
- రాష్ట్ర హోదాకు డిమాండ్
శ్రీనగర్: లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ లేహ్ సిటీలో బుధవారం చేపట్టిన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. పోలీసులతో పాటు ప్రైవేటు వాహనాలను ఆందోళనకారులు తగులబెట్టారు. బీజేపీ ఆఫీస్‌కు నిప్పుపెట్టారు. భద్రతా బలగాలపై రాళ్లతో దాడి చేశారు. పోలీసులు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు పౌరులు చనిపోగా.. 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ముందుగా లాఠీచార్జ్ చేశారు. పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
దీంతో మిగిలిన ఆందోళనకారులు రెచ్చిపోయారు. వెంటనే అందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. వాటర్ కెనాన్లతో నిరసనకారులను చెదరగొట్టారు. కాగా, ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో లేహ్జిల్లాలో కర్ఫ్యూ విధిస్తూ లడఖ్లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం జరిగిన అల్లర్ల వెనక కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన వారిని వదిలిపెట్టబోమని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, లడఖ్‌కు రాష్ట్ర హోదా కోరుతూ 15 రోజులుగా దీక్ష చేస్తున్న లడఖ్ ఉద్యమకారుడు, విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ బుధవారం తన నిరసన విరమించుకున్నారు.
డిమాండ్లపై కొనసాగుతున్న చర్చలు
లడఖ్‌కు రాష్ట్ర హోదాతో పాటు ఆరో షెడ్యూల్ పొడిగింపు డిమాండ్ చేస్తూ స్థానికంగా కొంతకాలంగా స్థానికంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 10 నుంచి 15 మంది బృందం ఆమరణ దీక్షకు దిగింది. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో 23న సాయంత్రం వారిని హాస్పిటల్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో లడఖ్ అపెక్స్ బాడీ యువజన విభాగం బుధవారం బంద్‌కు పిలుపు ఇచ్చింది.
ఉదయం పెద్ద సంఖ్యలో యువకులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేశారు. ఈ నేపథ్యంలో నిరసనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో యువకులను పోలీసులు చెదరగొట్టారు. ఫలితంగా ఉద్రిక్తత చోటు చేసుకున్నది. చివరికి పోలీసులు, భద్రతా బలగాలపై యువకులు రాళ్లదాడికి దిగారు. లోకల్ బీజేపీ ఆఫీస్‌లోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
అనంతరం ఆఫీస్‌కు నిప్పు పెట్టారు. పోలీసు వాహనాలనూ వదల్లేదు. ఒక్కసారిగా పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. వీటిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన పోలీసులు ఫైరింగ్ చేశారు. తర్వాత లేహ్ జిల్లాలో ఆంక్షలు విధించారు. కాగా, లేహ్ అపెక్స్ బాడీ, ప్రభుత్వానికి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. లడఖ్ ప్రజల డిమాండ్‌పై అక్టోబర్ 6న మరోసారి చర్చకు కేంద్రం అంగీకరించింది. ఈ క్రమంలో లేహ్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
దీక్ష ఆపేసిన వాంగ్‌చుక్
శాంతియుత నిరసన కాస్త హింసాత్మకంగా మారడంతో లడఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్.. 15 రోజులుగా చేపడ్తున్న తన దీక్షను విరమించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ఇది ‘జెన్-జెడ్ విప్లవం. లడఖ్‌ను 6వ షెడ్యూల్ కింద చేర్చాలి. రాష్ట్ర హోదా కల్పించాలి. శాంతియుత నిరసన కాస్త హింసాత్మకంగా మారడం బాధాకరం.
దీక్షలు, ధర్నాలు ఎలాంటి ఫలితాలు ఇవ్వకపోవడంతోనే యువత సహనం కోల్పోయారు. అందుకే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మృతి చెందిన యువకుల కుటుంబాకు సంతాపం ప్రకటిస్తున్నాను’’అని వాంగ్ చుక్ ప్రకటించారు.