కొత్త మండలాల కోసం ఆగని లొల్లి..పల్వంచ ప్రకటనపై చర్చ

కొత్త మండలాల కోసం ఆగని లొల్లి..పల్వంచ ప్రకటనపై చర్చ

కామారెడ్డి, వెలుగు:  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా 5 మండలాలను ఏర్పాటు చేస్తూ ఫైనల్​ గెజిట్​నోటిఫికేషన్​ ఇచ్చింది. అయితే జిల్లాలో మరొక మండలం ఏర్పాటు చేయాలని డిమాండ్​ఉన్నప్పటికీ పెండింగ్​లో పెట్టింది.  దానికి తోడు  కొత్తగా మరో మండలం ఏర్పాటుకు ప్రపోజల్స్​రెడీ అవుతున్నాయన్న చర్చ జిల్లాలో సాగుతోంది. భవిష్యత్​లో రాజకీయంగా తమకు కలిసి వచ్చేలా మరికొన్ని మండలాల ఏర్పాటు చేయాలని  ప్రజా ప్రతినిధులు డిమాండ్ ​చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జుక్కల్​ నియోజక వర్గంలో మరో కొత్త మండలంతో పాటు, బిచ్కుంద ను రెవెన్యూ డివిజన్​ చేయాలంటూ ఇప్పటికే  చర్చ మొదలైంది. 

పల్వంచ మండలం ప్రకటనే..

కామారెడ్డి జిల్లాలో  జుక్కల్​ నియోజక వర్గంలోని డొంగ్లి,  నిజామాబాద్​ జిల్లా బాన్స్​వాడ నియోజక వర్గంలోని  పొతంగల్,  ఆర్మూర్​ నియోజక వర్గంలో  డొంకేశ్వర్, అలూర్,  బోధన్​లో  సాలుర మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం  గెజిట్​ రిలీజ్ ​చేసింది.  సాలుర మినహా మిగతా చోట్ల రెవెన్యూ కార్యకలాపాలు కూడా షురూ అయ్యాయి. కామారెడ్డి  జిల్లా  మాచారెడ్డి మండలం పల్వంచను కూడా  మండల కేంద్రంగా  ఏర్పాటు చేసేందుకు  ఫైనల్​నోటిఫికేషన్ ప్రక్రియ కంప్లీట్​అయ్యిందని, కొద్ది రోజుల్లోనే సంబంధించిన ఉత్తర్వులు  రానున్నాయని తెలుస్తోంది. పల్వంచ, ఫరీద్​పేట, వాడి, భవానిపేట, ఆరేపల్లి, వెల్పుగొండ,  ఇసాయిపేట, సింగరాయిపల్లి  గ్రామాలను కలిపి పల్వంచ మండలంగా  ఏర్పడనుందని చర్చ సాగుతోంది. 

తెరమీదకు కొత్తగా హన్మాజీపేట​

కామారెడ్డి,  నిజామాబాద్​ జిల్లాలోని  11 గ్రామాలను కలిపి  బాన్స్​వాడ మండలంలోని  హన్మాజీపేట కొత్త మండలంగా ఏర్పాటుకు  తాజాగా తెరమీదకు వచ్చింది.  స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి సూచనతో  కొత్త  మండలం ఏర్పాటుకు  ప్రపోజల్స్​ పంపాలని  జిల్లా ఆఫీసర్లను ప్రభుత్వం ఆదేశించింది. కామారెడ్డి జిల్లాలోని  బాన్స్​వాడ మండలంలోని  హన్మాజీపేట,  కొనాపూర్​, సంగోజిపేట,  కట్లాపూర్​, సోమ్లా నాయక్​ తండా,  పులిగుండు తండా,   నిజామాబాద్​ జిల్లా వర్ని మండలంలోని  పైడిమల్లె, చింతలపేట, చల్కాతండాలు ఇందులో  చేర్చనున్నారు.  ఈ గ్రామాలు  రెండు జిల్లాల పరిధిలో ఉన్నందున  ఇరు జిల్లాల నుంచి రిపోర్టులు ప్రభుత్వానికి పంపాల్సి ఉంది. స్పీకర్​శ్రీనివాస్​రెడ్డి సూచనతో హన్మాజిపేట మండలంగా ఏర్పాటు దాదాపు ఖాయమని  తెలుస్తోంది.

మహ్మద్​నగర్​ కోసం నేతల పట్టు

జుక్కల్​ నియోజక వర్గం.. నిజాంసాగర్​ మండలంలోని మహ్మద్​నగర్​ను కూడా మండలంగా ఏర్పాటు చేయాలని  స్థానిక నేతలు పట్టుబడుతున్నారు. గతంలోనే  మహ్మద్​నగర్​ ను మండల ఏర్పాటుకు ప్రపోజల్స్ రెడీ​ అయిన తర్వాత ఈ ప్రక్రియ మధ్యలో ఆగింది. దీంతో పాటే  ప్రతిపాదించిన మద్నూర్​ మండలంలోని డొంగ్లీ  ఇటీవల మండలంగా ఏర్పడింది. మహ్మద్​నగర్​ను ​ మండలంగా ఏర్పాటు చేయాలని అధికార పార్టీకి చెందిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే హన్మంతు షిండే పై ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలుస్తోంది. మహ్మద్​నగర్​ను మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తూ  ఇటీవల  కాంగ్రెస్​ ఆధ్వర్యంలో  రాస్తారోకో కూడా చేశారు.  వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్​కుంద ను రెవెన్యూ డివిజన్​గా ప్రకటించాలని, బాన్స్​వాడను జిల్లాగా ఏర్పాటు చేయాలని  ఇటీవల స్థానికులు ఆందోళనలు చేశారు. 

కలిసి వస్తుందని లీడర్ల ప్లాన్​..

వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని  స్థానిక ఎమ్మెల్యేలు కూడా కొత్త మండలాల ఏర్పాటుపై ఆసక్తితో ఉన్నారు.  ఆయా ఏరియాలో ప్రజలకు దగ్గరగా ఉండేలా మండలాలు ఏర్పాటు చేస్తే  కలిసి వస్తుందని భావిస్తున్నారు. కొత్త మండలాల ఏర్పాటు ప్రపోజల్స్​ మొత్తం మీద  రాజకీయంగా జిల్లాలో ఆసక్తి  రేకెత్తిస్తోంది.