
- నేషనల్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ సుధాంశు కుమార్
- కులగణన, ఓబీసీ రిజర్వేషన్లపై సూచనలు ఇవ్వనున్న కమిటీ
- కొన్నేండ్లుగా కులగణన కోసం ఐలయ్య పోరాటం
- రాహుల్ నేతృత్వంలో పోరాడేందుకు సిద్ధమని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ ఓబీసీ ఐడియాలజీ అడ్వైజరీ కమిటీలో తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు చోటు కల్పిస్తూ ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 23 మంది మేధావులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ అనిల్ జైహింద్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఈ కమిటీకి నేషనల్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ సుధాంశు కుమార్‌ను నియమించారు.
కమిటీలో ప్రొఫెసర్ కంచ ఐలయ్య, హెచ్ఎల్ దుషధ్, ప్రొఫెసర్ రవికాంత్ చందన్, డాక్టర్ సుభాష్ సైనీ, జి.కిరణ్ కుమార్, ఎస్ఏఎస్ కిర్మాణి, ప్రొఫెసర్ రవీంద్ర సింగ్, డాక్టర్ అరవింద్ యాదవ్, అడ్వొకేట్ వినోబర్ లెనిన్, సురేంద్ర కుమార్, సురేంద్ర కుమార్ సైనీ, డాక్టర్ వికాస్ యాదవ్, డాక్టర్ మధు బాఘేల్, డాక్టర్ దినేశ్ అహిరావ్, అరుణ్ కుమార్ రాయ్, డాక్టర్ పంకజ్, డాక్టర్ రీతురాణి, హిమ్మత్ సింగ్, అమిత్ బావా సైనీ, అభిషేక్ జైస్వాల్, డాక్టర్ రాజేశ్ కుమార్, డాక్టర్ సరోదే రాజేంద్ర గోరఖ్ మెంబర్లుగా ఉన్నారు.
దేశవ్యాప్తంగా కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు లక్ష్యంగా ముందుకెళ్తున్న కాంగ్రెస్.. మేధావులతో ఓబీసీ ఐడియాలజీ కమిటీ ఏర్పాటు చేయడం మరో ముందడుగు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓబీసీ రిజర్వేషన్లు, హక్కులు, ఇతర అంశాలపై ఈ కమిటీ సూచనలు ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
రాహుల్ సమక్షంలో స్పీచ్..
ఇటీవల ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో జరిగిన ఓబీసీ మీటింగ్‌లో రాష్ట్ర మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో కలిసి కంచ ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో స్పీచ్ ఇచ్చారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేపై వివరించారు. తాను కులగణన కోసం కొన్నేండ్లుగా ఉద్యమిస్తున్నానని ఆయన చెప్పారు.
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలంటున్న రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. తాను ఏ పార్టీలో సభ్యుడిని కాదని, కానీ రాహుల్ నేతృత్వంలో ఓబీసీల కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఓబీసీ ఐడియాలజీ అడ్వైజరీ కమిటీలో ఐలయ్యకు కాంగ్రెస్ చోటు కల్పించింది.
ఆర్ఎస్‌ఎస్, బీజేపీపై పోరు..
ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాజకీయ సిద్ధాంతకర్త, రచయిత, దళిత హక్కుల కార్యకర్త. ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పని చేశారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ వర్సిటీలో సెంటర్ ఫర్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇన్‌క్లూజివ్ పాలసీకి డైరెక్టర్‌గా ఉన్నారు. ఇంగ్లీషు, తెలుగు భాషల్లో రచనలు చేస్తూ కుల నిర్మూలనపై ప్రధానంగా దృష్టి సారించారు.
చాలా ఏండ్లుగా కులగణన కోసం ఉద్యమిస్తున్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ కోసం, దేశవ్యాప్తంగా కులగణన కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నారు. రాజ్యాంగ రూపకల్పన, ప్రజాస్వామ్యాన్ని సంస్థాగతీకరించడంలో నెహ్రూతో కలిసి పని చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్‌ను కాంగ్రెస్ ఓన్ చేసుకోవాల్సిన అవసరం గురించి పుస్తకం రాస్తున్నారు. అలాగే ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా పొరాడుతున్నారు.