యాక్టర్​ చెప్పిండని దొడ్లు కడిగే కూల్​డ్రింక్స్​తాగుతున్నరు

యాక్టర్​ చెప్పిండని దొడ్లు కడిగే కూల్​డ్రింక్స్​తాగుతున్నరు
  • ​​​​​అందరూ పాలు పితికే అమ్ముతున్నరా? :  మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

యాదాద్రి, వెలుగు: ‘కల్తీ ఎందులో లేదు? ఒక్క కల్లుపైనే చర్చ ఎందుకు’ అని ప్రొహిబిషన్, ఎక్సైజ్​శాఖ మంత్రి శ్రీనివాస్ ​గౌడ్​ అన్నారు. యాదాద్రి జిల్లా నందనంలో రూ.7 కోట్లతో ఏర్పాటు చేయనున్న నీరా సెంటర్​కు ఆయన శంకుస్థాపన చేశారు. తర్వాత బ్రోచర్ ​రిలీజ్​ చేసి నీరా తాగారు. ముందుగా ప్రభుత్వ విప్​ గొంగిడి సునీత మాట్లాడుతూ కొందరు క్లోరోఫాం కలుపుతుండడంతో కల్లుపై నమ్మకం తగ్గిందన్నారు. మంత్రి శ్రీనివాస్​గౌడ్​ మాట్లాడుతూ ‘రాష్ట్రంలో ఉత్పత్తయ్యే పాలు జంట నగరాల ప్రజల అవసరాలకే సరిపోతాయి. మిగతా పాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నయ్ ? యూరియాతో పాలు తయారు చేస్తున్నారని వార్తలు వింటున్నాం. పాలు అమ్మేటోళ్లు అందరూ పిండుతుంటే చూస్తున్నమా? పసుపులో బియ్యం పిండితో పాటు కెమికల్స్​ కలుపుతున్నరు. దీంతోటి క్యాన్సర్​ వస్తది. కారంలో చెక్కపొడి..దాల్చిన చెక్కలో దానిమ్మ పండు తొక్కలు కలుపుతున్నారని వింటున్నాం. వీటన్నింటిపై లేని చర్చ ఒక్క కల్లుపైనే ఎందుకు’ అని ప్రశ్నించారు. కుల వృత్తులను ప్రోత్సహించడంతో భాగంగానే నీరా సెంటర్​తో పాటు నాలుగు సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. నీరాకు వేదామృతం అని పేరు పెట్టినట్టు చెప్పారు. ఈ సందర్భంగా కూల్​డ్రింక్​లపై మండిపడ్డారు. పాయిఖానాలు కడిగే థమ్సప్​, కోకాకోలా, ఫెస్టిసైడ్స్​ కలిపే కూల్​డ్రింక్స్​ను సినిమా యాక్టర్​ చెప్పిండని తాగి, అమృతమైన కల్లును చీప్​డ్రింక్​గా అవహేళన చేస్తున్నారన్నారు. కల్లుపై నిందలు వేస్తున్నారన్నారు. సర్దార్ ​సర్వాయి పాపన్న పేరుతో ట్రస్ట్​ ఏర్పాటు చేసి రూ. 500 కోట్లతో గౌడ భవన్​ నిర్మించబోతున్నామని తెలిపారు. చెట్టుపై నుంచి పడి చనిపోయిన వాళ్లకు రైతుబంధు తరహాలో అకౌంట్​లో రూ. 5 లక్షలు వేసేట్టు చూస్తామని మంత్రి తెలిపారు. ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ లిక్కర్​తయారీ గీత కార్మికులకు శాపమైందన్నారు.  కాగా, కార్యక్రమానికి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్​ హాజరురాలేదు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డితో ఉన్న విభేదాల కారణంగా బూర నర్సయ్య గౌడ్​ రాలేదని టీఆర్ఎస్​ వర్గాలు అంటున్నాయి. కార్యక్రమంలో కలెక్టర్ ​పమేలా సత్పతి, ఎంపీపీ నరాల నిర్మల, జెడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, నందనం సర్పంచ్​ప్రభాకర్​ పాల్గొన్నారు.