పబ్​జీ దోస్తు కోసం భర్తకు విడాకులు

పబ్​జీ దోస్తు కోసం భర్తకు విడాకులు

గుజరాత్ : ‘‘నాకు పబ్​జీ ఆడుతుంటే అందులో ఒకరితో పరిచయమైంది. లవ్​ చేస్తున్నా. నాకు నా భర్తతో విడాకులిప్పిస్తే అతడినే పెళ్లి చేసుకుంటా” అని మహిళా హెల్ప్​లైన్​ నంబర్​కు ఫోన్​ చేసిందో 19 ఏళ్ల అమ్మాయి. పబ్​జీ వ్యసనం జనాన్ని ఎంతలా పట్టిపీడిస్తోందో చెప్పేందుకు మరో ఉదాహరణ ఇది. ఈ ఘటన అహ్మదాబాద్​లో జరిగింది. ఆ అమ్మాయి రోజూ పబ్​జీ ఆడుతూ ఆ అబ్బాయికి చేరువైంది. ఇద్దరూ కలిసి పబ్​జీ ఆడేవాళ్లు. అది కాస్తా సాన్నిహిత్యాన్ని పెంచడంతో అతడితోనే కలిసి బతకాలనుకుంది. వెంటనే గుజరాత్​లో పెట్టిన ‘అభయం 181’కు ఫోన్​ కలిపింది. భర్తతో విడాకులిప్పించాలని కోరింది. దీంతో అభయం టీం ఓ కౌన్సిలింగ్​ టీంను ఏర్పాటు చేసింది. ఆ టీం ఆమె ఇంటికి వెళ్లింది.

కుటుంబ సభ్యులతో మాట్లాడింది. ఎప్పుడూ ఫోన్​ పట్టుకుని పబ్​జీ ఆడుతూనే ఉంటుందని కుటుంబ సభ్యులు కౌన్సిలింగ్​ టీంకు చెప్పారు. వద్దని చెబితే గొడవ పెట్టుకునేదని వాపోయారు. నిర్ణయంపై మరొక్కసారి ఆలోచించుకోవాలని ఆమెకు ఇన్​చార్జ్​ కౌన్సిలర్​ సోనాల్​ సంగథియా చెప్పారు. అప్పటివరకు పునరావాస కేంద్రానికి తీసుకెళతామని చెబితే అందుకు ఆమె నిరాకరించింది. అక్కడ ఫోన్​ ఇవ్వరు కాబట్టి రానని తెగేసి చెప్పింది. దీంతో ఆమెను కౌన్సిలర్లు బలవంత పెట్టలేదు. ఆమెకున్న ఆప్షన్లను మాత్రం వివరించారు. ఆలోచించుకోవడానికి కొంత టైం కావాలని, ఏదైనా సాయం కావాల్సి వస్తే మళ్లీ ఫోన్​ చేస్తానని కౌన్సిలర్​కు ఆమె చెప్పింది.