‘సిటిజన్​షిప్​’​ బిల్లుపై చల్లారని ఈశాన్యం

‘సిటిజన్​షిప్​’​ బిల్లుపై చల్లారని ఈశాన్యం

గౌహతిలో పోలీసు కాల్పులు, నలుగురికి గాయాలు
 ‘సిటిజన్​షిప్​’​ బిల్లుపై మూడో రోజూ ఆందోళనలు
రైల్వేస్టేషన్లకు నిప్పు..  ఇంటర్నెట్సర్వీసులపై బ్యాన్పొడిగింపు
రైళ్లు, ఫ్లైట్లు క్యాన్సిల్‌.. త్రిపురలో స్కూళ్లు, కాలేజీలు బంద్
గౌహతి పోలీస్​ చీఫ్​ తొలగింపు‌.. అస్సామీలు దిగులుపడొద్దన్న ప్రధాని

న్యూఢిల్లీ, గౌహతి, అగర్తలాసిటిజన్‌‌‌‌షిప్‌‌‌‌ సవరణ బిల్లుపై నార్త్‌‌‌‌ఈస్ట్‌‌‌‌ రాష్ట్రాల్లో మూడో రోజూ ఆందోళనలు ఆగలేదు.  కర్ఫ్యూను కూడా లెక్కచేయకుండా ప్రజలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అస్సాం, త్రిపురలో గురువారం  టెన్షన్​ పరిస్థితులు నెలకొన్నాయి. వేలాదిమంది ఆందోళనకారులు కర్ఫ్యూని లెక్కచేయకుండా  గురువారం గౌహతి రోడ్ల  మీదకు వచ్చి సిటిజన్​షిప్​ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గౌహతిలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. పోలీస్​ ఫైరింగ్​లో తీవ్రంగా గాయపడ్డవారిలో ఒకరు గౌహతి మెడికల్ కాలేజీ హాస్పటిల్​ తీసుకువచ్చినప్పటికే చనిపోయాడు. మరొకరు ట్రీట్​మెంట్​ తీసుకుంటూ చనిపోయాడని అధికారులు చెప్పారు.    ఆందోళనకారులు రోడ్లపై టైర్లు తగలబెట్టారు. షాపులపై దాడిచేశారు.  గౌహతిలో బుధవారం రాత్రి నుంచే కర్ఫ్యూ పెట్టారు.  త్రిపురలోనూ   పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.   పరిస్థితిని అదుపులో ఉంచేందుకు  ఆ రాష్ట్రానికి అస్సాం రైఫిల్స్​ ఫోర్స్​ను  పంపారు. అస్సాంలోని చాలా సిటీల్లో  ఆందోళనకారులు రోడ్డుకు అడ్డంగా వెహికల్స్​ ఉంచారు.  నిరసనకారులు ఆరు వెహికిల్స్​కు నిప్పుపెట్టారు. రాష్ట్రాంలోని బీజేపీ, అస్సాం గణపరిషత్ కు చెందిన పలువురు​  నాయకుల ఇళ్లపై ఎటాక్ లు జరిగాయి.  డిబ్రుగఢ్​, సద్య, తేజ్​పూర్​లోని బీజేపీ ఆఫీసులపై ఆందోళనకారులు దాడులు చేశారు.   రైళ్లు, ఫ్లైట్లను క్యాన్సిల్‌‌‌‌ చేయడంతో టూరిస్టులు, జనం ఇబ్బందులు పడ్డారు. టీ వర్కర్లు పనులకు వెళ్లకుండా నిరసనల్లో పాల్గొన్నారు. స్టూడెంట్స్‌‌‌‌, సినీయాక్టర్లు కూడా ఆందోళన చేశారు.

రైల్వేస్టేషన్లకు నిప్పు

అస్సాంలో ఆందోళనకారులు రైల్వే స్టేషన్లకు నిప్పుపెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం శర్బానంద్‌‌‌‌ సోనోవాల్‌‌‌‌ సొంత ఊరు డిబ్రుగఢ్‌‌‌‌లోని చౌబువా, పానిటోల్ రైల్వేస్టేషన్లకు ఆందోళనకారులు బుధవారం అర్ధరాత్రి నిప్పుపెట్టారు.  దీంతో 12 కంపెనీల రైల్వే ప్రొటెక్షన్‌‌‌‌ స్పెషల్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌(ఆర్‌‌‌‌‌‌‌‌పీఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌)తో అక్కడ  సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.

ట్రైన్‌‌‌‌ సర్వీసులు రద్దు

త్రిపుర, అస్సాంకు అన్ని ట్రైన్‌‌‌‌ సర్వీసులు రద్దుచేశారు.  గౌహతి, కామఖ్య రైల్వే స్టేషన్లలో చిక్కుకున్న ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేశామని నార్త్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌ ఫ్రాంటియర్‌‌‌‌‌‌‌‌ రైల్వే అధికార ప్రతినిధి శుభానన్‌‌‌‌ చంద చెప్పారు. “ ట్రైన్లను మధ్యలోనే ఆపేస్తే ప్యాసింజర్లకు సెక్యూరిటీ ప్రాబ్లమ్‌‌‌‌ తలెత్తే అవకాశం ఉంది. అందుకే రైళ్లను రద్దు చేశాం” అని ఆయన చెప్పారు.

