గ్రేటర్ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల నిరసనలు

గ్రేటర్ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల నిరసనలు

బషీర్​బాగ్/మూసాపేట/ మేడిపల్లి/ మేడ్చల్/ నేరెడ్ మెట్/శంషాబాద్/ పరిగి, వెలుగు: దశాబ్ది ఉత్సవాలను నిరసిస్తూ గురువారం గ్రేటర్ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. నారాయణగూడ ఫ్లై ఓవర్ కింద ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విజయా రెడ్డి మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆర్ఎస్ సర్కారు ప్రజాధనాన్ని వృథా చేసిందన్నారు. కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో నారాయణగూడ పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అరెస్ట్ చేసి సుల్తాన్ బజార్ పీఎస్​కు తరలించారు. ట్యాంక్​బండ్​పై అమరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసే వరకు  పోలీసులు విజయారెడ్డిని పోలీస్ స్టేషన్​లోనే నిర్బంధించారు. రాత్రి 8 గంటలకు ఆమెతో పాటు నేతలను రిలీజ్ చేశారు.  బాలానగర్ చౌరస్తాలో పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు.

పీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు మేడ్చల్ పట్టణంలోని వివేకానంద విగ్రహం నుంచి తహసీల్దార్ ఆఫీసు వరకు ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ ఆధ్వర్యంలో నేరెడ్​మెట్ మెయిన్ రోడ్​లో, మల్కాజిగిరి ఆర్డీవో ఆఫీసు వద్ద నేతలు ఆందోళన చేశారు. పీసీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ యాదవ్ ఆధ్వర్యంలో బోడుప్పల్​లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద   కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. శంషాబాద్ బస్టాండ్ వద్ద నేతలు నిరసన తెలిపారు. కాంగ్రెస్ వికారాబాద్ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పరిగి పట్టణంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు.