గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన

గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన

రాయికోడ్, వెలుగు: గ్యాస్ సిలిండర్ కోసం ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో బుక్ చేసుకుని వారం రోజులు గడుస్తున్నా సరఫరా లేదంటూ బుధవారం సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో ఇండియన్ ఏజెన్సీ కార్యాలయం వద్ద ఖాళీ సిలిండర్లతో ఆందోళన చేశారు. ఆఫీసుకు వచ్చిన వారికి ‘నో స్టాక్’ అని బోర్డు పెట్టి, రేపు-మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. హోటళ్లకు గృహ సిలిండర్లను అధిక ధరలకు సరఫరా చేస్తూ సాధారణ ప్రజలకు కొరత సృష్టించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.

గత నెల 31న డీఎస్ఓ బాలసరోజ ఏజెన్సీని తనిఖీ చేశారని, అయినా ఏజెన్సీ నిర్వాహకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని అన్నారు. మొబైల్ ఫోన్ నుంచి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో బుక్ చేసిన తర్వాత ఓటీపీని ఏజెన్సీకి చెప్పాల్సి ఉంటుందని, ఆ ఓటీపీలు తీసుకుని సిలిండర్లను ఇతరులకు విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌‌‌‌‌‌‌‌ఐ చైతన్యకిరణ్, ఏఎస్‌‌‌‌‌‌‌‌ఐ యాదగిరి తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. బుకింగ్ చేసుకున్న వారికి సిలిండర్లు ఇప్పించేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.