ఇక్కడి ప్రజలకు బీఆర్ఎస్​తో సంబంధం లేదు: కోదండరాం

ఇక్కడి ప్రజలకు బీఆర్ఎస్​తో సంబంధం లేదు: కోదండరాం

       త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారుల సదస్సులు నిర్వహిస్తామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారడంతో ఆ పార్టీకి తెలంగాణతో ఉన్న పేగుబంధం తెగిపోయిందని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ పేరును వదులుకోవడమంటే అమరవీరులను అవమానించినట్టేనని, రాష్ట్ర ఆకాంక్షలను, తల్లి ఇచ్చిన పేరును వదులుకోవడమేనని అన్నారు. ఇకపై బీఆర్ఎస్ తో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

శనివారం హైదరాబాద్ నాంపల్లిలోని టీజేఎస్ స్టేట్ ఆఫీసులో కోదండరాం మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ రాష్ట్రంలోనే పూర్తిగా విఫలమైందని, ఇక కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి పోయి చేసేదేమీ లేదని విమర్శించారు. ‘‘రాష్ట్ర రైతులు అప్పుల్లో కూరుకుపోతేనే కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ఇక దేశంలోని రైతులకు ఆయనేం చేస్తారు? కేసీఆర్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది” అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతు బీమా తప్ప.. రైతులకు కేసీఆర్ మరే సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. 

అవినీతి పెరిగిపోయింది... 

రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే రూ.30 వేల కోట్ల అవినీతి జరిగిందని కోదండరాం ఆరోపించారు. ‘‘టీఆర్ఎస్ మనకు రాజీనామా ఇచ్చి పోతున్నది. తెలంగాణ కాడెత్తేసి పోతున్నది. తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం ఉద్యమకారులు ఒక్కటిగా నిలబడాల్సిన అవసరం ఉంది. అందుకోసం త్వరలో ‘‘తెలంగాణ బచావ్’’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారుల సదస్సులు నిర్వహిస్తాం” అని తెలిపారు. తెలంగాణలో రూల్ ఆఫ్ లా లేకుండా పోయిందని టీజేఎస్ ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వర్ రావు అన్నారు. అవినీతిలో తెలంగాణ నంబర్ వన్ గా మారిందన్నారు.