ఏం అభివృద్ధి చేశారని వచ్చిన్రు?

ఏం అభివృద్ధి చేశారని వచ్చిన్రు?
  •    ఎమ్మెల్యేలు సతీశ్, భాస్కర్ రావుకు నిరసన సెగ
  •     నిరసన తెలిపిన వారిపై సతీశ్  అనుచరుల దాడి 
  •     ఇద్దరు యువకులు, ఓ రిపోర్టర్​ కు స్వల్ప గాయాలు

భీమదేవరపల్లి/మిర్యాలగూడ, వెలుగు : ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే సతీశ్ కు గ్రామస్థులు షాక్​ ఇచ్చారు. గ్రామంలో ఏం అభివృద్ధి చేశారంటూ సొంత పార్టీ కార్యకర్తలతో పాటు గ్రామానికి చెందిన కొందరు యువకులూ ఆయనను నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే వెంట ఉన్న అనుచరులు నిరసనకారులపై దాడికి దిగారు. ఇందులో ఇద్దరు యువకులు, ఓ రిపోర్టర్​  స్వల్పంగా గాయపడ్డారు. 

ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రసూల్​ పల్లిలో గురువారం జరిగింది. హుస్నాబాద్​ ఎమ్మెల్యే ఒడితల సతీశ్​ కుమార్​ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గురువారం ప్రచారానికి వెళ్లారు. భీమదేవరపల్లి మండలం రసూల్​ పల్లిలో ప్రచారం చేస్తుండగా గ్రామానికి చెందిన కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామస్థులు.. ఏం అభివృద్ధి చేశారంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. 

అభివృద్ధి చేయకుండా ఓట్ల కోసం ఎలా వస్తారని, ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​ డౌన్​ డౌన్​ అంటూ నినాదాలు చేశారు. దీంతో నిరసనకారులను ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు,  న్యూస్​ కవరేజీ చేస్తున్న ఓ రిపోర్టర్​ కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయంపై బీఆర్ఎస్​ గ్రామ నాయకులు  మాట్లాడుతూ కొంతమంది బీజేపీ నాయకులు మద్యం మత్తులో అడ్డుకునే ప్రయత్నం చేశారని, అందుకే  తోపులాట జరిగిందన్నారు. ఎమ్మెల్యే సతీశ్  కుమార్​ మాట్లాడుతూ కొంత మంది నాయకులు అనవసరంగా యువతను రెచ్చగొడుతూ వారి జీవితాలను ఆగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్​ 80 నుంచి 100 సీట్లు గెలుస్తుందన్నారు. ప్రచారంలో జడ్పీ చైర్మన్​  డాక్టర్  సుధీర్​ కుమార్, ఎంపీపీ జక్కుల అనిత, జడ్పీటీసీ వంగ రవి తదితరులు పాల్గొన్నారు.

భాస్కర్  రావుకూ తప్పని నిలదీత

హ్యాట్రిక్  విజయంసాధించాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా గురువారం మిర్యాలగూడ మండలం ఆలగడప నుంచి ప్రగతి యాత్ర పేరిట చేపట్టిన కార్యక్రమంలో ఆయనకు నిరసన ఎదురైంది. డబుల్  బెడ్రూం ఇండ్లు ఎప్పడు ఇస్తారని, బీసీ, దళిత బంధులను ఏకపక్షంగా ఇచ్చారని స్థానికులు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గృహలక్ష్మి పథకంలోనూ అనర్హులను ఎంపిక చేశారని మండిపడ్డారు. 

దీంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్  కార్యకర్త సత్య ప్రసాద్ తో పాటు ఇంకొందరూ తమపై దాడి చేశారని ఆలగడప వాసులు ఆరోపించారు. అనంతరం ఎమ్మెల్యే జాలుబాయి తండా, రాయినిపాలెం, ముల్కల కాల్వ గ్రామాల్లోనూ ప్రచారం చేశారు. అక్కడా ఆయనకు స్థానికుల నుంచి నిరసన ఎదురైంది.

మాజీ ఎంపీటీసీపై బీఆర్ఎస్  కార్యకర్తల దాడి

తుంగతుర్తి, వెలుగు : అర్హులకు సంక్షేమ పథకాలు ఎప్పుడిస్తారని ఎమ్మెల్యేను నిలదీసిన మాజీ ఎంపీటీసీ కవితపై బీఆర్ఎస్  కార్యకర్తలు దాడికి దిగారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల పరిధిలోని గోరంట్ల గ్రామంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన జరిగింది. గురువారం గోరంట్లలో ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కవిత.. డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ పెండింగ్ తో పాటు గృహలక్ష్మి, బీసీ, దళిత బంధు స్కీంలు ఎవరికీ రాలేదని, ఎప్పుడు ఇస్తారని కిశోర్ ను ప్రశ్నించారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు తమ నాయకుడినే ప్రశ్నిస్తారా అంటూ ఆమెపై దాడికి దిగారు. 

బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలపై  కర్రలతో దాడిచేశారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందలేదని ఎమ్మెల్యే కిశోర్ ను అడిగినందుకు  మహిళ అని కూడా చూడకుండా తనపై గూండాలతో కొట్టించారని కవిత ఆరోపించారు. దాడి చేసిన వారిని వదిలేసి, దెబ్బలు తిన్న కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారని ఫైర్  అయ్యారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్  నాయకుడు పిడమర్తి రవి గోరంట్ల గ్రామానికి చేరుకొని కవితను, కాంగ్రెస్ కార్యకర్తలను పరామర్శించారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.