ఐటీ కారిడార్ వైపు అమ్మకాలు ఎక్కువ

ఐటీ కారిడార్ వైపు అమ్మకాలు ఎక్కువ
  • కొత్త ప్రాజెక్టుల్లో 18 శాతం అక్కడే నిర్మాణాలు
  • మౌలిక వసతులు, వెస్ట్రన్ కల్చర్ లోను స్పీడ్​ 
  • ఇటువైపే ఎక్కువగా పెరుగుతున్న డిమాండ్
  • లగ్జరీ లైఫ్​ కావాలనుకునేవారి ఇంట్రెస్ట్​

హైదరాబాద్, వెలుగు: కోర్​సిటీ కంటే ఐటీ కారిడార్ హాట్​కేక్​గా మారింది.  సొంతింటిని కొనేవారు ఆల్ టైం హాట్ ఫేవరేట్ గా ఉంటుందని ఎక్కువగా అటు వైపే కొంటున్నారు. భవిష్యత్​అవసరాలు, వర్క్ ప్లేస్ కు దగ్గరగా ఉండడంతోపాటు ఇంటర్నేషనల్ స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగ, ఉపాధికి ఐటీ కారిడార్ బెస్ట్​ప్లేస్​గా ఉంది. కొత్త ప్రాజెక్టులు కూడా ఎక్కువగా వస్తుండగా, ఆ ఏరియాలోనే సెటిలవ్వాలని తీసుకుంటున్నారు.  రీ సేల్ కు కూడా డిమాండ్ ఉండడమే కాకుండా రెంటల్ ఇన్ కమ్​కూడా ఎక్కువగా వస్తుందని గచ్చిబౌలి నుంచి పుప్పాలగూడ వరకు కొనుగోలుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇంటర్నేషనల్​ఎయిర్ పోర్టు, ఔటర్​రింగ్​రోడ్డు, విశాలమైన ఇంటర్ సిటీలోని రోడ్లతోపాటు, మౌలిక వసతులు ఇతర ప్రాంతాల కంటే మెరుగ్గానే ఉన్నాయి. దీంతో కొత్తగా వచ్చే ఐటీ కంపెనీలు కూడా ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ సమీపంలో నెలకొల్పేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు.  రియల్ ఎస్టేట్ లో వచ్చే భారీ ప్రాజెక్టులు ఉంటున్నాయి. దీంతో ఎప్పటిలాగే ఐటీ కారిడార్ లో వచ్చే ప్రాజెక్టుల సంఖ్య, జరిగే అమ్మకాలు కూడా ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి.  

మౌలిక వసతులే ప్రధానాంశం
సిటీతో పోల్చితే హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, పీరం చెరు, కోకాపేట్, గోపన్ పల్లి, నల్లగండ్ల వంటి ప్రాంతాలు లగ్జరీ అపార్టుమెంట్లతో పాటు, విల్లా ప్రాజెక్టులు ప్రధాన కేంద్రంగా మారాయి. దీంతో విలాసవంతమైన జీవన శైలి, మెరుగైన సౌలతులు ఉంటుండగా  ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారు. గతేడాది ద్వితీయార్థంలో మొత్తం19,024 యూనిట్లు లాంచ్​చేయగా, ఇందులో 64 శాతం కేవలం వెస్ట్ సిటీలోనే ఉన్నాయి. ఇందులో 12 వేల యూనిట్ల అమ్మకాలు పూర్తయ్యాయి. కరోనా కారణంగా కొత్త ప్రాజెక్టుల లాంచింగ్​కంటే ఉన్న ఇన్వెంటరీని అమ్ముకునేందుకు బిల్డర్లు ప్రాధాన్యత నిస్తుండగా మార్కెట్ లో అమ్మకాలు, కొనుగోలు భారీగా జరిగినట్లుగా నైట్ ఫ్రాంక్ సంస్థ స్టడీలో తేలింది. 

