కిషన్​రెడ్డికి ప్రమోషన్​

V6 Velugu Posted on Jul 08, 2021

  • ప్రధాని మోడీ కేబినెట్ లోకి 36 మంది కొత్త మంత్రులు  
  • మరో ఏడుగురికి కేబినెట్​ హోదా  
  • 43 మంది మంత్రులతో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి 
  • మోడీ కేబినెట్ లో 77కు చేరిన మంత్రుల సంఖ్య 
  • కొత్త మంత్రులకు శాఖలు కేటాయించిన ప్రధాని
  • పాత మంత్రుల శాఖల్లో మార్పు

న్యూఢిల్లీ:  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న జి. కిషన్ రెడ్డికి కేబినెట్ మినిస్టర్ గా ప్రమోషన్ దక్కింది. బుధవారం సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయనతో కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేయించారు. ప్రధాని మోడీ కొత్త టీంలో కిషన్ రెడ్డితో సహా మొత్తం15 మంది కేబినెట్ మినిస్టర్లుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి కొత్త మంత్రులతో రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. కరోనా రూల్స్​ను పాటిస్తూ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు కార్యక్రమానికి హాజరయ్యారు. కరోనా విపత్తును సరిగ్గా హ్యాండిల్ చేయలేదని ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హెల్త్ మినిస్టర్ డాక్టర్ హర్షవర్ధన్ పదవి గల్లంతయ్యింది. విద్యా శాఖ మంత్రి పోఖ్రియాల్ అనారోగ్యంతో రాజీనామా చేశారు. ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి జవదేకర్ సహా మొత్తం12 మంది మంత్రి పదవులు పోయాయి. 

