ఖమ్మంలో పల్లె పల్లెలో ప్రజాపాలన షురూ

ఖమ్మంలో పల్లె పల్లెలో ప్రజాపాలన షురూ
  • ఉమ్మడి జిల్లాలో తొలిరోజు బారులు తీరిన దరఖాస్తుదారులు          
  • సభలను ప్రారంభించిన ఎమ్మెల్యేలు.. పరిశీలించిన అధికారులు 

భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం నెట్​వర్క్, వెలుగు  : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజా పాలన ప్రోగ్రామ్​కు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. గురువారం నుంచి ప్రజాపాలన ప్రోగ్రామ్​ మొదలైంది. ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రజల వద్ద నుంచి అధికారులు దరఖాస్తులు తీసుకున్నారు. ఖమ్మం సిటీలోని 29వ డివిజన్ ప్రొఫెసర్ జయశంకర్ పార్క్, ముదిగొండ మండలం ఖానాపురం, నేలకొండపల్లి మండలం ఆరెగూడెం గ్రామాల్లో నిర్వహించిన సభల్లో ఖమ్మం కలెక్టర్ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఖమ్మంలోని నూతన కలెక్టరేట్‌ మీటింగ్​ హాల్​లో  కలెక్టర్​ మీడియాతో మాట్లాడారు. 

గురువారం ఖమ్మం జిల్లాలో 104 గ్రామపంచాయితీల్లో, 18 వార్డులలో గ్రామ సభల ద్వారా 25,531 దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. గ్రామ సభల రోజు దరఖాస్తులు  సమర్పించని వారు ఆందోళన చెందనవసరం లేదని, తరువాత కూడా ఆయా గ్రామ పంచాయితీల్లో, వార్డుల్లో దరఖాస్తులు తీసుకుంటారని తెలిపారు. కొత్త రేషన్‌ కార్డు దరఖాస్తుదారులు కుటుంబ సభ్యులకు సంబంధించిన యజమాని కార్డు నంబరు నమోదు చేయాలన్నారు. 

ఎవరికైనా దరఖాస్తు ఫారం అందని పక్షంలో ప్రభుత్వ వెబ్‌సైట్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో సైతం అందుబాటులో ఉంటుందని, దాన్ని ప్రింట్​ తీసుకోవచ్చని సూచించారు.  అశ్వాపురం మండలంలోని అమెర్ధలో నిర్వహించిన సభను అడిషనల్​కలెకటర్​ పి.రాంబాబు పరిశీలించారు. దరఖాస్తు స్వీకరణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిరాక్స్​ సెంటర్ల యజమానులు ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తే షాప్​లను సీజ్​ చేస్తామని హెచ్చరించారు. పలు ప్రాంతాల్లో ఆయా మండలాల అధికారులు పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. 

పలుచోట్ల ఎమ్మెల్యేలు.. 

ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు మున్సిపల్​ చైర్మన్​ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, సత్తుపల్లి పట్టణ పరిధిలోని గుడిపాడు, హనుమాన్ నగర్ లో, పెనుబల్లి , వేంసూరు మండలాలలో ఎమ్మల్యే మట్టా రాగమయి దయానంద్ ప్రజాపాలన సభలను ప్రారంభించారు. 

పాల్వంచ పట్టణం లోని గాంధీనగర్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ జి వినీత్, డీఎస్పీ వెంకటేశ్​ పరిశీలించారు. మధిర మండలం నక్కలగరుబులో జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు, మధిర మండలం సైదల్లిపురంతోపాటు ఆయా గ్రామాల్లో స్పెషల్​ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీపీలు, ఇతర నాయకులు పర్యవేక్షించారు.

కొన్నిచోట్ల ఇబ్బందులు.. 

కొత్తగూడెం మున్సిపాలిటీలో ఒకటో వార్డు ప్రజా పాలన ప్రోగ్రామ్ బూడిదగడ్డ ప్రైమరీ స్కూల్​లో ఉంటుందని ఆఫీసర్లు షెడ్యూల్​లో ప్రకటించారు. కాగా ప్రస్తుతం బూడిదగడ్డలోని స్కూల్​ వద్ద అనుకొని ప్రజలంతా అక్కడికి వచ్చారు. తీరా ఆఫీసర్లు వార్డు ప్రజలకు సమాచారం ఇవ్వకుండా గతంలో మూసి వేసిన స్కూల్​లో ప్రోగ్రామ్​ పెట్టడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. చాలా చోట్ల నిర్వహించిన ప్రోగ్రామ్​లో దరఖాస్తులు లేక ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.  

ఒక కుటుంబానికి ఒకే దరఖాస్తు ఇవ్వడంతో ఆఫీసర్ల పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేవారు. అప్లికేషన్స్ నింపడంలో తప్పులు దొర్లితే ఇంకో దరఖాస్తు పత్రం ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. కౌంటర్ల వద్ద అదనంగా అప్లికేషన్లు ఉంచాలని కోరారు. గుండాల మండలంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రోగ్రామ్​గురించి తమకు సమాచారం ఇవ్వలేదని ప్రజాప్రతినిధులు ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.