కాంగ్రెస్​ సర్కారుపై ప్రజా వ్యతిరేకత మొదలైంది : కేసీఆర్

కాంగ్రెస్​ సర్కారుపై ప్రజా వ్యతిరేకత మొదలైంది : కేసీఆర్
  • దుష్ప్రచారాన్ని నమ్మి.. ప్రజలు బీఆర్ఎస్​ను దూరం చేసుకున్నరు 
  • ఎంపీ ఎన్నికల్లో తిరిగి ప్రజాదరణ పొందాలె
  • స్వార్థం కోసం పార్టీని వీడేవారిని పట్టించుకోవద్దు 
  • మహబూబ్​నగర్ సీటు సిట్టింగ్ ఎంపీ శ్రీనివాస్​రెడ్డికే కన్ఫమ్ 
  • నాగర్ కర్నూల్​పై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి

హైదరబాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వందరోజులు కూడా కాకముందే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నదని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలన రోజురోజుకు దిగజారిపోతున్నదన్నారు. అమలుగాని హామీలిచ్చి, గ్యారంటీల పేరుతో ప్రజలకు లేనిపోని ఆశలు కల్పించి, ఎన్నికల తర్వాత ఆ పార్టీ మాట మర్చిందని విమర్శించారు. సమయంతో సహా ప్రకటించిన గ్యారంటీలను నెరవేర్చాలని ప్రజలు అడుగుతుంటే, సమాధానమివ్వడం చేతకాక అబద్ధాలు, బెదిరింపులకు దిగి తప్పించుకుంటోందని విమర్శించారు.

 మంగళవారం  తెలంగాణ భవన్ లో మహబూబ్​ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ల ముఖ్య నేతలతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికలకు ముందు ప్రత్యర్థుల దుష్ప్రచారాలకు ప్రభావితమై,  తమకు మంచిచేసే బీఆర్ఎస్ ను ప్రజలు దూరం చేసుకున్నారని అన్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలను దూరం చేసుకున్న సందర్భాలు చరిత్రలోనూ ఉన్నాయని పేర్కొన్నారు. తాము మోసపోయిన సంగతిని గ్రహించి, ఆ తర్వాత కొద్దికాలంలోనే వాస్తవాలను తెలుసుకొని తిరిగి ఆదరించారని గుర్తుచేశారు. 

ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజాక్షేత్రంలో ఉంటూ వారితో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి పోరాడాలని నాయకులకు సూచించారు. ఉద్యమకాలం నుంచీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ పనిచేస్తోందని, అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో ప్రజాదరణ పొందాలని పిలుపునిచ్చారు.

పాత పథకాలనూ అమలుచేయలేక పోతున్నరు.. 

కాంగ్రెస్ ప్రభుత్వం తాగు, సాగు నీరు, కరెంటు వంటి కనీస అవసరాలను తీర్చలేకపోవడంతో ప్రజలు విస్మయం చెందుతున్నారని కేసీఆర్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన పథకాలను కూడా కొనసాగించలేక తన పాలనలోని డొల్లతనాన్ని కాంగ్రెస్ పార్టీ బయటేసుకుంటూ అభాసుపాలవుతున్నదని చెప్పారు. తాను పాలమూరు ఎంపీగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించానని చెప్పారు. పాలమూరు నీటిగోసను తీర్చేందుకు, ఉద్యమ సారధిగా తాను చేసిన పోరాటాలను, ఉమ్మడి పాలమూరు జిల్లాను బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన విధానాన్ని కేసీఆర్ వివరించారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన పథకాలను, అభివృద్ధి పనులను ఆటంకపరచడమే లక్ష్యంగా కాంగ్రెస్  ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలను తీసుకుంటున్నదని కేసీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన ఎత్తిపోతల పథకం ద్వారానే కొడంగల్ కు పుష్కలంగా సాగునీటిని తరలించవచ్చని, అలా కాకుండా ఉన్నదాన్ని తీసేసి కొడంగల్ కు లిఫ్ట్ ను మార్చడం సరియైన నిర్ణయం కాదని కేసీఆర్ అన్నారు. ఇలాంటి అనేక అనాలోచిత నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారని,  రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు తగిన సమాధానం చెప్తారని అన్నారు.

వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. 

చేసిన మేలును మర్చిపోయి, స్వార్థంతో పార్టీని వీడుతున్న వారిని పట్టించుకోనవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. కష్టకాలంలో ప్రజలతో  నిలిచినవారే నిజమైన ప్రజానాయకులని అన్నారు. పోయేవాళ్ల గురించి ఆలోచించకుండా అందరం కలిసికట్టుగా ప్రజా సమస్యలమీద పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.“కష్టకాలంలో స్వార్థంతో వెళ్లిపోతున్న అవకాశవాదులకు భవిష్యత్తులో సందివ్వకూడదు సార్” అంటూ సమావేశంలో పాల్గొన్న నేతలు చేసిన సూచనకు సానుకూలంగా స్పందించిన కేసీఆర్..  అటువంటి వారిని తిరిగి ఆదరించబోమని స్పష్టం చేశారు.

పాలమూరు లోక్​సభ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి 

రాబోయే లోక్​సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డిని కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయాలను తీసుకొని శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆయన ఖరారు చేశారు. కాగా.. ముఖ్యనేతలతో మరోసారి చర్చించి నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిని ప్రకటిస్తా మని కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి పాల మూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రు లు, ప్రజాప్రతినిధులు, పలువురు ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు.