మూడు పిల్లర్లు కాదు.. మూడు వ్యవస్థలు కుంగినయ్: ప్రొఫెసర్​ కోదండరాం

మూడు పిల్లర్లు కాదు.. మూడు వ్యవస్థలు కుంగినయ్: ప్రొఫెసర్​ కోదండరాం
  • కాళేశ్వరం ప్రాజెక్ట్​పై అంతర్జాతీయ నిపుణులతో అధ్యయనం చేయించాలని డిమాండ్​
  • అప్పటి సీఎం, ఇరిగేషన్​ మంత్రి, అధికారులను అరెస్ట్ ​చేయాలి: ఆకునూరి మురళి
  • కాళేశ్వరం.. శనేశ్వరమా? వరమా?: కూనంనేని
  • మేడిగడ్డకు పౌర సమాజాన్ని తీస్కపోవాలి: పాశం 
  • కాళేశ్వరంను అట్లనే వదిలెయ్యాలి: కన్నెగంటి రవి
  • ‘కాళేశ్వరం ప్రాజెక్ట్​.. బీఆర్ఎస్​ అబద్ధాలు, కాగ్​ వాస్తవాలు’పై టీజేఎస్​ బహిరంగ చర్చ 

హైదరాబాద్​, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగింది మూడు పిల్లర్లు కాదని, మూడు వ్యవస్థలని టీజేఎస్​ అధ్యక్షుడు, ప్రొఫెసర్​ కోదండరాం పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగితే చిన్న విషయమన్నట్టు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్​పై మండిపడ్డారు. ఒక్క పిల్లర్​ కుంగితేనే ఇల్లు నిలబడదని, అలాంటిది మేడిగడ్డ బ్యారేజీలో మూడు పిల్లర్లు కుంగితే చిన్న విషయమా? అని నిలదీశారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు.. బీఆర్ఎస్​ అబద్ధాలు, కాగ్​ చెప్పిన వాస్తవాలు’ పేరిట ఆదివారం హైదరాబాద్​లోని సోమాజిగూడ  ప్రెస్​క్లబ్​లో టీజేఎస్​ బహిరంగ చర్చ నిర్వహించింది. ఇందులో రిటైర్డ్​ ఐఏఎస్​ ఆకునూరి మురళి, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం నేతలు, పౌర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రొఫెసర్​ కోదండరాం మాట్లాడుతూ.. మొదటగా కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.87 వేల కోట్లు అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కేసీఆర్​ సర్కారు కుప్పకూల్చిందని అన్నారు. 

 ‘కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 8.7 శాతం వడ్డీతో  అప్పు తెచ్చారు. ఈ వడ్డీ కట్టేందుకే ఏటా రూ.25 వేల కోట్లు కావాలి. కరెంట్​ ఖర్చుకు రూ.11 వేల కోట్లు ఖర్చు పెట్టాలి. మొత్తంగా రూ.36 వేల కోట్లు కావాలి. దీనివల్ల రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ మరింత సంక్షోభానికి గురవుతున్నది. రెండోది.. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి కృష్ణా ప్రాజెక్టులను పెండింగ్​లో పెట్టారు. దీంతో ఇప్పుడు ఇటు కృష్ణా నుంచి అటు కాళేశ్వరం నుంచి నీళ్లిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ప్రాజెక్టు సాగునీటి వ్యవస్థను కుప్పకూల్చింది. మూడోది.. ఇంజనీరింగ్​ వ్యవస్థను నాశనం చేశారు. మన ఇంజనీర్లకు అద్భుతమైన ప్రాజెక్టులకు డిజైన్​ చేసే సత్తా ఉంది. అప్పట్లో శ్రీశైలం ప్రాజెక్టుపై నుంచి వరద వెళ్లినా ఆ ప్రాజెక్టు నిలబడింది. కానీ, గత ప్రభుత్వం ఇంజనీర్ల స్వేచ్ఛను హరించింది. మల్లన్న సాగర్​ను పూర్తిగా నింపితే ఐదు లక్షల మంది ప్రాణానికి గండంగా మారుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ నిపుణులతో స్టడీ చేయించాలి’ అని కోదండరాం కోరారు. 

40 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలే

కాళేశ్వరం ప్రాజెక్టును రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టినా 40 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేకపోయారని  కోదండరాం మండిపడ్డారు. ఒక్క ఎకరానికి నీళ్లిచ్చేందుకు రూ.46 వేలు ఖర్చవుతుందని కాగ్​ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో వాడే కరెంట్​లో 60 శాతం విద్యుత్​ వాడినా ప్రాజెక్ట్​ నిర్వహణకు సరిపోదని రిపోర్ట్​లో పేర్కొన్నట్టు చెప్పారు. మూడో టీఎంసీ అవసరం లేదని, రెండు టీఎంసీల మోటర్లను అదనంగా రన్​ చేస్తే మూడో టీఎంసీని కూడా ఎత్తిపోయొచ్చని నివేదిక స్పష్టం చేసిందన్నారు. రూ.28 వేల కోట్లు దండగపెడుతున్నారంటూ రిపోర్ట్​లో పేర్కొన్నారని చెప్పారు.  ప్రణాళిక, అమలు, టెండర్ల ప్రక్రియలోనూ ఎక్కడా జాగ్రత్త తీసుకోలేదని కాగ్​ రిపోర్ట్​ స్పష్టం చేసిందని,  ప్రాజెక్టును నాటి ప్రభుత్వం గంపగుత్తగా కాంట్రాక్టర్లకు కట్టబెట్టిందని మండిపడ్డారు.

ఎవరు చెప్పినా కేసీఆర్​ వినలే 

కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా నీళ్లు రావని, కరెంట్​ కూడా సరిపోదని ఎంత చెప్పినా కేసీఆర్​ వినలేదని కోదండరాం చెప్పారు. ‘మల్లన్నసాగర్​ ప్రాజెక్టును భూకంప జోన్​లో కట్టారు. దానిని ఉపయోగించుకోవడం కూడా కష్టం. ప్రాజెక్ట్​ ఇంకో ఆరు నెలల్లో పూర్తవుతుందనగా.. కొండపోచమ్మసాగర్​ కోసం కాలువ తవ్వి రూ.70 కోట్లు వృథా చేశారు. ఎల్లంపల్లి నుంచి వరద కాలువలోకి నీరు ఎత్తిపోసేందుకు ప్రాజెక్టులు కట్టారు. అసలు వరద కాల్వలో నీళ్లు ఎత్తిపోయాల్సిన అవసరమేంటి?  స్లోప్​లోనే ఎల్ఎండీకి నీళ్లు వస్తాయి కదా?’  అని ప్రశ్నించారు. ప్రాజెక్టు బాధ్యులను గుర్తించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. దీని కోసం అంతర్గత కమిటీని వేయాలని కాంగ్రెస్​ సర్కారును డిమాండ్​ చేశారు. 

శనేశ్వరమా?  వరమా?: కూనంనేని

కాళేశ్వరం ప్రాజెక్టు శనేశ్వరమా? వరమా? అనేది అర్థం కావడం లేదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ‘ కాంగ్రెస్​ ప్రభుత్వం 2008లో చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ రూ.35 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేది. రూ.2 వేల కోట్లు నిర్వహణ, రూ.2 వేల కోట్ల విద్యుత్​ ఖర్చుతో ఆ ప్రాజెక్ట్​ నిర్మాణం జరిగి ఉండేది. మాజీ సీఎం కేసీఆర్​.. సుమారు రూ.1.25 లక్షల కోట్లతో 18 లక్షల ఎకరాలకు నీళ్లందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కు రూపకల్పన చేశారు. నీటిని ఎత్తి పోసేందుకు విద్యుత్​ ఖర్చు రూ.11 వేల కోట్లు, నిర్వహణ కోసం రూ.10 వేల కోట్లు, మిత్తీలు  కలుపుకొని ఏటా రూ.50 వేల కోట్లు  ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్​ విషయంలో కేసీఆర్​ తీసుకున్న నిర్ణయాలు, ఇంజనీర్లను తప్పుదోవ పట్టించిన అంశాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. అన్ని ప్రాజెక్ట్ లను నిలిపివేసి డబ్బుల్ని కాళేశ్వరం పాలు చేశారు. హైదరాబాద్ ద్వారా వచ్చిన ఆదాయం మొత్తాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ కు పెట్టారు. రూపాయికి 51 పైసల లాభమే ఉంటుందని కాగ్​ రిపోర్ట్​ తేల్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై రిపోర్ట్​ ఇచ్చేందుకు నాలుగు నెలల సమయాన్ని ఎన్​డీఎస్​ఏ అధికారులు కోరారు. ప్రాజెక్ట్​పై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కాంగ్రెస్​, బీఆర్ఎస్​ కొట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. ఎంత ఆలస్యం అయితే అంత లాభం అనేలా కొనసాగుతున్న నిర్మాణాలపై విచారణ జరిపేలా చర్యలకు శ్రీకారం చుట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో నిపుణుల కమిటీ సూచనలతో ముందుకు సాగాలి’ అని కూనంనేని పేర్కొన్నారు. 

ప్రాజెక్టు గురించి ప్రజలకు వివరించాలి: జూలకంటి రంగారెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి  ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉందని సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ‘బ్యారేజీ కూలిపోయే ప్రమాదముందని ప్రభుత్వం అంటున్నది. జస్ట్ పిల్లర్లు మాత్రమే కుంగినయని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ అంటున్నది. ఎవరు కరెక్ట్ అన్న విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. బ్యారేజీపై నిపుణుల కమిటీ వేయాలి.. దాని పునరుద్ధరణపై త్వరగా నివేదిక ఇవ్వాలి. దీనిపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి, చర్చించి తదుపరి చర్యలు తీసుకోవాలి. లక్షల‌‌‌‌‌‌‌‌కోట్లు అవినీతికి పాల్పడ్డారు.. జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిపించి వారి నుంచి డబ్బులు రికవరీ చేయాలి. కోదండరాం నాయకత్వంలో మేడిగడ్డ బ్యారేజీకి వెళ్దాం. సీఎంతో భేటీ అయ్యి ఈ అంశాలపై చర్చించాలి. ప్రధానికి కూడా లేఖ రాయాలి’ అని కోరారు.

ఇంకో రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దు: కన్నెగంటి రవి

కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ రిపోర్ట్​ వచ్చే వరకు దానిని అలాగే వదిలేయాలని, అప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టవద్దని రైతు స్వరాజ్య వేదిక అధ్యక్షుడు కన్నెగంటి రవి కోరారు. ఒక్క రూపాయికి కేవలం 52 పైసలు మాత్రమే లాభం ఉంటుందని కాగ్​ చెప్పిందని గుర్తు చేశారు. అట్లాంటప్పుడు ఆ ప్రాజెక్టుకు ఖర్చు పెట్టి దండగ అని పేర్కొన్నారు. ‘పాత ప్రభుత్వంలోని కేబినెట్​, నీటిపారుదల శాఖ మంత్రిపై క్రిమినల్​ కేసులు పెట్టాలి. పూర్తిస్థాయి నివేదిక వచ్చే దాకా కాంట్రాక్టర్లకు పెండింగ్​లో ఉన్న రూ.10 వేల కోట్ల నిధులను విడుదల చేయొద్దు’ అని  అన్నారు. 

కేసీఆర్​ను వెంటనే అరెస్ట్​చేయాలి: ఆకునూరి మురళి 

తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి రూ.9 వేల కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారని, ఫీజిబుల్​గా ఉన్న ప్రాజెక్టును పక్కనపెట్టి కేసీఆర్​ రీడిజైన్​ చేశారని రిటైర్డ్​ ఐఏఎస్​ అధికారి ఆకునూరి మురళి మండిపడ్డారు. వెంటనే కేసీఆర్​ను అరెస్ట్​ చేయాలని డిమాండ్​ చేశారు. ఒక్క ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు  ఖర్చు పెట్టడం తమాషానా? అని ప్రశ్నించారు. నాటి సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి, ఈఎన్​సీ, టెక్నికల్​ అధికారులను వెంటనే అరెస్ట్​ చేయాలని డిమాండ్​ చేశారు.   ప్రాజెక్టును తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలంటే రూ.50 వేల కోట్లు కావాలన్నారు. ఆ డబ్బులతో ఓక్రిడ్జ్​లాంటి ప్రభుత్వ స్కూళ్లను రాష్ట్రం మొత్తం కట్టినా అన్ని పైసలు కావని చెప్పారు. మరో రూ.50 వేల కోట్లు ఇచ్చి ఉంటే అపోలో లాంటి బ్రహ్మాండమైన ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చేవని పేర్కొన్నారు. కేసీఆర్​ తొమ్మిదన్నరేండ్లలో రూ.18.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని, అందులో రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఉంటే స్కూళ్లు, ఆస్పత్రులు బాగయ్యేవని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఇక్కడితో మూసేస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

ప్రాజెక్టులు కట్టాలనేటోళ్లు అవినీతిపరులే: పాశం యాదగిరి

రాష్ట్రానికీ నీళ్ల కరువు వచ్చే పరిస్థితి ఏర్పడిందని సీనియర్​ జర్నలిస్ట్​ పాశం యాదగిరి ఆందోళన వ్యక్తంచేశారు. హైదరాబాద్​కు కూడా బెంగళూరు దుస్థితి ఏర్పడే ముప్పు ఉందని అన్నారు. ‘111 జీవో రద్దు చేస్తే కొన్ని పార్టీలు పండుగ చేసుకున్నయ్. కానీ, ఇప్పుడు అదే సిటీవాసుల కొంపముంచే ప్రమాదం ఉంది. ప్రాజెక్టులు కట్టేటోళ్లే కాదు.. కట్టాలని అడిగేటోళ్లూ అవినీతి పరులే. అమెరికాలో వందలాది డ్యాంలను కూల్చేస్తున్నరు. ప్రకృతిని కాపాడుకోవడానికి 2,100 డ్యాముల్ని కూలుస్తున్నరు.‌‌‌‌‌‌‌‌ ఇక్కడ మాత్రం ఎందుకు కట్టమంటున్నరు? తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ కట్టి అవతలి వాళ్ల పొట్ట కూడా కొట్టాల్నా?  మేడిగడ్డకు అఖిల పక్షాన్నికాదు.. పౌరసమాజాన్ని తీసుకుపోవాలి. వారితో కలిసి పోరాడాలి. రాష్ట్రంలోనూ ప్రాజెక్టులను కూల్చేయాలి.. ప్రాజెక్టులంటే స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడమే’ అని పేర్కొన్నారు.