మిషన్​ భగీరథ మీటర్లు వాడకముందే ఖరాబ్​

మిషన్​ భగీరథ మీటర్లు వాడకముందే ఖరాబ్​

హనుమకొండ, వెలుగు : గ్రేటర్​ వరంగల్ లో ప్లానింగ్ లేని పనులతో ప్రజాధనం వృథా అవుతోంది. ప్రభుత్వం ఇంటింటికీ శుద్ధి చేసిన తాగునీటిని అందించేందుకు సిటీలో మిషన్​ భగీరథ పనులు చేపట్టింది.  ప్రతి ఇంటికీ కొత్త కనెక్షన్​ ఇచ్చిన ఆఫీసర్లు.. వాటికి స్మార్ట్​ వాటర్​ మీటర్లు ఏర్పాటు చేశారు. కానీ  అవన్నీ ప్రారంభానికి ముందే ధ్వంసమవుతున్నాయి. రీడింగ్​ను బట్టి పన్ను వసూలు చేస్తారనే ప్రచారం జరగడంతో కొందరు ఆ మీటర్లను తొలగించుకోగా..ఇంకొన్ని చోట్ల క్వాలిటీ లేని కారణంగా ధ్వంసమవుతున్నాయి. దీంతో పెద్ద మొత్తంలో ప్రజాధనం వృథా అయ్యిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రూ.20 కోట్లకు పైగానే ఖర్చు చేసిన్రు

​గ్రేటర్​ పరిధిలో 66 డివిజన్లలో 2.25 లక్షలకు పైగా ఇండ్లున్నాయి. వీటిలో ఇప్పటికే 1.15లక్షల ఇండ్లకు పాత నల్లా కనెక్షన్ ఉండగా.. మిగతా 1.10 లక్షల ఇండ్లకు కూడా కనెక్షన్స్​ఇచ్చేందుకు మిషన్​ భగీరథ స్కీం కింద పనులు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అమృత్​ స్కీం కింద గ్రేటర్ ​వరంగల్​లో  మొత్తం రూ.630 కోట్లతో  అవసరమైన ఫీడర్​ మెయిన్స్, డిస్ట్రిబ్యూటరీ లైన్స్​, నల్లాలు బిగించే పనులు చేపట్టారు. 2016లోనే పనులు ప్రారంభించి టార్గెట్​ప్రకారం 159.7 కిలోమీటర్ల ఫీడర్​మెయిన్స్, 1,575 కి.మీ. మేర డిస్ట్రిబ్యూటరీ లైన్స్​ వేశారు. దాదాపు 330.4 కి.మీ మేర పాత పైపులైన్​ రీప్లేస్ చేసి టార్గెట్​కు మించి 1.19 లక్షల ఇండ్లకు కనెక్షన్లు ఇచ్చారు. కాగా పాత వాటికి కాకుండా కొత్తగా ఏర్పాటు చేసిన ప్రతి నల్లాకు వాటర్​ మీటర్​ బిగించారు. ఇందులో ప్రతి మీటర్​కు రూ.వెయ్యి వరకు ఖర్చవుతుండగా, వాటిని బిగించడం, దిమ్మెలు కట్టడం వంటి పనులకు మరో రూ.500 వరకు ఖర్చు చేశారు.

ఇలా మొత్తం పనులకు దాదాపు రూ.20 కోట్ల వరకు వెచ్చించారు. ఇందులో వృథా ఎక్కువగా ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మీటర్ల ఏర్పాటులోనూ జనాల్లో అయోమయం ఉంది. మీటర్ల రీడింగ్​ఆధారంగా పన్ను విధిస్తారన్న ప్రచారం జరిగింది. కొత్త కనెక్షన్లకు మాత్రమే పెట్టి, పాత వాటికి పెట్టకపోవడంతో ఎందుకు మీటర్లు పెడుతున్నారో అర్థంకాని పరిస్థితి ఉంది. ప్రతి ఇంటికీ ఎన్ని నీళ్లు చేరుతున్నాయో లెక్కగట్టేందుకే మీటర్లు పెట్టామని ఆఫీసర్లు చెబుతుండగా.. మరి పాత కనెక్షన్లకు వెళ్లే నీళ్ల సంగతేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

కరాబ్​ చేస్తే చర్యలు తీసుకుంటాం..
గ్రేటర్​లోని ప్రతి ఇంటికి తాగునీటిని అందించేందుకు మిషన్​ భగీరథ పనులు పూర్తి చేశాం. ఒక్కో ఇంటికి ఎన్ని నీళ్లు వెళ్తున్నాయి.. వేస్టేజ్​ ఎంత.. లెక్క గట్టేందుకు వాటర్​ మీటర్లు ఏర్పాటు చేశాం. అంతే తప్ప పన్నులు పెంచడం కోసం కాదు. జనాలు అపోహలు పెట్టుకుని మీటర్లు కరాబ్​ చేస్తున్నారు. అలా చేయడం వల్ల గ్రేటర్​ ఆఫీసర్లు  రిపేర్ల భారం మళ్లీ సంబంధిత యాజమానులపైనే వేస్తారు. ఉద్దేశపూర్వకంగా  మీటర్లు కరాబ్ చేస్తే చర్యలు తీసుకుంటాం.
- రాజ్​ కుమార్​, పబ్లిక్​ హెల్త్​ ఈఈ, వరంగల్​