ఉప్పర్‌‌‌‌పల్లి గ్రామసభలో ప్రోటోకాల్ వివాదం..ఉద్రిక్తతల మధ్య సభ వాయిదా

ఉప్పర్‌‌‌‌పల్లి గ్రామసభలో ప్రోటోకాల్ వివాదం..ఉద్రిక్తతల మధ్య సభ వాయిదా

ఉప్పునుంతల, వెలుగు : నాగర్‌‌‌‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని ఉప్పర్‌‌‌‌పల్లిలో నిర్వహించిన గ్రామసభ ప్రోటోకాల్ వివాదం కారణంగా ఉద్రిక్తతకు దారితీసి, మధ్యలోనే వాయిదా పడింది. సర్పంచ్ బొజ్జ గీతారెడ్డి అధ్యక్షతన శుక్రవారం ప్రారంభమైన ఈ సభలో, ఆమె భర్త బొజ్జ అమరేందర్ రెడ్డి వేదికపై కూర్చోవడం వివాదానికి కేంద్రబిందువైంది. సర్పంచ్ భర్తకు అధికారిక సభలో వేదికపై కూర్చునే హక్కు లేదని కాంగ్రెస్ నాయకులు రవీందర్ రావు, అల్వాల్ గౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీనికి స్పందనగా, తాను సీఎం ప్రజావాణి ప్రవాసీ రాష్ట్ర కోఆర్డినేటర్‌‌‌‌నని అమరేందర్ రెడ్డి వాదించినప్పటికీ, అది కేవలం పార్టీ పదవి మాత్రమేనని నేతలు కొట్టిపారేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ గందరగోళ పరిస్థితుల దృష్ట్యా పంచాయతీ కార్యదర్శి ప్రదీప్ రావు గ్రామసభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.