్థిమితం సరిగా లేదని తేలింది. దీంతో గోవింద్ ను ఎర్రగడ్డ లోని మెంటల్ఆస్పత్రికి తరలించారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై డీజీపీ కఠిన చర్యలు తీసుకోవాలని మంగళవారం ట్విట్టర్ వేదికగా ఆయన డిమాండ్ చేశారు.