శ్రీలంకలో తిరగబడిన జనం..

శ్రీలంకలో తిరగబడిన జనం..

శ్రీలంకలో ప్రజలు తిరగబడ్డారు. అధ్యక్షుడి నివాసాన్ని చుట్టుముట్టారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో సైన్యం చేతులెత్తేసింది. ఇంట్లోకి వెళ్లిన నిరసనకారులు అక్కడున్న ఆహారాన్ని తిన్నారు. కొంతమంది అక్కడున్న వస్తువులను తీసుకున్నారు. అధికారిక నివాసంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అధ్యక్షులు గొటబయ రాజపక్స అధ్యక్ష పదవీ బాధ్యతల నుంచి దిగిపోవాలంటూ.. కొలంబోలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు చెలరేగాయి. రాజధాని కొలంబోలోని అధ్యక్షుడి నివాసానికి పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు చొచ్చుకొచ్చారు. నిరసనకారులు రాకుండా ఉండేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కొలంబోలోని గాలే క్రికేట్ స్టేడియం బయట కూడా నిరసన కారులు పెద్ద ఎత్తున గుమికూడారు.

భద్రతా బలగాల బారికేడ్లను దాటుకుని మరీ లోపలికి ప్రవేశించారు. నిరసనకారుల చేతుల్లో శ్రీలంక జెండాలు కనిపించాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పలువురు గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన ఇంటెలిజెన్స్  లంక అధ్యక్షుడు రాజపక్సను ఆర్మీ ప్రధాన కార్యలయానికి తరలించారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరత తీవ్రం కావడంతో దేశాధ్యక్షులు రాజపక్స, ప్రధాని విక్రమ సంఘేకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమయ్యాయి. తిండికి, మందులకు ఇతర అత్యవసరాలకు సైతం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చుక్క పెట్రోల్ దొరకడం లేదు. ఖజానాలో డబ్బులు లేకపోవడంతో ప్రజలు విసిగివేసారి అధ్యక్ష భవనంపైకి దాడికి దిగారు.