సికింద్రాబాద్, వెలుగు : రాష్ట్రంలో వర్సిటీలు పేదరికంలో ఉన్నాయని.. వాటిల్లో నెలకొన్న సమస్యల పరిష్కార బాధ్యత ప్రభుత్వంపై ఉందని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలపై సీఎంతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు.
‘తెలంగాణలో ఉన్నత విద్య – యూనివర్సిటీలు – సమస్యల పరిష్కారాలు’ అంశంపై తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా వర్సిటీలోని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. యూనివర్సిటీల్లో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. నిధులు, ఫ్యాకల్టీ లేకుండా విద్యా వ్యవస్థ పనిచేయదన్నారు. గత ప్రభుత్వం వర్సిటీలను పట్టించుకోలేదన్నారు. వర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. వర్సిటీల సమస్యలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశం, రాష్ట్రంలోని వర్సిటీ లకు చెందిన ఫ్యాకల్టీ పాల్గొన్నారు.