ఫ్లైట్లు బంద్‌‌‌‌.. ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌లోనే ప్రయాణికులు

ఢిల్లీ, ఇతర ప్రాంతాల నుంచి అస్సాంకు వెళ్లాల్సిన ఫ్లైట్లు గురువారం రద్దయ్యాయి. ఎయిర్‌‌‌‌‌‌‌‌ఇండియా, స్పైస్‌‌‌‌జెట్‌‌‌‌, ఇండిగో, విస్తారా ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌ ఫ్లైట్లను క్యాన్సిల్‌‌‌‌ చేయగా.. గో ఎయిర్‌‌‌‌‌‌‌‌, ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఏషియా ఇండియా డేట్‌‌‌‌ ఛేంజ్‌‌‌‌ ఫీజ్‌‌‌‌ను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఫ్లైట్‌‌‌‌ సర్వీసులు రద్దు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ లేకపోవడంతో ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌లోనే ఉండిపోయారు.

గౌహతీ పోలీస్‌‌‌‌ చీఫ్‌‌‌‌ తొలగింపు

లా అండ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ను అదుపు చేయలేకపోయారనే కారణంతో గౌహతీ సిటీ పోలీస్‌‌‌‌ చీఫ్‌‌‌‌ దీపక్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ను  డ్యూటీ నుంచి తొలగించారు. ఆయన ప్లేస్‌‌‌‌లో మున్నా ప్రసాద్‌‌‌‌ గుప్తాను అపాయింట్‌‌‌‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అడిషనల్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ పోలీస్‌‌‌‌ (లా అండ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌) సీఐడీ ఏడీజీపిగా ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేసి ఆయన స్థానంలో జి.పి. సింగ్‌‌‌‌ను నియమించారు. ఏడీజీపీ ఎస్‌‌‌‌ఎన్‌‌‌‌ సింగ్‌‌‌‌ ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ బిష్ణోయ్‌‌‌‌ని కూడా ట్రైనింగ్‌‌‌‌ అండ్‌‌‌‌ ఆర్మ్డ్‌‌‌‌ పోలీస్‌‌‌‌ ఏడీజీపీగా బదిలీ చేశారు. లా అండ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ను  రివ్యూ చేసేందుకు  ఏడీజీపీ ఎస్‌‌‌‌ఎన్‌‌‌‌ సింగ్‌‌‌‌, డిప్యూటీ ఇన్స్‌‌‌‌పెక్టర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌ పోలీస్‌‌‌‌ ఆనంద్‌‌‌‌ ప్రకాశ్‌‌‌‌ తివారీని నియమించినట్లు కమిషనర్‌‌‌‌‌‌‌‌ అశుతోష్‌‌‌‌ అగ్నిహోత్ర చెప్పారు.

విధ్వంసాన్ని  ప్రేరేపిస్తున్నది కాంగ్రెస్సే:  సర్కార్​

నార్త్​ఈస్ట్​లో  హింసను కాంగ్రెస్​ పార్టీనే ప్రేరేపిస్తోందని  కేంద్రం విమర్శించింది. ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో  హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్న అంశాన్ని గురువారం లోక్​సభలో  క్వశ్చన్​ అవర్​లో కాంగ్రెస్​ లీడర్​ అధిర్​ రంజన్​ చౌధురి ప్రస్తావించినప్పుడు  పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి ఈ  కామెంట్‌‌‌‌ చేశారు.  “ నార్త్​ఈస్ట్​లో ఇంటర్నెట్​ సర్వీసులు ఆగిపోయాయి.  కాశ్మీర్ లో ఇలాంటి పరిస్థితే చూశాం. అలాంటి పరిస్థితే ఇప్పుడు నార్త్​ఈస్ట్​లోనూ కొనసాగుతోంది”అని అధిర్​ సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై రియాక్ట్​ అయిన  మంత్రి ప్రహ్లాద్​ జోషి… దీనికంతటికీ కారణం కాంగ్రెస్​ అని అనడంతో కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. ​  ఆపార్టీ ఎంపీలు సభ నుంచి వాకౌట్​ చేశారు.  డీఎంకే సభ్యులు కూడా కాంగ్రెస్​కు మద్దతుగా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అస్సాం, త్రిపురలో నెలకొన్న పరిస్థితిపై  తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ కూడా లోక్​సభలో ప్రభుత్వాన్ని నిలదీసింది. ఆ రాష్ట్రాల్లో పరిస్థితిపై  ప్రభుత్వం  ప్రకటన చేయాలని తృణమూల్​  లీడర్​ సౌగత రాయ్​ జీరో అవర్​లో డిమాండ్​ చేశారు.