బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. విపక్షాల ఆందోళనలతో ఉద్రిక్తత

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. విపక్షాల ఆందోళనలతో ఉద్రిక్తత

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి జాదవ్ బబ్లూ ఆత్మహత్యతో ఉద్రిక్తత ఏర్పడింది. PUC ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి జాదవ్ బబ్లూ హాస్టల్ గదిలో మంగళవారం (ఆగస్టు 8న) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి డెడ్ బాడీని బైంసా ఆస్పత్రిలోని మార్చురీకి తీసుకెళ్లారు. 

వ్యక్తిగత కారణాలతోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని ట్రిపుల్ ఐటీ వైస్ ఛాన్స్ లర్ వెంకటరమణ చెప్పారు. విద్యార్థులకు ఏదైనా సమస్య  ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు.విద్యార్థులు మనోధైర్యాన్ని  కోల్పోవద్దని,  తల్లిదండ్రుల కలలను సాకారం చేసే దిశగా ఆలోచించాలన్నారు.  

మరోవైపు.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ఎదుట బైంసా పట్టణ టీజేఏసీ విద్యార్థి విభాగం నాయకులు ఆందోళన చేపట్టారు. విద్యార్థి జాదవ్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేయడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. 

నిర్మల్ జిల్లా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. విద్యార్థి మృతదేహం చూసేందుకు కాంగ్రెస్ నేత శ్రీహరిరావును పోలీసులు అనుమతించలేదు. దీంతో కాంగ్రెస్ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. మార్చురీ వద్ద  బైఠాయించి.. నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్ వచ్చే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రొఫెసర్లు, అధికారులు ఏం చేస్తున్నారని బీజేపీ నేత మోహన్ రావు పటేల్ ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్తే నాయకులను అరెస్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే  విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, మృతిచెందిన విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.