- బజరంగ్దళ్, వీహెచ్‌పీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట
- పరిస్థితి కంట్రోల్ తప్పడంతో లాఠీ చార్జ్
- 15 మంది ఆందోళనకారులు,12 మంది పోలీసులకు గాయాలు
సికింద్రాబాద్, వెలుగు: కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ బజరంగ్ దళ్, విశ్వహిందూపరిషత్ నాయకులు శనివారం చేపట్టిన లష్కర్బంద్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కొందరు ముత్యాలమ్మ గుడి ముందు బైఠాయించి నిరసనకు దిగగా, వందల మంది ఆందోళనకారులు మహంకాళి టెంపుల్నుంచి ముత్యాలమ్మ గుడి వరకు ర్యాలీగా వచ్చారు. అంతా కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుడి సమీపంలోని మసీదులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆందోళనకారులు పోలీసులపైకి వాటర్ పాకెట్లు, కుర్చీలు, చెప్పులు, కర్రలు విసిరారు.
పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్చేసి అందరిని చెదరగొట్టారు. 15 మంది ఆందోళనకారులు, 12 మంది పోలీసులు గాయపడ్డారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికి మళ్లీ నిరసనకారులు గుడి వద్ద గుమిగూడారు. బీజేపీ కార్పొరేటర్ కొంతం దీపిక నచ్చజెప్పినా నిరసనకారులు అక్కడి నుంచి కదలలేదు. టాస్క్‌ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ పోలీసులు భారీగా చేరుకుని వారిని శాంతిపంజేశారు. కాగా అర్ధరాత్రి వరకు హైటెన్షన్కొనసాగింది. తోపులాట, లాఠీచార్జ్టైంలో కొంతమంది అటుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సుల అద్దాలను ద్వంసం చేశారు.
మార్కెట్లు, షాపులు, హోటళ్ల నిర్వాహకులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. ర్యాలీ మెట్రో పోలిస్ హోటల్వద్దకు రాగానే ఆగ్రహంతో ఊగిపోయిన ఆందోళనకారులు హోటల్‌పై రాళ్లు రువ్వారు. కాగా లాఠీచార్జ్‌లో తీవ్రంగా గాయపడిన ఓల్డ్ బోయిన్ పల్లికి చెందిన భాజపా నాయకుడు సాయిని కేంద్రమంత్రి బండి సంజయ్ శనివారం రాత్రి పరామర్శించారు. పోలీసుల తీరును ఖండించారు. పూర్తిస్థాయి విచారణ జరిపి ఆలయంపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
అదుపు చేసేందుకే లాఠీ చార్జ్: నార్త్ జోన్ డీసీపీ
నిరసనకారులు ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారని, మసీదులోకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులపై రాళ్లు, కర్రలు విసిరి నానా హంగామా సృష్టించారని, పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీ చార్జ్చేశామని నార్త్జోన్డీసీపీ రష్మి పెరుమాళ్ తెలిపారు. శాంతియుత నిరసన అని చెప్పి దాదాపు 3 వేల మంది ఆందోళనకు దిగారని, రెండు గ్రూపులు గా విడిపోయి ఒకరు మెట్రో పోలిస్ హోటల్ వైపు, మరొకరు ముత్యాలమ్మ ఆలయం వైపు దూసుకొచ్చారని చెప్పారు. దాడిలో 12 మంది పోలీస్ సిబ్బందికి గాయపడ్డారని, వారిలో ఓ ఏసీపీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, లేడీ కానిస్టేబుళ్లు ఉన్నారన్నారు. లాఠీ చార్జ్‌లో 15 మంది ఆందోళనకారులు గాయపడ్డారని చెప్పారు. సోషల్‌మీడియాలోని పుకార్లను నమ్మొద్దని సూచించారు. మెట్రో పోలిస్హోటల్ను సీజ్‌చేశామని వెల్లడించారు.
ఆలయాలపై దాడులను అరికట్టాలి: వీహెచ్‌పీ
రాష్ట్రంలోని ఆలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని వీహెచ్ పీ అధికార ప్రతినిధి పగుడాకుల బాలస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలయాలపై దాడులను నిరసిస్తూ శనివారం ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లాల్ దర్వాజా మందిర్ నుంచి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దేవాలయాలను పరిరక్షించాలని నినాదాలు చేశారు.