కేంద్ర కేబినెట్ విస్తరణ, కొత్త మంత్రుల ప్రమాణానికి కొన్ని గంటల ముందు మంత్రులుగా బెర్త్ కన్ఫమ్ అయిన నేతలు ప్రధాని మోడీని కలిశారు. మీటింగ్ కు బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, పార్టీ సీనియర్ నేతలు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బీఎల్ సంతోష్ కూడా హాజరయ్యారు. కొత్త మంత్రుల ప్రమాణం తర్వాత ప్రధాని మోడీ వారికి శాఖలను కేటాయించారు. కొత్త మంత్రులతో సహా గురువారం కేంద్ర కేబినెట్ భేటీ కానుంది.  
కేబినెట్ పై మోడీ గట్టి కసరత్తు 
ప్రధాని మోడీ రెండో టర్మ్ 2019 మే నెలలో ప్రారంభమైంది. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ లో ప్రధాని మార్పులు, చేర్పులు చేయడం ఇదే మొదటిసారి. ఈసారి కేంద్ర కేబినెట్ లో మార్పులకు ముందు మోడీ గట్టి కసరత్తే చేసినట్లు కన్పిస్తోంది. వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతాలను రిప్రజెంట్ చేసే యంగ్ లీడర్లకు, ఎక్స్ పీరియెన్స్ ఉన్న సీనియర్లకు ప్రాధాన్యం ఇచ్చారు. యూపీ నుంచి ఏడుగురికి చాన్స్ దక్కింది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా కేబినెట్ లో మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. 
77కు చేరిన మంత్రుల సంఖ్య 
ప్రధాని మోడీ కేబినెట్ లో ఏడుగురికి ప్రమోషన్ దక్కగా, కొత్తగా 36 మంది మంత్రులుగా చేరారు. దీంతో మోడీ కేబినెట్ లో మొత్తం మంత్రుల సంఖ్య 77కు చేరింది. వీరిలో సగానికిపైగా మంది కొత్తవాళ్లే ఉన్నారు.  కొత్త కేబినెట్ లో 50 ఏండ్లలోపు వాళ్లు 14 మందికి స్థానం దక్కింది. 46 మందికి ఇంతకుమునుపు మంత్రులుగా పని చేసిన అనుభవం ఉంది. నలుగురు మాజీ సీఎంలు కూడా ఉన్నారు. రాష్ట్ర మంత్రులుగా పని చేసిన వారు18 మంది ఉన్నారు. అలాగే 13 మంది లాయర్లు, ఆరుగురు డాక్టర్లు, ఐదుగురు ఇంజనీర్లు, ఏడుగురు మాజీ బ్యూరోక్రాట్స్, ఏడుగురు పీహెచ్ డీ, ముగ్గురు ఎంబీఏ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. కొత్తగా ఏడుగురు మహిళలు మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో కేబినెట్ లో మహిళా మంత్రుల సంఖ్య 11కు చేరింది. సామాజిక వర్గాల ప్రకారం చూస్తే.. 12 మంది ఎస్సీలకు, 8 మంది ఎస్టీలకు, 23 మంది బీసీలకు చాన్స్ దక్కింది.  
ఏడుగురికి ప్రమోషన్ 
కేంద్ర సహాయ మంత్రులుగా ఉన్న ఏడుగురికి ప్రధాని మోడీ ప్రమోషన్ ఇచ్చారు. జి. కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, హర్ దీప్ సింగ్ పురి, పురుషోత్తం రుపాలా, మన్సుఖ్ మాండవీయ, కిరణ్ రిజిజు, రాజ్ కుమార్ సింగ్ సహాయ మంత్రుల నుంచి కేబినెట్ హోదాకు ప్రమోషన్ పొందారు. హిమాచల్ ప్రదేశ్ ఎంపీ, మాజీ బ్యూరోక్రాట్ అయిన అనురాగ్ ఠాకూర్ ఇప్పటివరకు ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. మోడీ ప్రభుత్వంలో పవర్ సెక్టార్ అభివృద్ధి వెనక ఈయన కీలక పాత్ర పోషించారు. కిరణ్ రిజుజు స్పోర్ట్స్, మైనారిటీ అఫైర్స్ శాఖల సహాయ మంత్రిగా ఉన్నారు. పురుషోత్తం వ్యవసాయ శాఖలో సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు.  
మిత్రపక్షాలకు మూడు
మోడీ కొత్త టీంలో మిత్ర పక్షాలకు మూడు మంత్రి పదవులు దక్కాయి. జేడీయూ నుంచి ఆర్ సీపీ సింగ్, ఎల్జేపీ నుంచి పశుపతి పరాస్, అప్నా దళ్ నుంచి అనుప్రియా పటేల్ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటివరకు మిత్రపక్షాల్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన రామ్ దాస్ అథవాలే ఒక్కరే మంత్రిగా ఉన్నారు. 
12 మంది ఔట్  
కేంద్ర కేబినెట్ విస్తరణలో 12 మంది మంత్రుల పదవులు గల్లంతయ్యాయి. కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసిన వారిలో ఐటీ, న్యాయ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ, లేబర్ మినిస్టర్ సంతోష్ గంగ్వార్, మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దేబాశ్రీ చౌదరి, జల శక్తి శాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కటారియా, పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో, విద్యా శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే,  ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వనీ కుమార్ చౌబే, సోషల్ జస్టిస్, ఎంపవర్ మెంట్ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ఉన్నారు.
పాత మంత్రులకు శాఖల మార్పులు ఇలా.. 
హర్షవర్ధన్ రాజీనామాతో ఖాళీ అయిన సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను ప్రధాని తన వద్దే ఉంచుకున్నారు.  అమిత్ షా (హోం శాఖ, సహకార శాఖ), జి. కిషన్ రెడ్డి (కల్చర్ అండ్ టూరిజం, నార్త్ ఈస్ట్ రీజియన్ డెవలప్ మెంట్ శాఖ), మన్సుఖ్ మాండవీయ(ఆరోగ్య శాఖ, కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్), పియూష్ గోయెల్  (కామర్స్, ఇడస్ట్రీ, ఆహారం, ప్రజా పంపిణీ, చేనేత, జౌళి శాఖ),  అనురాగ్ ఠాకూర్ (సమాచార ప్రసార శాఖ, యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్),  హర్ దీప్ సింగ్ పురి (హౌజింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ,  పెట్రోలియం శాఖ ) కిరణ్​రిజుజు (న్యాయ శాఖ) ధర్మేంద్ర ప్రధాన్ (ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్​ షిప్​) శాఖల్లో మార్పులు ఈ మేరకు జరిగాయి. 
మోడీ దిశానిర్దేశం 
న్యూఢిల్లీ, వెలుగు:  కేంద్ర కేబినేట్ లో చేరిన కొత్త మంత్రులకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేశారు. కొత్తగా చోటు దక్కిన వారికి, సహాయ మంత్రుల నుంచి పూర్తిస్థాయి మంత్రులుగా ప్రమోషన్ పొందిన వారికి ప్రధాని కార్యాలయం నుంచి మంగళవారం సమాచారం అందింది. వీరంతా బుధవారం మధ్యాహ్నం లోక్ కల్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా సహచర మంత్రులకు మోడీ గ్రీటింగ్స్ తెలిపారు. త్వరలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో త్వరగా తమ శాఖల బాధ్యతలు స్వీకరించాలని చెప్పారు.

