మోడీ తొమ్మిదేండ్ల పాలనపై నెలపాటు ప్రోగ్రామ్స్

మోడీ తొమ్మిదేండ్ల పాలనపై నెలపాటు ప్రోగ్రామ్స్

హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోడీ తొమ్మిదేండ్ల పాలనపై ‘మహాజన సంపర్క్ అభియాన్’ పేరుతో గురువారం నుంచి నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. ఈ షెడ్యూల్ ను బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ విడుదల చేశారు. మోడీ తొమ్మిదేండ్ల పాలనపై రూపొందించిన పాట, 9yearsofseva.bjp.org పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్ సైట్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ నెల రోజుల పాటు మోడీ సాధించిన విజయాలు, చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని సంజయ్ తెలిపారు. 90909 02024 నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి, మోడీకి మద్దతు తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్ తదితరులు పాల్గొన్నారు. 
ఇవీ బీజేపీ కార్యక్రమాలు.. 

  • ఈ నెల 1 నుంచి 7 వరకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మీడియా సమావేశాలు, సోషల్ మీడియా ఇంటారాక్షన్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల సందర్శన ఉంటుంది. ఇందులో కేంద్రమంత్రులు, జాతీయ నేతలు పాల్గొంటారు. 
  •     8 నుంచి 14 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ సీనియర్ నాయకులతో సమ్మేళనం, అదే విధంగా మోర్చాల సంయుక్త సమ్మేళనం ఉంటుంది. 
  •     15 నుంచి 21 వరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 5 వేల మందితో బహిరంగ సభలు, మరో మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తారు.  
  •     21న అన్ని మండలాల్లో ‘యోగా దివస్’ నిర్వహిస్తారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా 23న ప్రతి పోలింగ్ బూత్ లో కార్యక్రమాలు ఉంటాయి. 25న ప్రతి పోలింగ్ బూత్ లో ‘మన్ కీ బాత్’ నిర్వహిస్తారు.  
  •     22 నుంచి 28 వరకు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో శక్తి కేంద్రాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తారు. అదే విధంగా గడప గడపకు బీజేపీ పేరుతో ఇంటింటి ప్రచారం చేస్తారు.