రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, దిష్టిబొమ్మ దహనాలు

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, దిష్టిబొమ్మ దహనాలు

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ తమను అవమానించేలా చేసిన కామెంట్లపై విశ్వబ్రాహ్మణులు ఫైర్ అయ్యారు. జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లొజు ఆచారి విషయంలో కేటీఆర్ అనుచితంగా మాట్లాడారని, విశ్వబ్రహ్మణులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆచారిని ‘పప్పుచారి’, ‘గొట్టంగాడు’ అనడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. మంత్రిపై కేసు పెట్టాలని పలు చోట్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.

రాస్తారోకోలు.. దిష్టిబొమ్మల దహనాలు
కేటీఆర్‌‌‌‌పై కేసు నమోదు చేయాలంటూ మెట్‌‌పల్లిలో నేషనల్ హైవే 63 పై విశ్వబ్రాహ్మణ, మనుమయ సంఘాల అధ్వర్యంలో రాస్తారోకో చేశారు. పట్టణంలో భారీ ర్యాలీ తీసి, సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో నేషనల్ హైవేపై కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు. మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని నాగర్​కర్నూల్ జిల్లా  కల్వకుర్తి మండలం విశ్వబ్రాహ్మణులు డిమాండ్ చేసి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. విశ్వకర్మల మనోభావాలను దెబ్బతీసిసేలా మాట్లాడిన కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని సిద్దిపేట జిల్లా దుబ్బాక వడ్రంగి సంఘం అధ్యక్షులు సుంకోజి శంకర్ డిమాండ్ చేశారు. విశ్వబ్రాహ్మణ సమాజానికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని సిద్దిపేట స్వర్ణకార సంఘం నాయకులు చొప్పదండి విద్యాసాగర్ చారి, చంద్రశేఖర్ చారి డిమాండ్ చేశారు. ఆలేరు పోలీస్​స్టేషన్​లో కేటీఆర్​పై ఫిర్యాదు చేశారు. ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు. భువనగిరిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని వారిని స్టేషన్‌‌కు తరలించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. జయశంకర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి నిజాంసాగర్ చౌరస్తాకు చేరుకుని రాస్తారోకో చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద  ధర్నా చేశారు.  నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్‌‌‌‌లో విశ్వబ్రహ్మణులు మంత్రి ఫ్లెక్సీకి నివాళులర్పించి నిరసన తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్​పేట్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ కార్పొరేటర్ భిక్షపతి చారి ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో విశ్వబ్రాహ్మణులు ర్యాలీ తీసి నిరసన తెలిపారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో దిష్టిబొమ్మను తగులబెడుతుండగా పోలీసులు లాక్కున్నారు. దీంతో విశ్వబ్రాహ్మణులు  హైవేపై బైఠాయించి ధర్నా చేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధిలోని జనవాడ గ్రామంలో విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో కేటీఆర్‌‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. హైదరాబాద్‌‌లోనూ మంత్రి కేటీఆర్ కామెంట్లపై నిరసనలు వెల్లువెత్తాయి. కేటీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారోజు జగ్జీవన్ డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ.. దహనం చేశారు. ఈ ఆందోళనలో టీఆర్ఎస్ లీడర్లు పాల్గొన్నారు. కాగా, కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన తెలిపిన విశ్వబ్రహ్మణులపై ఎల్బీనగర్​పోలీసులు కేసు నమోదు చేశారు.

నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్న: కేటీఆర్‌‌‌‌
ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో తాను విశ్వ బ్రాహ్మణులను (చారీలను) కించపరిచినట్టుగా కొందరు చేస్తున్న ప్రచారం అవాస్తవమని మంత్రి కేటీఆర్‌‌‌‌ అన్నారు. ఒక కులాన్ని, వర్గాన్ని తక్కువ చేసే మాట్లాడే కుసంస్కారిని తాను కాదని శనివారం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక నాయకుడిని ఉద్దేశించి ఆ మాటను అన్నానని, ఈ వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడితే ఆ మాటను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.