కేంద్ర కేబినెట్ విస్తరణ అద్భుతం:  వివేక్ వెంకటస్వామి
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర మంత్రివర్గ విస్తరణ అద్భుతంగా ఉందని.. కొత్త ఇండియా ఆకాంక్షలకు తగ్గట్లుగా ప్రధానిమోడీ కేబినెట్​ను విస్తరించారని బీజేపీ స్టేట్ కోర్​కమిటీ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. దేశానికి మంచి డైరెక్షన్ ఇచ్చేలా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చి వన్ ఇండియా దిశలో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. కేబినెట్​మంత్రులుగా ప్రమోషన్ పొందిన కిషన్​రెడ్డి, అనురాగ్ ఠాకూర్​ను బుధవారం ఢిల్లీలో వివేక్ సన్మానించారు. కేంద్ర మంత్రులిద్దరికి శాలువాలు కప్పి, స్వీట్లు తినిపించారు. తర్వాత మీడియాతో వివేక్​ మాట్లాడుతూ.. దేశంలో 40 శాతం యువతకు ప్రాతినిథ్యం ఉండాలనే ఉద్దేశంతో మోడీ కేబినెట్​లో యువకులకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. 
మోడీ మెచ్చేలా కిషన్​రెడ్డి కష్టపడ్డారు
ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కిషన్ రెడ్డి చాలా కృషి చేశారని వివేక్​ అన్నారు. కిషన్ రెడ్డికి కేబినెట్ పదవి ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు. ఏబీవీపీ నుంచి ఇప్పటి వరకు చేసిన కృషే ఆయనకు కేంద్ర మంత్రి పదవి రావడంలో దోహదపడిందన్నారు. బీజేవైఎం ప్రెసిడెంట్ గా కూడా విశిష్ట సేవలందించారని తెలిపారు. హోంశాఖ సహాయ మంత్రిగా ప్రధాని మెచ్చేలా బాగా పని చేశారని చెప్పారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెచ్చేందుకు ఆయన కృషి చేస్తారన్నారు.
రాష్ట్రంపై పార్టీ ఫోకస్​ పెరిగింది 
కిషన్​రెడ్డికి ప్రమోషన్ బీజేపీతో పాటు రాష్ట్రానికి మేలు జరుగుతుందని వివేక్ అన్నారు. ఈటల రాజేందర్ చేరిక సందర్భంగా దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో టీఆర్​ఎస్​కు ప్రత్యామ్నాయం బీజేపీ అని గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని, హుజూరాబాద్​లోనూ ఇదే తీర్పు వస్తుందన్నారు.

Tagged Bjp, PM Narendra modi, cabinet, Kishan reddy, Promotion,

Latest Videos

Subscribe Now

More News