ప్రతికూలతలు కూడా..
లగ్జరీ లైఫ్ స్టైల్ కోరుకునేవారిలో ఎక్కువగా ఐటీ, బ్యాంకింగ్ ఎంప్లాయీస్​తో పాటు ప్రొఫెషనల్ జాబర్స్​కూడా ఉంటున్నారు. ఇలాంటి వారికి అనుమైన ప్రాంతంగా ఐటీ కారిడార్  ఉంది.  దీనికి తోడు సిటీ నలువైపుల నుంచి ఐటీ కారిడార్ కు ఈజీగా చేరుకునే ట్రాన్స్​పోర్టేషన్​ ఉంది. విద్యా, వైద్య, రిక్రియేషనల్ సౌలతులు ఉండగా వెస్ట్ సిటీలో ఉండేందుకే చూస్తున్నారు . డిమాండ్ కు తగినట్లుగా రోడ్లు, రవాణ, తాగునీరు,  పర్యావరణ సమతుల్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని టౌన్ ప్లానింగ్ ఎక్స్​పర్ట్స్​పేర్కొంటున్నారు. కరోనా వచ్చాక ఐటీ కారిడార్​లో జనాల రద్దీ చాలావరకు  తగ్గిపోయింది. పూర్తిస్థాయిలో ఎంప్లాయీస్​వస్తే  ట్రాఫిక్ జామ్​లు, వెహికల్ పొల్యుషన్ కు ప్రధాన కేంద్రంగా మారొచ్చని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రాజెక్టులకు ఫుల్ డిమాండ్
ఐటీ కారిడార్ లోని రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు ఫుల్ డిమాండ్ ఉంది. కొత్తగా కొనేవారు కూడా వర్క్ ప్లేస్ కు దగ్గరలోనే ఉంటుందనే ఇంట్రెస్ట్​చూపిస్తున్నారు. సిటీలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే ఐటీ కారిడార్ లో ప్రాజెక్టుల ధరలు ఎక్కువగానే ఉంటాయి. అయినా రీ సేల్ కు డిమాండ్ ఉండడంతోనే కొంటున్నారు.   ప్రస్తుతం ఐటీ కారిడార్ ఏరియాలో చదరపు అడుగుకు రూ. 7 వేల నుంచి మొదలవుతుంది. మౌలిక వసతులు, రవాణ సదుపాయాలను బట్టి రేట్లు పెరుగుతుంటాయి. 
–  మహేందర్, ఓ కంపెనీ సేల్స్ మేనేజర్

బడ్జెట్ ఇంటి కోసం చూస్తున్నా..
ఐటీ కారిడార్ లో సౌలతులు బాగుండగా ప్రాజెక్టులు ఆకట్టుకుంటున్నాయి. నిర్మాణ శైలి కూడా డిఫరెంట్, ప్రస్తుత తరానికి నచ్చేట్లుగా ఉంటున్నాయి. ధరలు ఎక్కువగా ఉన్నా ఆఫీసుకు సమీపంలో ఉంటుండగా కొనేందుకు ప్రయారిటీ ఇస్తున్నారు. సిటీలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే రెంటల్ ఇన్ కం కూడా ఎక్కువగా వస్తుందని బడ్జెట్ లో ఉండే ఇంటి కోసమే చూస్తున్నాం.
- అభినవ్, ప్రైవేటు బ్యాంక్ ఉద్యోగి

నలువైపులా డెవలప్​కావాలె 
ఒకే ఏరియాలో డెవలప్ మెంట్ఉంటే కొంతకాలానికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.  బిల్డర్లు కూడా డిమాండ్ ప్రాంతాల్లోనే ఫోకస్ చేస్తుంటారు. అటు వైపే ప్రాజెక్టులు వస్తుండగా  వెస్ట్ సిటీలోని అభివృద్ధికి కారణంగా ఉంది. సిటీ నలువైపులా రియల్ బిజినెస్​కు ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ రూపొందించగా ఆ దిశగానే డెవలప్​కావాలి. ఇప్పటికే ఫార్మా సిటీ, డివైజ్ పార్క్, టెక్స్ టైల్ పార్కులు  చుట్టూ వస్తున్నాయి. 
- రాజశేఖర్ రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