- ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డికి పీఆర్టీయూటీ వినతి
హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వం అనాలోచితంగా తెచ్చిన 317 జీవో కారణంగా వేర్వేరు జిల్లాలకు విడిపోయిన ఉపాధ్యాయ దంపతులను వెంటనే ఒక్కచోట చేర్చాలని పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. చెన్నయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం ఆ సంఘం రాష్ట్ర నాయకులు ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
గతంలో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 243 ద్వారా ఇప్పటికే చాలా మంది దంపతులను ఒకే దగ్గరికి చేర్చిందని, ఇందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని వారు పేర్కొన్నారు. అయితే, ఇంకా మిగిలిపోయిన కొద్దిమంది దంపతుల బదిలీలను కూడా వెంటనే చేపట్టి వారికి న్యాయం చేయాలని కోరారు.
దీనికి నరేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేలోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్. చంద్రశేఖర్ రావు, నాయకులు ఓం ప్రకాశ్, శ్రీనివాస్, కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
