హైదరాబాద్: టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, అనలిస్ట్ త్రిపురనేని చిట్టిబాబు (56) గుండె పోటుతో మృతి చెందారు. మంగళవారం (ఏప్రిల్ 21) రాత్రి ఆయన అస్వస్థతకు గురయ్యారు. చాతీలో నొప్పితో ఇంట్లో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యుల వెంటనే ఆయన్ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. చిట్టిబాబు గుండె పోటుతో మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. చిట్టిబాబు అకాల మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తు్న్నారు.
చిట్టిబాబు బ్యాగ్రౌండ్:
నిర్మాత, నటుడు, అనలిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిట్టిబాబు 1970, జనవరి 1న కృష్ణా జిల్లాలోని కాజ గ్రామంలో జన్మించారు. త్రిపురనేని మహారథి, హేమలత ఆయన తల్లిదండ్రులు. చిట్టిబాబు అసలు పేరు వరప్రసాద్. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. చిట్టిబాబు తండ్రి త్రిపురనేని మహారథి ఇండస్ట్రీలో సుప్రసిద్ద వ్యక్తి. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని చిట్టిబాబు కూడా సినీ పరిశ్రమలో నిర్మాత, నటుడు, అనలిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడీయన్, సహాయ నటుడిగా అనేక చిత్రాల్లో నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు.

