బీజింగ్: ఎల్‌వోసీ వెంబడి నెలకొన్న ఉద్రిక్తతల తగ్గింపుతోపాటు దళాలను వెనక్కి తీసుకోవడంలో పురోగతి కనిపిస్తోందని చైనా తెలిపింది. తూర్పు లడఖ్‌లోని గల్వాన్ వ్యాలీలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇండియాతో ఆరు రోజుల నుంచి కమాండర్ లెవల్ స్థాయిలో చర్చలు జరుపుతున్నామని డ్రాగన్ పేర్కొంది. అయితే ఈ చర్చల గురించి పూర్తి వివరాలను చెప్పడానికి మాత్రం చైనా నిరాకరించింది.
‘గత నెల 30న చైనా–ఇండియా దళాలు కమాండర్ లెవల్ చర్చలు జరిపాయి. రెండు రౌండ్ల చర్చల తర్వాత ఉద్రిక్తతల తగ్గింపునకు ఇరు వర్గాలు ఒప్పుకున్నాయి. టెన్షన్స్ తగ్గించడంలో భాగంగా దళాలను వెనక్కి తీసుకోవడంలో పురోగతి కనిపిస్తోంది. చైనా దీనిని స్వాగతిస్తోంది. ఇండియా కూడా మాతో సహకరిస్తుందని, చర్చల ద్వారా ఏకాభిప్రాయాన్ని సాధించొచ్చని ఆశిస్తున్నాం. బార్డర్ ఏరియాలో పరిస్థితులపై సైనిక, దౌత్య మార్గాల ద్వారా ఇండియాతో కమ్యూనికేషన్‌ను కొనసాగించాలని భావిస్తున్నాం’ అని ఓ బ్రీఫింగ్‌లో చైనా ఫారెన్ మినిస్ట్రీ ప్రతినిధి జావో లిజియాన్ చెప్పారని తెలిసింది.
