విద్యార్థుల ఫొటోస్ మార్ఫింగ్ కేసులో..నిందితుడు అరెస్ట్

విద్యార్థుల ఫొటోస్ మార్ఫింగ్ కేసులో..నిందితుడు అరెస్ట్

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ విజ్ఞాన భారతి ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థినుల ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వారిని వేధిస్తున్న నిందితుడు విజయవాడకు చెందిన ప్రదీప్ తో పాటు,  మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా కళాశాలో పరీక్షలు సైతం క్యాన్సల్ చేసి మరీ సంక్రాంతి పండుగ సాకుతో కళాశాల యాజమాన్యం స్టూడెంట్స్ ను ఇంటి బాట పట్టించినట్టు తెలుస్తోంది.

ఈ కేసులో మొత్తం ఏడు నెంబర్ల నుంచి అమ్మాయిల ఫొటోలను నిందితుడు మార్ఫింగ్ చేసి, బ్లాక్ మెయిల్ చేసినట్టు తెలుస్తోంది. కేవలం ఫొటోల మార్ఫింగ్ మాత్రమే కాదు ఫోన్లో ఉన్న పర్సనల్ డేటా సైతం మొత్తం హ్యాక్ చేసినట్టు సమాచారం. 

అసలేమైందంటే...

ఔషాపూర్​లోని వీబీఐటీ కాలేజీలోని విద్యార్థినుల వాట్సాప్ గ్రూప్​లను ఓ వ్యక్తి  హ్యాక్ చేశాడు. దాంతో పాటు వారి డీపీలను డౌన్​లోడ్ చేసుకుని, వాటిని న్యూడ్ ఫొటోలుగా మార్ఫింగ్ చేసి తిరిగి వారికే పంపిస్తున్నారని ఇటీవల కళాశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కాలేజీ ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్​​కు కంప్లయింట్ చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే తగిన చర్యలు తీసుకోవాలని వీబీఐటీ స్టూడెంట్లు తమ కాలేజీ మందు ధర్నా చేపట్టారు. కాగా వీరి నిరసనకు ఎన్ఎస్​యూఐ, యువజన కాంగ్రెస్ విభాగం మద్దతు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా పలు సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. 

కాగా ఈ ధర్నాలో పాల్గొన్న ఎన్​ఎస్​యూఐ నేతలను పోలీసులు అరెస్టు చేసి ఘట్​కేసర్ పీఎస్​కు తరలించారు. దీంతో వివాదం ముదరడంతో కొంతమంది స్టూడెంట్లు, యువకులు గేట్లను తోసుకుని లోపలికి వెళ్లగా.. వారికి, పోలీసుల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్​రెడ్డి మాట్లాడుతూ.. ఫొటోల మార్పింగ్ ​విషయంపై కాలేజీలో ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆ హ్యాకర్ ఇప్పటికీ విద్యార్థినులకు వేర్వేరు నంబర్లతో కాల్ చేసి బెదిరిస్తున్నాడని, దీంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిందని పేర్కొన్నారు. ధర్నా తీవ్రతరం కావడంతో.. విద్యార్థి నాయకులతో యాజమాన్యం, పోలీసులు చర్చలు జరిపారు. నిందితుడిని తర్వలోనే పట్టుకుంటామని మల్కాజిగిరి ఏసీపీ నరేశ్​రెడ్డి వారికి హామీ ఇచ్చారు. ఇప్పటికే రెండు ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పడంతో స్టూడెంట్లు ధర్నాను విరమించుకున్నారు.