- బుక్ ఫెయిర్లో ‘శూద్రుల తిరుగుబాటు’ పుస్తకం రిలీజ్
హైదరాబాద్, వెలుగు: పుస్తకం కంటే పార, గడ్డపార గొప్పవని.. అది సివిలైజేషన్ కు పునాది అని సామాజిక తత్వవేత్త, ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ అన్నారు. హరప్పా నగర నిర్మాణం నుంచి దేశం ఎదుగుదలలో శూద్రులు వ్యవసాయం, సైన్స్, టెక్నాలజీ, ఇల్లు కట్టే నైపుణ్యాన్ని ఎలా వినియోగించారనేది చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఆదివారం బుక్ ఫెయిర్ లో కంచ ఐలయ్య రాసిన ‘శూద్రుల తిరుగుబాటు’ బుక్ ను ప్రముఖ కవి పసునూరి రవీందర్ రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కంచ ఐలయ్య మాట్లాడుతూ.. పాఠ్యపుస్తకాల్లో వేదాలు, రామాయణ, మహాభారతాలు తప్ప శూద్రుల జీవితం గురించి ఎక్కడా ప్రస్తావన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం చైనాతో పోటీ పడాలంటే ఉత్పత్తి సైన్స్ పై చర్చ జరగాలన్నారు. పార ముఖ్యమా? రుగ్వేదం ముఖ్యమా? అంటే నా దృష్టిలో పార అన్ని పుస్తకాల కంటే గొప్పదని ఆయన వ్యాఖ్యానించారు. అది ఒక గింజను భూమిలో పాతి, చెట్టుగా మార్చి, పంటనిచ్చి మానవజాతిని బతికిస్తుందని పేర్కొన్నారు.
అదే ఈ దేశ సివిలైజేషన్ కు పునాది అన్నారు. ‘ఆధ్యాత్మిక పుస్తకాల కంటే పార గొప్పది’ అని ఐలయ్య విశ్లేషించారు. పార, గడ్డపార, టెక్నాలజీ, చెప్పులు, పశువులే మన దేశ సంస్కృతికి పునాదులని, వాటిని గౌరవించాలని పిలుపునిచ్చారు.
ఆవుతో పాటు బర్రెనూ పూజించాలి
కేవలం ఆవును మాత్రమే పూజిస్తే సరిపోదని, బర్రెను కూడా పూజించాలని ఐలయ్య చెప్పారు. ‘‘దేశం సమానత్వాన్ని గౌరవిస్తుంది అంటే, బర్రెను, ఆవును కలిపి పూజించాలి. నలుపును, తెలుపును కలిపి ప్రేమించాలి. అప్పుడే నిజమైన సమానత్వం సిద్ధిస్తుంది’’ అని ఆయన స్పష్టం చేశారు. పుస్తకం దేశ సంస్కృతికి ప్రతినిధి కాదని, ఆవు, పార వంటి ఉత్పత్తి సాధనాలే నిజమైన సంస్కృతికి నిదర్శనాలని ఐలయ్య పేర్కొన్నారు.
