హెల్త్ ఇన్సూరెన్స్ కు పెరిగిన ఇంపార్టెన్స్

హెల్త్ ఇన్సూరెన్స్ కు పెరిగిన ఇంపార్టెన్స్

హైదరాబాదీల అభిప్రాయం ఇది
పాలసీ కొనేందుకు 84 శాతం రెడీ
వెల్లడించిన మ్యాక్స్ బూపా సర్వే

హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాధి వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ గురించి హైదరాబాద్ వాసులకు మరింత అవగాహన వచ్చిందని మ్యాక్స్ బూపా ఇన్సూరెన్స్ కంపెనీ సర్వే వెల్లడించింది. మెజారిటీ ప్రజలు ఇన్సూరెన్స్ కొనడానికి సిద్ధమవుతున్నారని, ఇది తప్పనిసరని వారికి అర్థమయిందని పేర్కొంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్ కతా, లక్నో, పుణె, పాట్నా, జైపూర్, చండీగఢ్ లో ఈ సర్వే జరిగింది. కరోనా కు ముందు, ఆ తరువాత ఈ సర్వే జరిగింది. కరోనా వైరస్ ప్రజల ఆలోచనా తీరులో ఏ విధమైన మార్పులను తీసుకువచ్చింది.. ఆరోగ్యబీమా నుంచి ఏం ఆశిస్తున్నారు తదితర అంశాల గురించి సర్వేలో పాల్గొన్న వారిని ప్రశ్నించా రు. సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. కరోనా రాకముందు హైదరాబాద్ లో 22 శాతం మంది మాత్రమే ఆరోగ్య బీమా చేయించుకునే వాళ్లు. ఇప్పుడు పరిస్థితి మారింది. నగరంలోని 84శాతం మంది ప్రజలు కరోనా వంటి ఊహించని ఆపదలను ఎదుర్కొనేందుకు ఆరోగ్య బీమా ఇక తప్పనిసరి అని భావిస్తున్నారు. ఈ వ్యాధి రాకముందు హైదరాబాద్ జనాభాలో 75 శాతం మంది బీమా పాలసీని కొనడంలో లేట్ చేసేవాళ్లు. తమ కుటుంబం ఎంతో ఆరోగ్యంగా ఉందని, అనారోగ్యం బారిన పడే అవకాశాలు తక్కువ అని అనుకునేవారు! ఇప్పుడు 41 శాతం ప్రజలు పూర్తిస్థాయి ఆరోగ్య బీమా కోరుకుంటున్నారు. ట్రీట్మెంట్ ఖర్చులు విపరీతంగా పెరగడం, క్వారంటైన్లో ఉండాల్సి రావడం, ఎవరికైనా వ్యాధి సోకే చాన్సులు ఉండటం, ఆదాయం తగ్గడం వంటివి ప్రజలు ఆరోగ్య బీమా కొనేలా చేస్తున్నాయి.

మరింత ప్రీమియానికి రెడీ
కరోనా నుంచి రక్షణ పొందేందుకు గాను రానున్న 1-2 నెలలకు మరింత ప్రీమియం చెల్లించేందుకు కూడా రెడీగా ఉన్నామని సర్వేలో పాల్గొన్న వారిలో 68 శాతం చెప్పారు. ట్రీట్మెంట్ ఖర్చులు గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో పెరిగాయని 89 శాతం మంది అన్నారు. పిల్లల చదువు, పెళ్లి, రిటైర్ మెంట్ కార్పస్, కుటుంబ సభ్యుల సంక్షేమం వంటి ఇతర ముఖ్యమైన ఖర్చుల కంటే కూడా బీమాకే ఇంపార్టెన్స్ ఇస్తామని తెలియజేశారు. తమ కుటుంబ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నామని 71 శాతం మంది మహిళలు అన్నారు. పెద్దవారిలో కరోనా వైరస్ కు గురయ్యే ముప్పు అధికంగా ఉండడంతో, పురుషుల్లో 80 శాతం మంది తమ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. ‘‘కరోనా ట్రీట్మెంట్ ఖర్చులను భరించేందుకు మేం హాస్పిటలైజేషన్ ప్లాన్స్ ను అందిస్తామని మాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ నికా అగర్వాల్ చెప్పారు.