
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెన్త్ క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆగస్టు మొదటి వారంలో లాంగ్ మెమోలు ఇవ్వనున్నారు. ఏప్రిల్ నెలాఖరులో టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. దీంట్లో 4,60,519 మంది రెగ్యులర్, 6141 మంది ప్రైవేటు విద్యార్థులు పాసయ్యారు. గత నెలాఖరులో అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు రాగా.. 24,415 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రస్తుతం రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వారం, పదిరోజుల్లోనే వీటిని పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇది పూర్తికాగానే టెన్త్ పాసైన మొత్తం 4.9 లక్షల మందికి కొత్త లాంగ్ మెమోలు ఇవ్వనున్నారు. ఇప్పటికే చిన్న మెమోలు అందించారు. వీటిని మెయిన్ మెమోల మాదిగానే ట్రీట్ చేయాలని గతంలోనే అధికారులు ఆదేశాలివ్వడంతో, ఎక్కడా ఇబ్బందులు రావడం లేదు. అయితే, ఈనెలాఖరులో ప్రింటింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగిస్తున్నారు. వీటిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11 వేల హైస్కూళ్లకు స్కూళ్ల వారీగా ప్యాక్ చేసి పంపించనున్నారు. విద్యార్థుల మెమోల్లోని వివరాలను మరోసారి లాగిన్ పెట్టనున్నారు. దీంట్లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే సరిచేయనున్నారు. కాగా.. నిరుడు అక్టోబరులో లాంగ్ మెమోలు పంపించగా, ఈసారి ఆగస్టులోనే అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.