గ్రేటర్ వ్యాప్తంగా బీజేపీ నేతల నిరసనలు

గ్రేటర్ వ్యాప్తంగా బీజేపీ నేతల నిరసనలు

శంషాబాద్/మెహిదీపట్నం/ఓయూ/వెలుగు: రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఇంటిపై టీఆర్ఎస్ నేతలు, జాగృతి గూండాలు దాడి చేశారని మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. దాడికి నిరసనగా ఆరాంఘర్ చౌరస్తా వద్ద శ్రీనివాస్​రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు. అలాగే అర్వింద్ ​ఇంటిపై దాడిని ఖండిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉమారాణి, గోల్కొండ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్వాల ఇంద్రసేనారెడ్డి, ఎస్సీ మోర్చా కార్వాన్ ఇన్​చార్జ్​పూర్ణచంద్రరావు లంగర్ హౌస్ పీఎస్‌‌లో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ లీడర్ల దాడులను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. దాడులకు బీజేపీ కార్యకర్తలు భయపడరని చెప్పారు. ఓయూ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి నాయకులు ఓయూ ఎన్ సీసీ గేట్​వద్ద ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మను దహనం చేశారు. జేఏసీ లీడర్​సురేశ్ యాదవ్ మాట్లాడుతూ.. దొర అహంకారంతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. కవిత అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎంపీ అర్వింద్​ఇంటిపై దాడి చేయించిందని ఆరోపించారు. బేషరతుగా అర్వింద్​కు కవిత క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.